Telangana New Secretariat: కొత్త సచివాలయానికి ఇచ్చిందెంత..? ఇప్పటిదాకా పెట్టిన ఖర్చెంత..? ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెలుగులోకి..!

ABN , First Publish Date - 2022-07-27T17:42:35+05:30 IST

కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నిర్మిస్తున్న కొత్త సచివాలయ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నదానిపై రోడ్లు భవనాల శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరు లోపు అంటే జూలై 31వ తారీఖు లోపు సచివాలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని తేల్చిచెప్పారు.

Telangana New Secretariat: కొత్త సచివాలయానికి ఇచ్చిందెంత..? ఇప్పటిదాకా పెట్టిన ఖర్చెంత..? ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెలుగులోకి..!

కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నిర్మిస్తున్న కొత్త సచివాలయ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నదానిపై రోడ్లు భవనాల శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరు లోపు అంటే జూలై 31వ తారీఖు లోపు సచివాలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌కు చెందిన కరీమ్ అన్సారీ అనే వ్యక్తి కొత్త సచివాలయ నిర్మాణ పనుల గురించి సమాచార హక్కు చట్టం కింద కొన్ని ప్రశ్నలను సంధించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి అసలు ఇప్పటి వరకు ఎంత బడ్జెట్‌ను విడుదల చేశారు.? వాటిల్లో ఎంత ఖర్చు అయింది..? కొత్త సచివాలయ డిజైన్లో పేర్కొన్న కట్టడాల్లో ఇప్పటి వరకు అసలు నిర్మాణానికి నోచుకోనివి ఏవి..? ఏవి నిర్మాణంలో ఉన్నాయి..? అలాగే కొత్త సచివాలయ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది..? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద కరీమ్ అన్సారీ కోరారు. ఈ దరఖాస్తుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పందించి జూలై 21వ తారీఖున అతడికి ప్రత్యుత్తరం పంపించారు. 


కాగా.. పాత సచివాయాన్ని కూల్చివేయడం.. కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతి పొందడం అన్న ప్రక్రయ అయితే అంత సులభంగా జరగలేదు. ‘తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాం. పాత సచివాలయాన్ని ఓ పద్ధతీ పాడు లేకుండా నిర్మించారు. ఏదైనా ప్రమాదం జరిగితే లోపల ఉన్నవాళ్లు బయటకు వెళ్లడానికే వీలు లేకుండా ఉంది. నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి ఈ కట్టడాలు లేవు. ఒక శాఖ నుంచి మరో శాఖకు ఫైళ్ల తరలింపు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పాత సచివాలయం దగ్గర అసలు పార్కింగ్ స్థలమే లేదు. విదేశాల నుంచి ఎవరైనా అతిథులు వస్తే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి అసలే లేదు. సమావేశ మందిరాలు లేవు.. వీడియో కాన్ఫరెన్స్ హాల్స్ కూడా లేవు. ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయలు సరిగా లేవు. ’.. ఇదీ పాత సచివాలయాన్ని కూలగొట్టేముందు కేసీఆర్ సర్కారు చెప్పిన మాటలు. 


25 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాత సచివాలయాన్ని కూలగొట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించినప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. పాత సచివాయంలోని బీ, సీ బ్లాక్‌లను 1978లో, ఏ బ్లాక్‌ను 1998లో, డీ బ్లాక్‌ను 2003లో నిర్మించారు. 2012‌లో హెచ్ (నార్త్), హెచ్ (సౌత్) బ్లాకులను కట్టారు. ఎంతో ధృడంగా ఉన్న కొత్త కట్టడాలను కూడా కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతా బాగున్న కట్టడాలను కూల్చేయడం దేనికంటూ కొందరు కోర్టు మెట్లెక్కారు. వాస్తుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ ఆరోపించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సచివాలయ కూల్చివేతలను తాము అడ్డుకోమంటూనే.. సచివాలయం ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయమనీ.. దీనిలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి ఆడ్డంకులు తొలగిపోయినట్టయింది. 


కొత్త సచివాలయం ఎక్కడ నిర్మించాలన్నదానిపై చాలా ఆలోచించి.. చాలా ప్రాంతాలను ఎంపిక చేసినప్పటికీ.. చివరకు పాత సచివాలయాన్ని కూల్చేసి.. అక్కడే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు. 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో సచివాలయ ఉద్యోగులను బీఆర్కే భవన్‌కు తరలించారు. ఆ తర్వాత కూల్చివేత పనులను మొదలు పెట్టి.. మొత్తానికి పని పూర్తి చేశారు. కొత్త సచివాలయ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కేసీఆర్ సర్కారు అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ ఏడాది దసరా సందర్భంగా కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. 


‘కొత్త సచివాలయ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 617 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వాటిల్లో ఇప్పటిదాకా 217 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. సచివాలయ ప్రధాన భవనంతోపాటుగా దక్షిణ, పశ్చిమ దిశల్లో ఉన్న అనుబంధ భవనాలు, మసీదు, చర్చి, గుడి వంటి అన్ని భవనాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. సచివాలయ నిర్మాణ పనులు జూలై 31వ తారీఖు లోపు పూర్తయ్యే అవకాశం ఉంది..’ అంటూ రోడ్లు భవనాల శాఖ అధికారులు సమచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తుకు బదులిచ్చారు. అన్ని రకాలుగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేయించి ఈ ఏడాది దసరా పర్వదినం సందర్భంగా కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కారు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Updated Date - 2022-07-27T17:42:35+05:30 IST