ఇంట్లోనే ప్రాక్టీస్‌ చేస్తున్నా!

ABN , First Publish Date - 2020-07-03T09:04:59+05:30 IST

షూటింగ్‌ రేంజ్‌లో ప్రాక్టీస్‌.. పోటీల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలకు ప్రయాణం..లేదా స్కూల్‌..ఇదీ హైదరాబాద్‌ యంగ్‌గన్‌ ఇషా

ఇంట్లోనే ప్రాక్టీస్‌ చేస్తున్నా!

షూటింగ్‌ రేంజ్‌లో ప్రాక్టీస్‌.. పోటీల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలకు ప్రయాణం..లేదా స్కూల్‌..ఇదీ హైదరాబాద్‌ యంగ్‌గన్‌ ఇషా సింగ్‌ (15) సాధారణ డైరీ. అయితే, లాక్‌డౌన్‌తో ఊహించని విరామం లభించడంతో తనకిష్టమైన పెయింటింగ్స్‌ వేస్తూ, వంటలు చేస్తూ ఇషా ఆస్వాదిస్తోంది. ఇంట్లోనే షూటింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్‌ చేస్తోంది. భారత షూటింగ్‌ సమాఖ్య ఇటీవల ప్రకటించిన ఒలింపిక్‌ కోర్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న ఇషా సింగ్‌తో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ.  


హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్

కొవిడ్‌-19 వల్ల వేసవి సెలవులు ముందే వచ్చాయి. స్కూల్‌ మూతపడడం తప్ప లాక్‌డౌన్‌ వల్ల నా దినచర్యలో పెద్దగా వచ్చిన మార్పులేమీ లేవు. అయితే, నాకు ఇష్టమైన పెయింటింగ్‌కు అధిక సమయం కేటాయించడానికి అవకాశం దొరికింది. దీంతో పాటు యూట్యూబ్‌ సహాయంతో వంటగదిలో కొన్ని ప్రయోగాలు చేశా. లాక్‌డౌన్‌ కారణంగా ప్రాక్టీ్‌సను నిలిపేయకుండా ఇంట్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షూటింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేసుకొని సాఽధన చేస్తున్నా.


  ఒలింపిక్స్‌ కోర్‌ టీమ్‌లో..

టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో ప్లేయర్లకు మరోసారి ట్రయల్స్‌ నిర్వహించే అవకాశం రావచ్చు. అందుకే భారత షూటింగ్‌ సమాఖ్య ప్రతి విభాగంలోనూ తొలి నాలుగు స్థానాల్లో ఉన్న క్రీడాకారులతో ఓ జాబితాను రూపొందించింది. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గాక ఈ జాబితాను షార్ట్‌లిస్ట్‌ చేయడానికి జాతీయ స్థాయిలో ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఇందులో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికబద్ధంగా శిక్షణ కొనసాగిస్తున్నా. నా విభాగమైన పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మనుభాకర్‌ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది.


 షూటింగ్‌ రేంజ్‌లో....

బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో జిమ్‌కు కూడా వెళ్లడం లేదు. షూటింగ్‌ ప్రాక్టీస్‌ దగ్గర నుంచి వ్యాయామాలు వరకు అన్ని ఇంట్లోనే చేస్తున్నా. వ్యక్తిగత ట్రైనర్‌ ఇంటికొచ్చి ఫిట్‌నె్‌స కు సంబంధించిన వర్క్‌అవుట్స్‌ చేయిస్తున్నారు. నిద్ర లేవగానే కొద్దిసేపు యోగా చేస్తున్నా. ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని షూటింగ్‌ రేంజ్‌కు వెళ్లి ఫిట్‌నెస్‌ వర్క్‌అవుట్స్‌ చేసి నాలుగు గంటల పాటు కాంపిటేషన్‌ పద్ధతిలో ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఆ తర్వాత మానసిక ఉల్లాసం కోసం కొద్ది సేపు బొమ్మలు వేస్తున్నా. స్కెచ్‌లు వేస్తున్నంత సేపు నేను ఒక షూటర్‌ననే విషయం మర్చిపోతా. ఇక పదోతరగతి చదువుతున్న నాకు ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాస్‌లు మొదలయ్యాయి. వాటికి కూడా  తప్పని సరిగా హాజరవుతున్నా. ఇక గతంలో సాధించిన పతకాల తాలూకు నగదు ప్రోత్సాహకాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సివుంది. ఆ డబ్బు వస్తే మెరుగైన శిక్షణకు ఉపకరిస్తుంది. 


బేసిక్స్‌పై దృష్టి పెట్టా

‘సాయ్‌’ ఆన్‌లైన్‌ సెషన్స్‌ నిర్వహిస్తోంది. కోచ్‌లు సాధనకు సంబంధించిన విషయాలే కాకుండా గేమ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను వివరిస్తున్నారు. ప్రస్తుతానికి పోటీలు లేకపోవడంతో బేసిక్స్‌పై దృష్టి పెట్టా. ఎందుకంటే ఒక్కసారి పోటీలు ప్రారంభమైతే ఆ సన్నద్ధత వేరుగా ఉంటుంది కాబట్టి ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నా.

ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి (హైదరాబాద్‌ )

Updated Date - 2020-07-03T09:04:59+05:30 IST