నా హత్యకు కుట్ర: MP Raghurama

ABN , First Publish Date - 2022-07-04T21:30:46+05:30 IST

ఎంపీ రఘురామ ఇంటివద్ద ఉధృక్తత ఏర్పడింది. ఆయన ఇంటి ముందు ఓ వ్యక్తి సంచరించడం...

నా హత్యకు కుట్ర: MP Raghurama

హైదరాబాద్ (Hyderabad): ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఇంటివద్ద ఉధృక్తత ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి ముందు ఓ వ్యక్తి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి పోటోలు తీస్తున్నట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తాను ఏపీ పోలీసునంటూ ఆ వ్యక్తి చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐడీ కార్డు చూపమంటే.. సిబ్బందితో ఆ వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. కాగా తన హత్యకు కుట్రపన్నారని రఘురామ ఆరోపించారు. అందుకే రెక్కీ నిర్వహించారని మండిపడ్డారు.


పూర్తి వివరాలు...

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటి ముందు అపరిచిత వ్యక్తుల రెక్కీ (Rekki) కలకలం రేపింది. గత మూడు రోజులుగా రఘురామ ఇంటి ముందు రెక్కీ నిర్వహించడాన్ని రఘురామ సెక్యూరిటీ సబ్బంది గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక వ్యక్తి పట్టుపడ్డాడు. మిగిలినవారు పారిపోయారు. ఆ వ్యక్తిని విచారించగా రకరకాలుగా సమాధానం చెబుతున్నాడు.  ఒకసారి తన పేరు బాషా అని, మరొకసారి సుభాన్ అని చెబుతున్నాడు. ఇంకొకసారి డిపార్టుమెంట్‌కు చెందిన వ్యక్తినని, విజయవాడ, హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తూ ఉంటానని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడకి వచ్చానట్లు ఆ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. ప్రశ్నించిన ప్రతిసారి రకరకాలుగా సమాధానాలు చెబుతున్నాడు. ఏఆర్ కానిస్టేబుల్‌నని, మరోమారు క్రైమ్ పోలీసునని చెబుతున్నాడు. వీఆర్‌లో ఉన్న తనను ఉన్నతాధికారులే ఇక్కడకు తీసుకు వచ్చారని తెలిపాడు. కనీసం పోలీస్ ఐడీ కార్డ్ అయిన చూపించాలని అడగ్గా.. గుర్తింపు కార్డు లేదన్నాడు. తనతో పాటు వచ్చిన వ్యక్తుల వివరాలు అయినా ఇవ్వాలని అడిగారు. అయినా ఆ వ్యక్తి నోరు విప్పక పోవడంతో.. రఘురామ సెక్యూరిటీ సిబ్బంది అతని వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. 


కాగా చాలా కాలం తర్వాత సొంత నియోజకవర్గానికి బయల్దేరిన నరసాపురం ఎంపీ కె.రఘురామ కృష్ణంరాజు పర్యటనకు ఆటంకాలు ఎదురయ్యాయి. సోమవారం ప్రధాని మోదీ హాజరుకానున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సభకు రాకుండానే వెనుదిరిగారు. అల్లూరి 125వ జయంతి వేడుకలో పాల్గొనేందుకు రఘురామ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. భీమవరం వెళ్లేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో రైలు ఎక్కారు. ఇంతలో సొంత జిల్లా నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. శనివారం ఆయనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు వారి తల్లిదండ్రులు ఎంపీకి తెలిపారు. ఈ ఘటన తనను మనస్తాపానికి గురి చేసిందని, యువకులపై కేసు పెట్టడం దారుణమని రఘురామ అన్నారు. ప్రొటోకాల్‌ విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం తనకు అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. అలాగే తన అభిమానులపై అక్రమ కేసులు పెడుతున్నట్టు సమాచారం రావడంతో, మార్గ మధ్యలో రైలు దిగి వెనుతిరగాల్సి వచ్చిందని ఆయన కార్యాలయం తెలిపింది. 

Updated Date - 2022-07-04T21:30:46+05:30 IST