Hyderabadలో అకాల వాన ఓ హెచ్చరిక.. వణికిపోయిన జనాలు.. మేయర్ ఎక్కడా కనిపించరేం.. ఆ హీరోతో మీకెందుకు మేడమ్..!?

ABN , First Publish Date - 2022-05-05T14:44:54+05:30 IST

మొన్నటి వరకు ఎండ మండిపోయింది. సన్‌ స్ర్టోక్‌కు నగరవాసులు అల్లాడిపోయారు. ఇంటా, బయటా ఒకటే ఉక్కబోత. బుధవారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

Hyderabadలో అకాల వాన ఓ హెచ్చరిక.. వణికిపోయిన జనాలు.. మేయర్ ఎక్కడా కనిపించరేం.. ఆ హీరోతో మీకెందుకు మేడమ్..!?

  • గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా వర్షం
  • పొంగిన నాలాలు, నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు
  • పలు ప్రాంతాల్లో గంటలపాటు నిలిచిపోయిన కరెంట్‌ సరఫరా
  • రోడ్లపై కూలిన భారీ వృక్షాలు
  • వరద నీటితో వాహనదారుల ఇక్కట్లు

మొన్నటి వరకు ఎండ మండిపోయింది. సన్‌ స్ర్టోక్‌కు నగరవాసులు అల్లాడిపోయారు. ఇంటా, బయటా ఒకటే ఉక్కబోత. బుధవారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తెల్లవారుజామున వర్షం వణికించింది. రోడ్లనే కాదు, పలు ఇళ్లనూ ముంచెత్తింది. నాలాలు పొంగాయి. వర్షాకాలం నాటి పరిస్థితులు కళ్ల ముందు కదలాడాయి. నిద్రపోతున్న పౌరులు కళ్లు తెరిచేసరికి పలు ప్రాంతాల్లో బురద చుట్టిముట్టింది. దీనికే ఇలా ఉంటే.. వర్షాకాలంలో పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఓ హెచ్చరికగా భావించి తగిన చర్యలు చేపట్టకపోతే గత అనుభవాలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


- సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌లోని పలు కాలనీలు, బస్తీల్లో వరద నీరు నిలిచిపోయింది. బౌద్ధనగర్‌, సీతాఫల్‌మండి డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.సీతాఫల్‌మండి అన్నానగర్‌, బ్రాహ్మణబస్తీల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రసూల్‌పురా, గన్‌బజార్‌, శ్రీలంకబస్తీ, ప్యాట్నీ కంపౌండ్‌, విమాన్‌నగర్‌, బోయిన్‌పల్లి సీతారాంపూర్‌,మర్రి రాంరెడ్డినగర్‌, భారతీ ఎవెన్యూ ప్రాంతాల్లో వర్షపునీరు గంటల తరబడి నిలిచిపోయింది.గన్‌బజార్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ కూలిపోయింది. తాడ్‌బంద్‌ ముస్లిం గ్రేవ్‌ యార్డు ఎదుట మోకాలిలోతు నీరు నిలిచిపోవడంతో బోయినపల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం  ఏర్పడింది.


ఈ ప్రాంతాల్లో ఇక్కట్లు..

- నేరేడ్‌మెట్‌ ఆర్‌కే పురం ఆఫీసర్స్‌ కాలనీ, రామంతాపూర్‌, రాంశంకర్‌నగర్‌, హబ్సిగూడ, బేగంపేట్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, ముషీరాబాద్‌, రాంనగర్‌, పద్మాకాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్‌కేపురం యాదవనగర్‌, ఎన్‌టీఆర్‌నగర్‌, హరిపురికాలనీల్లో వరదనీరు రోడ్లను ముంచెత్తింది.

- మునగనూర్‌ రోడ్డులో మైత్రి విహార్‌ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. హయత్‌నగర్‌ బస్‌డిపో రోడ్డులో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట  రోడ్డు కుంగి పోయింది.  - ఓల్డ్‌బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌ జలమయమైంది. 

- బాలానగర్‌లో చెట్లు కూలడంతో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

- నల్లకుంట పద్మాకాలనీలో కార్లు, ద్విచక్రవాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో విలువైన వస్తువులు, సామగ్రి తడిసిపోయాయి.

- పద్మారావునగర్‌లో చెట్టు కూలిపోయింది. కరెంట్‌ లేకపోవడంతో సాయంత్రం వరకు  స్థానికులు ఇబ్బందులు పడ్డారు. 

- జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ సుస్మితనగర్‌ కాలనీలో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది.

- వీఎస్‌టీ మార్గంలో నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి వద్ద మట్టి కుంగిపోయింది. 

- పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ రోడ్డు వద్దకు భారీగా వరదనీరు చేరింది. 

- వర్షానికి అత్తాపూర్‌  పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ సీలింగ్‌ ఊడి కిందపడింది.

- హయత్‌నగర్‌లో 24వ అదనపు మెట్రో పాలిటన్‌ కోర్టు ప్రాంగణంలోకి వర్షం నీరు చేరి చెరువును తలపించింది.  

- ప్యారడైజ్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, టోలీచౌకి, ఎల్‌బీనగర్‌, మన్సూరాబాద్‌ తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

- బంజారాహిల్స్‌లో రోడ్డు నెంబరు 14, నల్లకుంట తిలక్‌నగర్‌ బస్తీ, కవాడిగూడ ఎస్‌బీఐ కాలనీలో చెట్లు కూలిపోయాయి. తిలక్‌నగర్‌లో 6 గంటలు  విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.


హైదరాబాద్‌ సిటీ : బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం ఉదయం 7 గంటల వరకు దంచికొట్టింది.  సీతాఫల్‌మండి, అల్వాల్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, హయత్‌నగర్‌, మన్సూరాబాద్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, టోలీచౌకి, లంగర్‌హౌస్‌, ఆసిఫ్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌తోపాటు పలు ప్రాంతాల్లో గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది.  తెల్లవారుజామున 3 గంటల వరకు ఇళ్లలో వేడి, ఉక్కపోతతో ఉన్న వాతావరణం నాలుగు గంటల తర్వాత మారిపోయింది.


బయటకురాని మేయర్‌.. ట్విటర్‌కే పరిమితమవడంపై నెటిజన్ల ఆగ్రహం

భారీ వర్షానికి మహా నగరం జలమయమైనా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఇంటి నుంచి బయటకు రాలేదు. క్షేత్రస్థాయిలో చేస్తున్న పనుల ఫొటోలను అధికారులు పంపించగా ఉదయం 9.45 గంంటలకు మేయర్‌ రీట్వీట్‌ చేశారు. అధికారులు, సిబ్బంది నీటి నిల్వలు తొలగిస్తున్నారని, సమస్యలు ఎదురైతే సహాయం కోసం జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21111111, కంట్రోల్‌ రూమ్‌ 040-29555500 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నటుడి మాటలను ఖండించడంలో మేయర్‌ బిజీగా ఉన్నారని, హైదరాబాద్‌లో వర్షం గురించి స్పందించడం లేదంటూ ట్వీట్‌ చేశారు. ట్వీట్లు ప్రజల ఇబ్బందులు తొలగించవని, నిలిచిన నీరు తొలగించాలని ఒకరు సూచించారు. ఎస్‌ఎన్‌డీపీ పనులు ఎప్పటికి పూర్తవుతాయంటూ మరొకరు ప్రశ్నించారు. మేయర్‌ తీరుపై పలువురు పలు విధాలుగా సోషల్‌ మీడియాలో స్పందించారు.


160 ప్రాంతాల్లో వరద నీటి తొలగింపు

నాలాలకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో వరదనీటిని తొలగించాలని ఇన్‌చార్జి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ సత్యనారాయణ జోనల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇంజనీరింగ్‌, ఎన్ఫోర్స్‌మెంట్‌, శానిటేషన్‌, డీఆర్‌ఎఫ్‌, యూబీడీ అధికారులు, సిబ్బంది 160 ప్రాంతాల్లో వరదనీటిని తొలగించారు.


ముంపు ప్రాంతాలకు నేడు అధికారులు 

పాత నగరంలో ముంపు ప్రాంతాలను అధికారుల బృందాలు గురువారం సందర్శిస్తాయని, బాధితులకు సహాయ, పునారవాస చర్యలు చేపడతాయని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. అకాల వర్షంతో వరదనీటిలో మునిగిన ప్రాంతాల ప్రజల బాధలు తెలుసుకొని వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్‌కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు పేర్కొన్నారు.  సీఎస్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ శర్మన్‌ రంగంలోకి దిగినట్టు వివరించారు.



Read more