దేశంలో ఖరీదైన నగరాల్లో Hyderabad.. ఎన్నో స్థానంలో ఉందంటే..!

ABN , First Publish Date - 2021-10-19T13:52:19+05:30 IST

ముంబై తర్వాత ఇళ్లు, ఫ్లాట్ల ధరలు హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నట్లు...

దేశంలో ఖరీదైన నగరాల్లో Hyderabad.. ఎన్నో స్థానంలో ఉందంటే..!

  • దేశంలో ఖరీదైన నగరాల్లో రెండో స్థానం
  • గృహా నిర్మాణాల్లో హైదరా‘బాద్‌షా’
  • ధరల పెరుగుదలలోనూ అదే ఒరవడి
  • ముంబై తర్వాత ఇక్కడే రెసిడెన్షియల్‌ ధరలు అధికం
  • ఈ ఏడాది ఆరు శాతం పెరుగుదల

భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ముంబై తర్వాత ఇళ్లు, ఫ్లాట్ల ధరలు హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నట్లు  ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఏటా ధరల పెరుగుదల ఇక్కడే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అహ్మదాబాద్‌ తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధికంగా పెరుగుదల ఉన్నట్లు స్పష్టం చేసింది.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు రోజు రోజుకు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రాప్‌టైగర్‌.కామ్‌ అధ్యయనం వెల్లడిస్తోంది. కొవిడ్‌-19 తర్వాత అన్ని రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ నిలకడగా కొనసాగుతుండగా, హైదరాబాద్‌ మహా నగరంలో దూకుడుగా ముందుకెళ్తోంది. ధరలు, పెరుగుదలలో దేశంలోని 8 మెట్రోపాలిటన్‌ నగరాల కంటే హైదరాబాద్‌ ముందంజలో ఉండడం గమనార్హం. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు గల మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.


దేశంలో పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత ఆర్థిక మాంద్య పరిస్థితులతో రియల్‌ ఎస్టేట్‌కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఆ తర్వాత కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ రియల్‌ ఎస్టేట్‌ను కోలుకోలేని స్థితికి చేర్చింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ అన్ని ఆర్థిక పరిస్థితులనూ ఎదురొడ్డి నిలిచింది. కొవిడ్‌-19 కారణంగా కొంత స్తబ్దత ఏర్పడినా తర్వాత గణనీయంగా పుంజుకుంది. కొవిడ్‌-19 సొంతింటి అవసరాన్ని పెంచడంతో గృహాల కొనుగోళ్లు అధికమయ్యాయి.


కొత్త యూనిట్ల ప్రారంభం..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయడంతో స్థానికులే ముందుకు వస్తున్నారు. మూడో త్రైమాసికంలో 7,812 ఇళ్లు, ఫ్లాట్ల యూనిట్లు అమ్ముడవ్వగా, రెండో త్రైమాసికంతో పోల్చితే 222 శాతం పెరిగింది. గతేడాదితో పరిశీలిస్తే 140 శాతం పెరిగింది. నగర శివారులోని బాచుపల్లి, తెల్లాపూర్‌, గండిపేట, దుండిగల్‌, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున విక్రయాలు జరిగాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 12,342 ఇళ్లు, ఫ్లాట్లకు సంబంధించిన ప్రాజెక్టులను పలు డెవల్‌పమెంట్‌ సంస్థలు, రియల్టర్లు ప్రారంభించారు. రెండో త్రైమాసికంతో పోల్చితే కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో 40 శాతం పెరుగుదల ఉంది. దుండిగల్‌, తెల్లాపూర్‌, గోపనపల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్‌ తదితర ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి.


గణనీయమైన పెరుగుదల..

దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలను ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు గల మూడో త్రైమాసికాన్ని పరిశీలిస్తే.. ముంబైలో చదరపు అడుగుకు అత్యధికంగా రూ.9600 - రూ.9800 మధ్య ధరలున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో కొన్నిచోట్ల చదరపు అడుగుకు రూ.5800- రూ.6వేల మధ్య ధరలున్నాయి. ఆ తర్వాత బెంగళూర్‌, చెన్నై, పుణె, ఢిల్లీలున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలోనూ హైదరాబాద్‌లో ఇళ్లు, ఫ్లాట్ల ధరల పెరుగుదల కూడా గణనీయంగా ఉంది. ఎనిమిది శాతం పెరుగుదలతో అహ్మదాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా, ఆరు శాతం పెరుగుదలతో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది.




Updated Date - 2021-10-19T13:52:19+05:30 IST