Hyderabad Metro.. రాత్రి పది దాటితే...!

ABN , First Publish Date - 2021-11-09T16:23:34+05:30 IST

భాగ్యనగరంలో ట్రాఫిక్‌ రహిత, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో కీలక సమయాల్లో...

Hyderabad Metro.. రాత్రి పది దాటితే...!

  • పది దాటితే ప్రయాసే..!
  • అందుబాటులో ఉండని మెట్రో
  • ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  • ఉదయం 7గంటలకు మొదటి ట్రిప్‌.. 
  • రాత్రి 10.15 గంటలకు చివరి ట్రిప్‌
  • వేళలు పొడిగిచాలంటున్న పౌరులు

భాగ్యనగరంలో ట్రాఫిక్‌ రహిత, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో కీలక సమయాల్లో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక చార్జీలు వెచ్చిస్తూ నిలువు దోపిడీకి గురవుతున్నారు. మెట్రోరైళ్లు ఉదయం 7గంటల తర్వాతే ప్రారంభం కావడం, రాత్రి 10.15 గంటలకే చివరి రైలు బయలుదేరడంతో ఆ తర్వాత వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.


హైదరాబాద్‌ సిటీ : మెట్రో రైళ్లలో త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చనే ప్రయాణికులకు ఉదయం, రాత్రివేళల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు, అర్ధరాత్రి రైలు స్టేషన్లకు వెళ్లేవారు, ఉదయం వేళల్లో కోచింగ్‌ సెంటర్లు, ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు. చాలామంది నిర్ణీత సమయానికి పనులకు చేరుకోలేని పరిస్థితి నెలకొంటోంది.


మెట్రో సమయాలపై  కేటీఆర్‌కు ట్వీట్‌..

ఉదయం, అర్ధరాత్రి మెట్రో అవసరాలను గుర్తిస్తూ నగరవాసులు మంత్రులు, అధికారులకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. పలుప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు స్టేషన్‌కు ఉదయం 6లోపు చాలా రైళ్లు వస్తున్నాయని, మెట్రో కోసం గంటపాటు వేచి చూడాల్సి వస్తోందని అభినవ్‌ అనే యువకుడు సోమవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. ఉదయం మెట్రో అందుబాటులో లేకపోవడంతో చాలామంది క్యాబ్‌ల్లో వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అభినవ్‌ చేసిన  సూచనను పరిగణలోకి తీసుకుని, మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులను సమన్వయం చేస్తానని పేర్కొన్నారు.  ఇదే విషయంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. మెట్రో రైళ్లను 6 నుంచి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.


రాత్రి 12 వరకు నడిపించాలి..

నగరంలో మెట్రో రైళ్లు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రయాణ సమయం తగ్గుతుండడంతోపాటు హాయిగా వెళ్లే అవకాశం ఉంది. ఆటోలు, క్యాబ్‌ల కంటే తక్కువ ధర ఉంది. అయితే రాత్రి 10.15 గంటల వరకే కాకుండా రైలు వేళలను కొంతసేపు పొడిగించాలి. ఉదయం 6 గంటలకు ప్రారంభించి, అర్ధరాత్రి 12 వరకు నడిపించడం ద్వారా చాలామందికి రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. - సీహెచ్‌.రాము, రియాల్టీ కన్సల్టెంట్‌.


ఉదయం 7 నుంచి రాత్రి 10.15 వరకు..

నగరంలోని మియాపూర్‌- ఎల్‌బీనగర్‌, నాగోలు-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్‌ కారిడార్లలో 55 రైళ్ల చొప్పున ప్రతిరోజూ 820 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఆయా మార్గాల్లో ప్రతి 3 నుంచి 5 నిమిషాల్లో ఒక రైలు తిరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో, చి వరి రైలుగా టర్మినల్‌ స్టేషన్‌నుంచి రాత్రి 10.15 గం టలకు ప్రారంభమై 10.45 గంటలకు చేరుకుంటుంది.  దీంతో పనిచేసే ఆఫీసుల్లో ఆలస్యం కావడం, అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు నరకయాతన పడుతున్నారు.


రైల్వే ప్రయాణికుల అవస్థలు..

- తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుంచి రైళ్లలో వచ్చి రాత్రి 10 తర్వాత సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుతున్న ప్రయాణికులు నగరంలోని తమ ఇళ్లకు చేరేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. విజయవాడ నుంచి బయలుదేరే లింగంపల్లి ఇంటర్‌సిటీ, సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ రాత్రి 10.15 వరకు సికింద్రాబాద్‌కు చేరుకుంటాయి. అలాగే బీదర్‌, సింహపురి, పద్మావతి, గోదావరి రైళ్లు తెల్లవారుజామున 5.35 వరకు వస్తాయి. కేఎ్‌సఆర్‌ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ తెల్లవారుజామున 5.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. యశ్వంతాపూర్‌ నుంచి వచ్చే గరీబ్‌రథ్‌ తెల్లవారు జామున 4.36 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తోంది. ఇలా.. రాత్రి పది తర్వాత, ఉదయం 6 గంటల లోపు పలు రైళ్లలో నగరానికి చేరుకుంటున్న వేలాదిమందికి మెట్రో అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.


- భాగ్యనగరంలో మెట్రో కనీస టికెట్‌ ధర రూ.10 ఉంది. ప్రారంభస్టేషన్‌ నుంచి చివరి స్టేషన్‌ వరకు రూ.60 వరకు రేటు ఉంది. అలాగే, ఆర్టీసీ బస్సులు, ఆటోల కంటే వేగంగా ప్రయాణించే సౌకర్యం ఉండడంతో మెట్రోకు మొగ్గుచూపుతున్నారు. రాత్రి 10.15 వరకే మెట్రో రైళ్లు అందుబాటులో ఉండడం, తర్వాత బంద్‌ కావడంతో ఆ సమయంలో ఇంటికి, ఆస్పత్రులకు వెళ్లే వారు నరకయాతన పడుతున్నారు. దీంతో క్యాబ్‌లు, ఆటోలలో ప్రయాణిస్తూ అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. మెట్రోలో రూ.50లోపు ఇంటికి చేరే పరిస్థితి ఉండగా, క్యాబ్‌ల్లో రూ.300 నుంచి రూ.400 వరకు వెచ్చించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-09T16:23:34+05:30 IST