ఆగస్టులో హైదరాబాద్‌ ఓపెన్‌

ABN , First Publish Date - 2020-05-23T09:20:07+05:30 IST

నవంబరు 17 నుంచి 22 వరకు సయ్యద్‌ మోదీ టోర్నీ లఖ్‌నవ్‌లో, భారత్‌లో చివరిదైన ఇండియా ఓపెన్‌ డిసెంబరు 8 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో

ఆగస్టులో హైదరాబాద్‌ ఓపెన్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో వాయిదాపడ్డ క్రీడా ఈవెంట్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్‌లోనూ టోర్నీల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఆగస్టులో హైదరాబాద్‌ ఓపెన్‌తో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఈ ఏడాది షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ సంవత్సరం మూడు అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. తొలుత గచ్చిబౌలీ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ ఓపెన్‌ ఈ ఆగస్టు 11-16 మధ్య జరగనుంది.


నవంబరు 17 నుంచి 22 వరకు సయ్యద్‌ మోదీ టోర్నీ లఖ్‌నవ్‌లో, భారత్‌లో చివరిదైన ఇండియా ఓపెన్‌ డిసెంబరు 8 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో జరగనున్నాయి. ఇండియా ఓపెన్‌ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 24-29న జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 1 నుంచి జరిగే తైపీ ఓపెన్‌తో వరల్డ్‌ టూర్‌ మొదలుకానుంది. ఇక.. వివిధ దేశాల్లో కలిపి షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన సీజన్‌ చివరి ఈవెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ సహా 8 టోర్నీల తేదీలను తాజాగా రీషెడ్యూల్‌ చేశారు. నాలుగు టోర్నీలైన జర్మన్‌ ఓపెన్‌, స్విస్‌ ఓపెన్‌, యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లను ప్రస్తుతానికి సస్పెన్షన్‌లో ఉంచామనీ.. వీటి నిర్వహణ తేదీలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. కాగా.. సింగపూర్‌ ఓపెన్‌, ఆసియా చాంపియన్‌షిప్‌ సహా పది టోర్నీలను రద్దు చేసినట్టు బీడబ్ల్యూఎఫ్‌ సెక్రటరీ జనరల్‌ థామస్‌ లండ్‌ వెల్లడించారు. 


5 నెలల్లో 22 టోర్నీలా..?

బీడబ్ల్యూఎఫ్‌ క్యాలెండర్‌పై భారత షట్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 నెలల్లో 22 టోర్నీలను ఖరారు చేశారనీ.. కొంచెం కూడా విరామం లేకుండా, టోర్నీల కోసం వెంటవెంటనే షట్లర్లు ఎలా ప్రయాణిస్తారని పారుపల్లి కశ్యప్‌, సాయి ప్రణీత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-05-23T09:20:07+05:30 IST