మృత్యుశకటాలు.. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-27T16:33:04+05:30 IST

భాగ్యనగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఒకరు, లారీ వెనుక చక్రాల కింద పడి...

మృత్యుశకటాలు.. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

భాగ్యనగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఒకరు, లారీ వెనుక చక్రాల కింద పడి మరొకరు, గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఇంకొకరు మృత్యు ఒడికి చేరారు.


భార్య దుర్మరణం.. భర్తకు గాయాలు

బంధువుల ఇంటికెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్న భార్యాభర్తలను కైసర్‌నగర్‌ ప్రాంతంలో  కాంక్రీట్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఓల్డ్‌ అల్వాల్‌లోని పంచశీల ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న గాదె థామ్‌సరెడ్డి (45), అతడి భార్య విజయరాణి (40) ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రగతినగర్‌లోని బంధువుల ఇంటి నుంచి అల్వాల్‌కు యాక్టివా వాహనంపై బయలు దేరారు. కైసర్‌నగర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన కాంక్రీట్‌ లారీ రోడ్డుపైన పడిన విజయరాణి తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భర్త థామ్‌సకు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దుండిగల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


బైక్‌ అదుపు తప్పి..

బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి లారీ కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం అన్నపూర్ణ కాలనీలో నివసించే విశాల్‌ సింగ్‌ చౌదరి(24) సోదరుడు సురేష్‌ చౌదరితో కలిసి తమ బైక్‌పై చిల్కా నగర్‌ నుంచి నాగోల్‌ వైపు వెళ్తున్నారు. బాలాజీ జువెలర్స్‌ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి.. పక్క నుంచి వేగంగా వెళ్తున్న టిప్పర్‌ లారీ వెనక చక్రాల కిందపడ్డారు. విశాల్‌ సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సురేష్‌ చౌదరి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది. 


వాహనం ఢీ కొని..

గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లికి చెందిన ఎం. గోపాల్‌(36) ఉదయం 5 గంటలకు ఆటోలో కొంపల్లి నుంచి మేడ్చల్‌ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న గోపాల్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి బావ సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తలకు మేకు గుచ్చుకొని మృతి

గదిలో మేకు  గుచ్చుకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మానికి చెందిన గుడ్ల రాజ్యం భర్త ప్రభాకర్‌(65) హైదరాబాద్‌కు వచ్చి సుచిత్రలోని కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌లో పనిచేస్తూ దగ్గరలోని హాస్టల్‌ రూమ్‌లో నివాసముంటున్నాడు. ఈక్రమంలో ప్రభాకర్‌ తాను ఉంటున్న రూములో ప్రమాదవశాత్తు పడిపోవడంతో గోడకున్న మేకు గుచ్చుకుని తీవ్రంగా రక్తం పోవడంతో అతను మృతిచెందాడు. ఆ గదిలో ఒక్కడే ఉండడంతో ఎవ్వరూ చూడలేదు. గది నుంచి దుర్వాసన రావడంతో పక్క రూములో ఉండే పృధ్వీరాజ్‌ తలుపులు తీసి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య రాజ్యానికి సమాచారం అందించారు. రాజ్యం ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అన్నను చంపిన తమ్ముడు

మద్యం మత్తులో అన్నను కుక్కర్‌తో కొట్టి చంపేశాడో తమ్ముడు. దుండిగల్‌ పోలీసుల కథనం ప్రకారం.. గాగిల్లాపూర్‌లో వడవెల్లి వెంకట మారుతీ భరత్‌ భూషణ్‌ (35), అతడి సోదరుడు సాయితేజ(28), తల్లి వరలలక్ష్మి మారుతీరావు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అన్నదమ్ములు పనేమీ చేయకుండా నిత్యం తాగుతూ జులాయిగా తిరుగుంటారు. పక్షవాతం కారణంగా తల్లి మంచంపై నుంచి లేవలేదు. ఈ నెల 24న అన్నదమ్ములు మద్యం తాగొచ్చి కొట్టుకున్నారు. తాగిన మైకంలో సాయితేజ తన అన్నని కుక్కర్‌తో కొట్టి చంపేసి మంచంపై పడుకోబెట్టి పారిపోయాడు. 25న భరత్‌భూషణ్‌ లేవకపోవడంతో మృతి చెందినట్టు నిర్ధారించుకుని స్ధానికులు దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రమణారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-27T16:33:04+05:30 IST