Hyderabad: న్యాయం కోసం వస్తే చెరపట్టాడు..

ABN , First Publish Date - 2022-01-28T15:40:20+05:30 IST

భర్తతో వచ్చిన విభేదాలతో విడాకుల కోసం ఓ న్యాయవాది వద్దకు వెళితే అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది

Hyderabad: న్యాయం కోసం వస్తే చెరపట్టాడు..

న్యాయవాదిపై పోలీసుల చర్యకు డిమాండ్‌  

గాంధీ విగ్రహానికి వినతిపత్రం..

గోడును వెళ్లబోసిన మహిళ


హైదరాబాద్/మల్కాజిగిరి: భర్తతో వచ్చిన విభేదాలతో విడాకుల కోసం ఓ న్యాయవాది వద్దకు వెళితే అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించినా సదరు న్యాయవాదిపై చర్యలు తీసుకోవడం లేదంటూ గురువారం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మీడియాతో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది.


బాధితురాలి కథనం ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు కోరుతూ న్యాయవాది రతన్‌సింగ్‌ను సంప్రదించింది. కేసు కోసం ఆమెను పలుసార్లు తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. భర్తతో విడిగా ఉంటూ అద్దెగదికోసం వెతుకుతున్న సదరు మహిళకు తాను ఉంటున్న ప్రాంతంలోని సొంత ఫ్లాటునే అద్దెకు ఇచ్చాడు. ఆ ఫ్లాటులో అంతకు ముందే రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాలతో ఆమె కార్యకలాపాలు రికార్డు చేశాడు. వాటిని తన మొబైల్‌ఫోన్‌లోకి కాపీ చేశాడు. ఆ వీడియోలు చూపి లోబర్చుకున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. రోజురోజుకూ  న్యాయవాది వేధింపులు ఎక్కువకావడంతో మల్కాజిగిరి పోలీసులకు గత డిసెంబర్‌ 13న ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇంతవరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన నిరసన వ్యక్తం చేస్తూ, తన గోడును వివరిస్తూ రాసిన ఉత్తరాన్ని గురువారం మల్కాజిగిరి గాంధీపార్కులోని మహాత్ముని విగ్రహానికి అందజేసింది. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ విజ్ఞప్తి చేస్తోంది.

Updated Date - 2022-01-28T15:40:20+05:30 IST