Hyd Rains: హైదరాబాద్ నగర వాసులారా.. ఈ వాన కబురు మీకోసమే..

ABN , First Publish Date - 2022-07-23T20:37:34+05:30 IST

భాగ్య నగరాన్ని మరోసారి వాన ముసురు కమ్మేసింది. శుక్రవారం ఉదయం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి..

Hyd Rains: హైదరాబాద్ నగర వాసులారా.. ఈ వాన కబురు మీకోసమే..

హైదరాబాద్: భాగ్య నగరాన్ని మరోసారి వాన ముసురు కమ్మేసింది. శుక్రవారం ఉదయం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ వాతావరణ శాఖ తాజా సూచన నగర వాసులను మళ్లీ బెంబేలెత్తిస్తోంది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు (Hyd Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తాజాగా తెలిపింది. సుమారు 7-10 సెం.మీ. వర్షపాతం (Rainfall) నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలోని (Telangana) ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కొమురంభీం, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో (Karimnagar District) 15-20 సెం.మీ. వర్షం పడే అవకాశం ఉందని.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈనెల 8 నుంచి 16 దాకా గ్రేటర్‌ వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. వర్షం తగ్గినా కమ్ముకున్న మేఘాలతో సూర్యుడు కానరాక ఇబ్బంది పడిన జనం.. నాలుగు రోజులుగా ఎండ వస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.



మెదక్‌, సంగారెడ్డి నుంచి దట్టంగా కమ్ముకొచ్చిన మేఘాలు శుక్రవారం ఉదయం 6గంటల నుంచే నగరమంతా వ్యాపించాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతూ వచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి క్రమేపీ పెరిగిన వర్షం సాయంత్రం తీవ్రరూపం దాల్చింది. సాయంత్రం 4.40 గంటలకు మిన్ను విరిగి నేలమీద పడిన విధంగా వర్షం ఉధృతంగా కురిసింది. హైదరాబాద్‌లో 15 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడం విశేషం. భారీ వర్షానికి హైదరాబాద్‌ బేగంపేటలోని బ్రాహ్మణవాడి, వడ్డెరబస్తీలో మోకాలిలోతు వరకు నీరు నిలిచింది. లింగంపల్లి అండర్‌బ్రిడ్జి, బొల్లారం రోడ్డులో వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంపేట మెయిన్‌రోడ్డులో, ఉప్పరపల్లిలోనీ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబర్‌-191 వద్ద, టోలీచౌకీ వద్ద ప్రవాహం ఉండటంతో వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.



మక్కా మజీద్‌ అవరణలో వజుఖానా వెనక ఉన్న పురాతన భవనం కూలింది. కుత్బుల్లాపూర్‌లోని ఇంద్రసింగ్‌నగర్‌, నిజాంపేటలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, టోలీచౌకీ, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఆబిడ్స్‌, కోఠి, మోజాంజాహి మార్కెట్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. శేరిలింగంపల్లి మండలంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్‌పల్లిలో 9.2 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 9సెం.మీ, జీడిమెట్లలో 8.8 సెంమీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2022-07-23T20:37:34+05:30 IST