ప్రాణాలు తీసిన రియల్‌ దందా!

ABN , First Publish Date - 2022-03-02T07:52:41+05:30 IST

హైదరాబాద్‌ నగర శివార్లలో మంగళవారం ఉదయం కాల్పుల మోత మోగింది. ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.

ప్రాణాలు తీసిన రియల్‌ దందా!

ఇద్దరు రియల్టర్ల దారుణ హత్య

తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

ఘటనా స్థలంలో ఒకరి మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు

రంగారెడ్డి జిల్లా కర్ణంగూడలో ఘటన

భూవివాదమే హత్యలకు కారణం

హత్యల వెనుక కిరాయి హంతకులు?

అదుపులో ముగ్గురు అనుమానితులు


ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్‌/సరూర్‌నగర్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగర శివార్లలో మంగళవారం ఉదయం కాల్పుల మోత మోగింది. ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్‌ నగర శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ- చెర్లపటేల్‌గూడల గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్మా్‌సగూడ వినాయకహిల్స్‌కు చెందిన నవారు శ్రీనివా్‌సరెడ్డి (38), మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ ఆర్‌ఎన్‌రెడ్డి నగర్‌ ద్వారకామయి కాలనీకి చెందిన రాఘవేందర్‌రెడ్డి(39) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. కర్ణంగూడ, చెర్లపటేల్‌గూడ గ్రామాల మధ్య ఇబ్రహీంపట్నం ఖాల్సా రెవెన్యూ సర్వే నెం.1369, 1370, 1371, 1372లలోని 18 ఎకరాల పట్టా భూమిపై కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూమిని 20 ఏళ్ల క్రితం చెర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన రైతుల నుంచి నగరానికి చెందిన ఇంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, పురుషోత్తంరెడ్డి కొనుగోలు చేసి వీటిని లేక్‌విల్లా ఆర్చర్డ్స్‌కు విక్రయించారు. అప్పట్లో వెంచర్‌ యజమానులు ఎలాంటి మ్యుటేషన్‌ చేయించుకోకుండా కేవలం రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌లపైనే వెంచర్‌వేసి ప్లాట్ల విక్రయాలు జరిపారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఽచేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ‘ధరణి’లో గతంలో రికార్డులో ఉన్న రైతులకే ప్రభుత్వం కొత్త పాసుపుస్తకాలు మంజూరయ్యాయి.


అనంతరం నవారు శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి కలిసి ఈ రైతుల నుంచి తిరిగి ఇక్కడ  8 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే అప్పటికే ఈ భూముల్లో అనేకమంది ప్లాట్లను కొనుగోలు చేసి ఉన్నందున రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఆ ప్లాట్లను తొలగించి వ్యవసాయ పొలంగా మార్చి బోర్లు వేసి సాగు చేస్తున్నారు. కానీ, లేక్‌విల్లా ఆర్చర్డ్స్‌లో ప్లాట్ల యజమానుల నుంచి నగరానికి చెందిన మరో రియల్టర్‌ మట్టారెడ్డి తక్కువ ధరకు కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసి తన కబ్జాలోకి తీసుకుని ప్రహరీ నిర్మించుకుని గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడే నాలుగు ప్లాట్లకు (సుమారు నాలుగు వేల గజాలు) సంబంధించి శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మట్టారెడ్డి మధ్య కొన్ని రోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. 


మాట్లాడుకుందామని పిలిచి..

మంగళవారం ఉదయం శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలను మాట్లాడుకుందామంటూ రియల్టర్‌ మట్టారెడ్డి పిలిపించినట్లు మృతుల కుటంబసభ్యులు చెబుతున్నారు. ఉదయం 5 గంటలకు కారులో ఇద్దరూ కర్ణంగూడ శివారులోని పొలం వద్దకు వెళ్లారు. ఇక్కడే వీరికి మట్టారెడ్డితో మాటామాటా పెరిగినట్టు తెలుస్తోంది. సుమారు 8గంటల ప్రాంతంలో దుండగులు ఒకేసారి పిస్టల్‌తో కాల్పులకు తెగబడ్డారు. వీరినుంచి తప్పించుకునేందుకు శ్రీనివా్‌సరెడ్డి కొంతదూరం పరిగెత్తినప్పటికీ వెంబడించి కణతపై కాల్చడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. రాఘవేందర్‌రెడ్డికి ఛాతి భాగంలో రెండు బుల్లెట్లు దిగాయి. తీవ్రంగా గాయపడిన అతడు తప్పించుకునేందుకు తానే కారు నడుపుతూ సుమారు 600 మీటర్ల దూరం వెళ్లాడు. ఎలిమినేడు రోడ్డుపై ఇబ్రహీంపట్నం వైపు వస్తుండగా కారు రోడ్డు దిగి మట్టిలో కూరుకుపోయింది. అప్పటికే అటుగా వెళ్తున్న ఆక్టోపస్‌ కానిస్టేబుళ్లు చూసి పోలీసులకు సమాచారమందించారు. రాఘవేందర్‌రెడ్డిని అంబులెన్స్‌లో నగర శివారు సాగర్‌ కాంప్లెక్స్‌లోని బృంగి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై కాల్పులు జరిపిన తీరును బట్టి దుండగులు సుపారి గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. 


