హైదరాబాద్‌ Metroకు నేటితో నాలుగేళ్లు.. రెండో దశపై నీలినీడలు..

ABN , First Publish Date - 2021-11-29T17:28:30+05:30 IST

విశాలమైన రహదారులు, కొత్త కొత్త వంతెనలు.. ఎన్ని వచ్చినా నగరంలో ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. దీంతో ఆస్పత్రులు, కార్యాలయాలు, కాలేజీలు, ఇంటర్వ్యూలకు...

హైదరాబాద్‌ Metroకు నేటితో నాలుగేళ్లు.. రెండో దశపై నీలినీడలు..

  • నగరవాసులను ఆకట్టుకుంటూ ముందుకు 
  • సురక్షిత, వేగవంతమైన ప్రయాణంగా గుర్తింపు
  • మొత్తం మూడు కారిడార్లు.. 66 స్టేషన్లు.. 820 ట్రిప్పులు
  • నేటికీ కలగానే ఎయిర్‌పోర్టుకు మెట్రో

హైదరాబాద్‌ సిటీ : విశాలమైన రహదారులు, కొత్త కొత్త వంతెనలు.. ఎన్ని వచ్చినా నగరంలో ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. దీంతో ఆస్పత్రులు, కార్యాలయాలు, కాలేజీలు, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారి టెన్షన్‌ మామూలుగా ఉండదు. ఉదయం, సాయంత్రం వేళల్లో కేవలం పది కిలోమీటర్ల దూరానికి గంటకు పైగా సమయం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసులకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైలు ముందుకు వచ్చింది. పేద, ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుని ‘హ్యాపీ జర్నీ’ అందిస్తోంది. ‘‘హమారా హైదరాబాద్‌.. హమారా మెట్రో’’ అంటూ అన్ని వర్గాల ప్రజలను స్వాగతిస్తోంది. నగర ప్రతిష్టను నలుదిశలా చాటుతూ.. నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ‘హైదరాబాద్‌ మెట్రో రైలు’పై ప్రత్యేక కథనం..


2017 నవంబర్‌ 29న ప్రారంభం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించేందుకు నగరంలో 2012లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యాలు సుమారు రూ. 14,132 కోట్లు వెచ్చించాయి. ఎల్‌అండ్‌టీ, మెట్రో సంస్థలు మొదటి దశలో 72 కిలోమీటర్ల పనులు చేపట్టాలని నిర్ణయించాయి. ఇందులో 69.2 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తిచేశాయి. 2017 నవంబర్‌ 29న నాగోలు-మియాపూర్‌-అమీర్‌పేట్‌ మార్గంలో మొదటి రైలు ప్రారంభించారు. ప్రస్తుతం కారిడార్‌-1 మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో 29 కిలో మీటర్లు, కారిడార్‌-2 జేబీఎ్‌స-ఫలక్‌నుమా మార్గంలో 15 కిలోమీటర్లు, కారిడార్‌-3 నాగోలు-రాయదుర్గం మార్గంలో 28 కిలోమీటర్లలో రైళ్లు నడుస్తున్నాయి. మూడు మార్గాల్లోని 66 స్టేషన్ల గుండా ప్రతి రోజు 820 ట్రిప్పులను నిర్వహిస్తున్నారు.


కొవిడ్‌తో కుదేలు

కొవిడ్‌ తాకిడి లేకముందు మూడు కారిడార్ల పరిధిలో రోజుకు దాదాపు 3.50 లక్షల నుంచి 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. మెట్రోకు భారీగా ఆదాయం సమకూరేది. మెట్రోమాల్స్‌, దుకాణాల ఆదాయం కూడా రోజుకు సుమారు రూ. కోటి నుంచి రెండు కోట్లు ఉండేది. 2020 మార్చిలో నగరంలో కొవిడ్‌ తాకిడి ప్రారంభమైనప్పటి నుంచి మెట్రో నష్టాల ఊబిలో కూరుకుపోతూ వస్తోంది. కొవిడ్‌ తగ్గినా పూర్వపు స్థితికి రావడం లేదు. గతంలో కంటే సమయాన్ని గంట ముందు ఉదయం 6 నుంచి రాత్రి 11.15 వరకు నడిపిస్తున్నా 3 లక్షల ప్రయాణికుల మార్కును దాటలేకపోతోంది. 


