ఉపాధి కోసం UAE వెళ్లి.. మానసిక వ్యాధి బారిన పడ్డ Hyderabad యువకుడు.. తన బిడ్డను స్వదేశానికి రప్పించాలంటూ..

ABN , First Publish Date - 2022-07-09T13:45:49+05:30 IST

ఉపాధి కోసం యూఏఈ వెళ్లి, అక్కడ మానసిక వ్యాధి బారిన పడ్డ కొడుకును తన వద్దకు చేర్చాలని ఓ తల్లి వేడుకుంటోంది.

ఉపాధి కోసం UAE వెళ్లి.. మానసిక వ్యాధి బారిన పడ్డ Hyderabad యువకుడు.. తన బిడ్డను స్వదేశానికి రప్పించాలంటూ..

యూఏఈలో అనారోగ్యానికి గురైన కొడుకు కోసం ఓ తల్లి ఆవేదన

హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం యూఏఈ వెళ్లి, అక్కడ మానసిక వ్యాధి బారిన పడ్డ కొడుకును తన వద్దకు చేర్చాలని ఓ తల్లి వేడుకుంటోంది. తన బిడ్డ ఒంటరిగా ప్రయాణం చేసే పరిస్థితిలో లేడని, స్వయంగా వెళ్లి తీసుకొచ్చుకునేందుకు తన వద్ద డబ్బు లేదని ఆమె ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో సాయం కోరుతూ విదేశాంగ శాఖకు లేఖ రాసింది. హైదరాబాద్‌, బోరబండ ప్రాంతానికి చెందిన మాలన్‌ బేగం కుమారుడు మాసూమ్‌ ఎయిర్‌ కండిషన్‌ మెకానిక్‌ వీసాపై 2016 జూన్‌లో దుబాయ్‌ వెళ్లాడు. ఉమ్రా (కాబా యాత్ర) నిమిత్తం గత ఏప్రిల్‌లో అబుదాబీ నుంచి సౌదీ అరేబియా వెళ్లిన మాసూమ్‌ అక్కడ అస్వస్థతకు గురయ్యాడు. ప్రాథమిక చికిత్స అనంతరం మాసూమ్‌ను అబుదాబీలోని సేహా ఆస్పత్రిలో చేర్పించారు.


మా సూమ్‌ను పరీక్షించిన వైద్యులు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న మాలన్‌ బేగం తన కొడుకును స్వదేశానికి రప్పించాలని భావించారు. కానీ, మాసూమ్‌ ఒంటరిగా ప్రయాణం చేయలేడని వైద్యులు తేల్చిచెప్పారు. యూఈఏ వెళ్లి కొడుకును తీసుకువచ్చేంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో మాలన్‌ బేగం ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్‌ సాయంతో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. తన కొడుకును స్వదేశానికి రప్పించాలని విన్నవించారు.

Updated Date - 2022-07-09T13:45:49+05:30 IST