కోలుకుంటున్న హైదరాబాద్‌ రియల్టీ

ABN , First Publish Date - 2020-10-10T06:38:21+05:30 IST

హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం కొవిడ్‌ దెబ్బ నుంచి క్రమంగా కోలుకుంటోంది.. పరిస్థితులు చాలా వరకు కుదుట పడ్డాయి. కొత్త ఇళ్ల కోసం ఎంక్వైరీలు కూడా మొదలయ్యాయి.

కోలుకుంటున్న హైదరాబాద్‌ రియల్టీ

పూర్తయిన ప్రాజెక్టులకే డిమాండ్‌


హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం కొవిడ్‌ దెబ్బ నుంచి క్రమంగా కోలుకుంటోంది.. పరిస్థితులు చాలా వరకు కుదుట పడ్డాయి. కొత్త ఇళ్ల కోసం ఎంక్వైరీలు  కూడా మొదలయ్యాయి. ఆగిపోయిన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు బిల్డర్లు నడుం బిగించారు. మంచి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు  ప్రస్తుతం నిధుల కొరత కూడా పెద్దగా లేదని బిల్డర్లు చెబుతున్నారు. 


 మారిన వైఖరి 

ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే కొవిడ్‌ ప్రభావం హైదరాబాద్‌ రియల్టీపై తక్కువే. దీంతో హైదరాబాద్‌, దాని చుట్టు పక్కల అమ్మకాలు తగ్గాయే తప్ప, ఇతర నగరాల్లోలా ధరలు మాత్రం పెద్దగా తగ్గలేదు. కరోనా వల్ల ధరలు భారీగా పడిపోతాయని ఆశలు పెంచుకున్న కొనుగోలుదారుల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. జీతాలు, ఉద్యోగాల కోత భయం లేని ఉద్యోగులు సొంతింటి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. 


 ఐటీ జోష్‌ 

మొదటి నుంచి హైదరాబాద్‌ రియల్టీకి ఐటీ ఉద్యోగులే పెద్ద అండ. కోవిడ్‌ ప్రభావం హైదరాబాద్‌ ఐటీ కొలువులపైనా ఉంటుందని మొదల్లో భయపడినా ఆ ప్రభావం అంతగా లేదు. కొత్త ప్రాజెక్టుల రాకతో ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల్ని చేర్చుకునే పనిలో పడ్డాయి. దీంతో ఐటీ ఉద్యోగుల నుంచి నివాస గృహాలు, ఫ్లాట్లకు ఎంక్వైరీలు ప్రారంభమయ్యాయని బిల్డర్లు చెబుతున్నారు. మొత్తం మీద హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌ మళ్లీ కోలుకుంటోంది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా గాడిన పడితే, అమ్మకాలు మళ్లీ గత ఏడాది స్థాయికి చేరుకుంటాయని మార్కెట్‌ వర్గాల అంచనా. 


తగ్గిన వడ్డీ రేట్లు 

ఆర్‌బీఐ చర్యలతో బ్యాంకులూ హోమ్‌ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించాయి.  ఇపుడు ఫెస్టివల్‌ ఆఫర్‌ కింద ప్రాసెసింగ్‌ ఫీజు రద్దుతో  పాటు, వడ్డీ రేట్లలోనూ పావు శాతం నుంచి అర శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే 6.9 శాతం వడ్డీ రేటుతోనే హోమ్‌ లోన్లు ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో చాలా మంది సొంతింటి కొనుగోలుకు ఇదే మంచి సమయం అని భావిస్తున్నారు. 

Updated Date - 2020-10-10T06:38:21+05:30 IST