మట్లారెడ్డిపై అనుమానాలు?

శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి హత్యల వెనుక మట్టారెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఘటనకు ముందు వీరిద్దరితో మట్టారెడ్డి మాట్లాడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మట్టారెడ్డి ఘటనా స్థలంలో ఉండి మీడియాతో మాట్లాడారు. శ్రీనివా్‌సరెడ్డితో తాను మాట్లాడానని, తరువాత ఏమైందో తనకు తెలియదని అన్నాడు. శ్రీనివా్‌సరెడ్డితో భూవివాదం ఉన్నప్పటికీ.. చంపుకొనేంత పగ తమ మధ్య లేదని చెప్పాడు. అయితే ప్రాథమిక సమాచారాన్ని బట్టి సంఘటన స్థలంలో ఉన్న మూడో వ్యక్తే ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అతనికి తోడుగా సమీప ప్రాంతంలో మరికొందరు కిరాయి వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. నిందితులు ఎక్కడనుండి వెళ్లి ఉంటారనేది పోలీస్‌ జాగిలాలతో పరిశీలన చేశారు. కాల్పులు జరిపిన ప్రదేశంలో ఓ బుల్లెట్‌ దొరికింది. కాగా, మట్టారెడ్డితో పాటు మృతుడు శ్రీనివా్‌సరెడ్డి దగ్గర సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న హఫీజ్‌, మరో అనుచరుడు కృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. 


సెటిల్‌మెంట్‌ దందాలే హత్యలకు కారణం?

శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి హత్యలకు భూముల సెటిల్‌మెంట్‌ దందాలే కారణమని తెలుస్తోంది.  శ్రీనివా్‌సరెడ్డి.. పదేళ్ల క్రితం యాచారంలో డెయిరీ ఫామ్‌ నిర్వహించాడు. అక్కడ నష్టాలు రావడంతో అల్మా్‌సగూడకు వచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగాడు. చాలావరకు వివాదాస్పద భూములు, ప్లాట్లు, వెంచర్లలోని పార్కు స్థలాలను తక్కువ ధరకు కొని.. వాటిని ఏదో విధంగా క్లియర్‌ చేసి ఇతరులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడని తెలిసింది. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన ఇదే తరహాలో పార్కు స్థలాలను సొంతం చేసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టబోగా, అధికారులు అడ్డుకున్నట్టు తెలిసింది. కర్ణంగూడకు చెందిన ధనలక్ష్మిని శ్రీనివా్‌సరెడ్డి వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అత్తగారి ఊరిలోనే శ్రీనివా్‌సరెడ్డి హత్యకు గురయ్యాడు. ఇక రాఘవేందర్‌రెడ్డి గతంలో పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇద్దరూ కలిసి వివాదాస్పద భూములపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారని సమాచారం. ఇంతకుముందు గుర్రంగూడకు చెందిన ఓ వ్యక్తిని ప్లాట్‌ వదులుకోవాలని బెదిరించగా అతడు కోర్టు ద్వారా ప్లాటును దక్కించుకున్నట్టు తెలిసింది. స్థానికంగా రాఘవేందర్‌రెడ్డితో ఎవరూ బాగా ఉండరని, ఆయన కొంత మంది సొంత మనుషులతో హల్‌చల్‌ చేసేవాడని చెప్పుకొంటున్నారు. ఆయన భార్య సైతం కొంత కాలంగా వేరుగా ఉంటున్నట్టు తెలిసింది. తండ్రి నర్సింహారెడ్డి ఏడాది క్రితం కరోనాతో మరణించడంతో రాఘవేందర్‌రెడ్డి ఒక్కడే ఉంటున్నాడు.  

Updated Date - 2022-03-02T07:52:41+05:30 IST