హైదరాబాద్: మత్తులోకి దించి కాటికి పంపాడు!

ABN , First Publish Date - 2020-10-22T11:48:28+05:30 IST

హత్య కేసును పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్: మత్తులోకి దించి కాటికి పంపాడు!

హైదరాబాద్/కొత్తపేట : పహాడీషరీఫ్‌ ఠా ణా పరిధిలో ఈ నెల 10న హత్యకు గురైన రౌడీషీటర్‌ సయ్య ద్‌వాహీద్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. హత్యకు వాడిన 2 బైకులు, ఆటో, 3కత్తులు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హత్య అనంతరం వారికి గోల్కొండ కోట సమీపంలోని ఇంట్లో ఆశ్రయం కల్పించిన మున్నీబీ(55) పరారీలో ఉంది. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు.


అనుమానంతో కాటికి పంపాడు.. 

రాజేంద్రనగర్‌లో ఉండే రౌడీషీటర్‌ సయ్యద్‌ వాహీద్‌ (30) కు మెహిదీపట్నం మల్లేపల్లిలో ఉండే నేరస్థుడు ఆదిల్‌ (24) మూడేళ్ల క్రితం చంచల్‌గూడ జైల్లో పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాతా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. తన కదలికలను, ఏడాదిగా వాహీద్‌ పోలీసులకు చేరవేస్తున్నాడని, అందుకే 6 నెలలుగా పోలీసులు తనను వెంబడిస్తూ, వేధిస్తున్నారని ఆదిల్‌ అనుమానించాడు. దీంతో ఆదిల్‌ బాలాపూర్‌ మండలం జల్‌పల్లి గ్రామపరిధిలోని వాది -ఏ-ముస్తఫా, గౌస్‌నగర్‌కు చెందిన నేరస్థుడు సయ్యద్‌ జహీరుద్దీన్‌ అలియాస్‌ జహీర్‌(35), రాజేంద్రనగర్‌ హసన్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఆబిద్‌(19), ఫలక్‌నుమా పరిధి అల్‌జుబేల్‌ కాలనీ, గుల్జార్‌కు చెందిన మహ్మద్‌ఖాజా షాబాజ్‌ (20), రాజేంద్రనగర్‌ సులేమాన్‌నగర్‌, పహాడీకిచెందిన మహ్మద్‌ షా బాజ్‌(20), మహ్మద్‌ ఉమర్‌(20), చాంద్రాయణ్‌గుట్ట తాళ్లకుంటకు చెందిన మహ్మద్‌ అమీర్‌ (20)లతో కలిసి వాహీద్‌ను ఎలాగైనా అంతం చేయాలని ఆదిల్‌ కుట్ర పన్నాడు.


మద్యం తాగించి మత్తులోకి దించి..

పథకం ప్రకారం ఈ నెల 10న సాయత్రం ఆదిల్‌, ఆబిద్‌లు బైకులపై రాజేంద్రనగర్‌కు వెళ్లి వాహీద్‌ను కలిశారు. ముగ్గురూ ఉప్పర్‌పల్లిలో వైన్‌షాప్‌ వద్దకు చేరుకుని మద్యం తాగా రు. ఈ క్రమంలోనే వాహీద్‌ను తీసుకొస్తున్నామని ఆదిల్‌ జహీర్‌ తదితరులకు సమాచారం ఇచ్చాడు. దీంతో జహీర్‌, షాబాజ్‌, ఉమర్‌, ఖాజాషాబాజ్‌, అమీర్‌లు వాహనాల్లో మ ద్యం బాటిళ్లు, ఆయుధాలతో లక్ష్మీగూడ చౌరస్తాకు చేరుకున్నా రు. అక్కడ వారికి ఆదిల్‌, ఆబిద్‌, వాహీద్‌లు కలిశారు. అంద రూ కలిసి జల్‌పల్లి చెరువు కట్టపైకి చేరుకుని దగ్గరలో ఉన్న గుట్టల్లోకి వెళ్లి మద్యం తాగారు. వాహీద్‌ మద్యం మత్తులోకి జారుకున్నాక ఆదిల్‌, జహీర్‌లు కత్తులతో అతడిపైకి దూకి విచక్షణారహితంగా పొడిచారు. మిగతా వారు వారిద్దరికీ సహకరించారు. దాడిలో తీవ్ర గాయాలపాలై వాహీద్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం వారందరికీ గోల్కొండ కోట సమీపంలో ఉండే మున్నీబీ తన ఇంట్లో తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పించింది. 

Updated Date - 2020-10-22T11:48:28+05:30 IST