నల్లా బిల్లులు ఇచ్చేదెప్పుడు.. ఎన్నాళ్లీ ఎదురు చూపులు!?

ABN , First Publish Date - 2021-05-06T14:10:52+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని...

నల్లా బిల్లులు ఇచ్చేదెప్పుడు.. ఎన్నాళ్లీ ఎదురు చూపులు!?

  • ఆధార్‌ లింకు గడువు పొడిగింపు కోసం ఎదురు చూపులు.. 


హైదరాబాద్/కేపీహెచ్‌బీకాలనీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇంటి యజమాని లేదా అద్దెకు ఉండే వారు ఎవరైనా సరే సదరు నల్లాకు ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేసుకుని మీటర్‌ బిగించుకుంటే ప్రతినెలా తొలి 20వేల లీటర్ల లోపు నీటిని వాడుకుంటే వారికి ఉచితమన్నారు. 2020 డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు వాడుకున్న నీటికి ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు.


కూకట్‌పల్లిలో ఇలా.. 

కూకట్‌పల్లి జలమండలి పరిధిలోని తొమ్మిది సెక్షన్లలో మొత్తం 85,747 కనెక్షన్లు ఉండగా ఇందులో 4803 కమర్షియల్‌ కావడంతో వాటిని మినహాయిస్తే 80,944 నల్లాలకు గాను ఇప్పటి వరకు 45,259 మంది మాత్రమే ఆధార్‌ నంబర్‌ను లింక్‌చేసుకున్నారు. ఇంకా 35,685 మంది లింక్‌ చేసుకోవాల్సి ఉంది. వారంతా జలమండలి ఎప్పుడు గడువు పెంచుతుందా అని వాకబు చేస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్‌ 15 వరకు కూడా జలమండలి జీఎం ప్రభాకరరావు, డీజీఎంలు వెంకటేశ్వర్లు, రవితో పాటు మేనేజర్లు కాలనీలు, అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశమై ఆధార్‌ లింక్‌ గురించి విస్తృతంగా అవగాహన కల్పించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ఏప్రిల్‌ రెండో వారం తర్వాత నుంచి జలమండలి సిబ్బంది కాలనీలు, అపార్ట్‌మెంట్‌లకు వెళ్లడం మానేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని నల్లా దారులు కూడా లైట్‌ తీసుకున్నారు.


గత నెల 30తో ఆధార్‌ అనుసంధానానికి గడువు ముగియగా.. ప్రస్తుతం వ్యక్తిగతంగా లేదా కార్యాలయాల్లో కూడా ఆధార్‌ లింక్‌ సేవలు నిలిచిపోయాయి. బోర్డు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఐదు నెలల బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు వస్తున్న తరుణంలో కరోనా ఉధృతి పెరగడం, కార్యాలయాలు, ఇంటర్నెట్‌ కేంద్రాలకు వెళ్లలేకపోయారు. దీంతో మరోసారి ఆధార్‌ నంబర్‌ నల్లాకు లింక్‌ చేసుకునేందుకు త్వరలోనే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తాయని, అప్పటి వరకు నల్లా దారులు వేచి చూడాలని కూకట్‌పల్లి జీఎం ప్రభాకరరావు తెలిపారు.

Updated Date - 2021-05-06T14:10:52+05:30 IST