ఆదుకుంటేనే ముందడుగు

ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోరైలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. షాపింగ్‌మాల్స్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతో కేవలం టికెట్ల ఆదాయంపైనే కార్యకలాపాలు, ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి వస్తోందని కొంతకాలంగా ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులు ప్రభుత్వానికి చెబుతున్నారు. అప్పునకు వడ్డీ చెల్లింపులు భారంగా మారాయని, ప్రభుత్వ పరంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నగర ప్రతిష్టకు తలమానికమైన మెట్రోను తప్పకుండా ఆదుకుంటామని ఇటీవల జరిగిన రెండు సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్‌ అధికారులకు హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిసినప్పటికీ నేటివరకు రూపాయి కూడా అందలేదని మెట్రోవర్గాలు చెబుతున్నాయి. 


ఎయిర్‌పోర్టుకు ఎప్పుడో?

మెట్రో మొదటిదశకు విపరీతమైన స్పందన రావడంతో మరిన్ని మార్గాల్లో సేవలను ప్రారంభించాలని ఎల్‌అండ్‌, మెట్రో నిర్ణయించింది. ఈ మేరకు రాయదుర్గం (రహేజా మైండ్‌ స్పేస్‌) స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) 31 కిలోమీటర్లు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వయా కొండాపూర్‌, గచ్చిబౌలి, ఓల్డ్‌ ముంబయి హైవే, మెహిదీపట్నం (26 కిలో మీటర్లు) ప్రతిపాదించారు. కారిడార్‌-3లోని నాగోలు, కారిడార్‌-1లోని ఎల్‌బీ నగర్‌లోని 5 కిలోమీటర్ల ఖాళీని పూర్తి చేసేందుకు పనులు నిర్ణయించారు. త్వరిగతిన ఈ పనులు పూర్తిచేస్తామని 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 


శంషాబాద్‌ వరకు మెట్రో సేవలను కొనసాగించేందుకు చేపట్టే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్‌ సంస్థను కూడా జత చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన చేపట్టనున్న పనుల్లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) వాటా 51 శాతం ఉండగా, హెచ్‌ఎండీఏ వాటా 48.09 శాతం ఉంది. మిగతా వాటాను టీఎ్‌సఐఐసీ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అందించనున్నాయి. ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలుకు సంబంధించిన పనులకు సుమారు రూ.4 వేల నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు రెండేళ్ల క్రితమే డీపీఆర్‌ను సిద్ధం చేశారు. గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే మెట్రో ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ 31 కిలోమీటర్ల దూరంలో ఉండగా, దీనిని 18 నిమిషాల్లో చేరుకునే విధంగా ఉంటుందని చెప్పారు. అయితే ప్రచారాలు, ఆర్భాటాలు తప్పా ఎయుర్‌పోర్టు పనుల జాడ కనిపించడం లేదు. 


మొదటి దశలో కారిడార్‌-2ను జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు పూర్తి చేసేందుకు ప్రతిపాదించారు. ఎల్‌అండ్‌టీ, మెట్రో రైలు సంస్థలు తమ నిధులతో పనులు చేయాలని భావించాయి. అయితే పాతబస్తీ మీదుగా వెళ్తే ప్రార్థన మందిరాలు తొలగించాల్సి వస్తోందని, అలైన్‌మెంట్‌ మార్చాలని ఎంఐఎం నేతలు అప్పట్లో అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత అలైన్‌మెంట్‌నే ఖరారు చేయడంతో మరోసారి అభ్యంతరాలు రావడంతో పాతబస్తీలో మెట్రో ముందడుగు పడలేదు. పాతబస్తీ 5.5 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయాలంటే రూ.1000 కోట్లకు పైగా వ్యయం అవుతోంది. అలాగే దాదాపు 1500-1600 వరకు ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు పాతబస్తీ మెట్రోను గాలికి వదిలేశారు. 


‘కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా’ అవార్డు

ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైలుకు ప్రతిష్టాత్మకమైన కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా-2021 అవార్డు దక్కింది. ఏటా దేశ సుప్రసిద్ధ రియల్‌ ఎస్టేట్‌, మౌలిక సదుపాయాల కంపెనీలను 19 విభాగాల్లో గుర్తించి అవార్డులు అందజేస్తుంటారు. ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌ చిఫ్లుంకర్‌ చేతుల మీదుగా  ఎల్‌అండ్‌టీ అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. నగరంలోని మెట్రో రైలులో 8.35 మెగావాట్‌ పవర్‌ సోలార్‌ ప్లాంట్లు డిపోలు ఉండడంతోపాటుగా 28 స్టేషన్లలో రూట్‌ టాఫ్‌ సోలార్‌ ప్లాంట్లు ఉన్నాయన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐజీబీసీ ప్లాటినమ్‌ రేటింగ్‌ను తమ 20 స్టేషన్లకు అందుకున్నామన్నారు.

Updated Date - 2021-11-29T17:28:30+05:30 IST