హైదరాబాద్‌తో ‘లతా’నుబంధం..

ABN , First Publish Date - 2022-02-07T14:25:34+05:30 IST

భారత గానకోకిల లతా మంగేష్కర్‌కు నగరంతో అనుబంధం ఉంది. తొలిసారిగా...

హైదరాబాద్‌తో ‘లతా’నుబంధం..

  • గానకోకిల తండ్రి పేరిట నగరంలో ఓ వీధి
  • నాలుగు సార్లకు పైగా నగరానికి వచ్చిన సంగీత సామ్రాజ్ఞి
  • 1962లో మొదటి సారి..
  • 1970లో తండ్రి స్మారక సభలకు..
  • 1990లో ఘంటసాల విగ్రహావిష్కరణకు
  • శిల్పకళా వేదికపై ఘన సత్కారం
  • అక్కినేని చేతుల మీదుగా కళాసరస్వతి బిరుదు

హైదరాబాద్‌ అంటే గుర్తుకు వచ్చేది చార్మినార్‌.. 

మా నాన్న గారి వద్ద ఒక హారం ఉండేది. అందులో చార్మినార్‌ చిత్రాలు ఉండేవి. ఆ హారాన్ని మా తల్లికి బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి చార్మినార్‌ తెలుసు.  అక్కడి గాజులు  చాలా ప్రసిద్ధి. నేనైతే వెళ్లి కొనలేను కానీ, ఎందుకంటే జనం పోగవుతారు.  మహిళలందరూ  అక్కడి గాజులు కొనుక్కుంటారు. - హైదరాబాద్‌ గురించి లత మంగేష్కర్‌.


హైదరాబాద్‌ సిటీ : భారత గానకోకిల లతా మంగేష్కర్‌కు నగరంతో అనుబంధం ఉంది. తొలిసారిగా 1962లో సంగీత కచ్చేరిలో పాల్గొనేందుకు వచ్చారు. 1975లో నగరం లోని వెంకటేశ థియేటర్‌ వేదికగా లతా తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ 33వ వర్ధంతి, సంస్మరణ సభకు హాజరయ్యారు. కళావేదిక వ్యవస్థాపకులు, సినీ నిర్మాత ఆర్వీ రమణమూర్తి ‘షోలా ఔర్‌ షబ్నం’ అనే హిందీ సినిమాను నిర్మించారు. ఆ చిత్రానికి లతాజీ పాటలు పాడారు. అలా ఆయనకు సంగీత సామ్రాజ్ఞితో పరిచయం. ప్రముఖ రంగస్థల కళాకారుడుగా మరాఠాల అభిమానాన్ని చురగొన్న దీనానాథ్‌కి 1940ల నాటి నగరంలోని నాటక రంగస్థలంతో పరిచయం ఉంది. ఆయనకు నగరంలో కొందరు అభిమానులున్నారు. అలా రమణ మూర్తితో పాటు స్థానిక రంగస్థల ప్రముఖులు కలిసి ఏటా లతా మంగేష్కర్‌ తండ్రి సంస్మరణ సభ నిర్వహించేవారు. ఆ సభలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యేవారు. వారి చొరవతో రంగస్థల, సంగీత ప్రపంచంలో ప్రేక్షకుల అభిమానం చూరగొన్న దీనానాథ్‌ పేరును 1970లలో కోఠి  బ్యాంక్‌ స్ట్రీట్‌లోని ఓ గల్లీకి పెట్టారు. ప్రస్తుతం సిటీబ్యాంకు ఎడమవైపున దీనానాథ్‌ గల్లీని చూడొచ్చు.


విరాళాల సేకరణకు..

నగరంలో ‘మేరీ హై ఆవాజ్‌ హై పెహచాన్‌ హై’ పేరు తో 2002లో లతా మంగేష్కర్‌ సంగీత విభావరి నిర్వహించారు. 1962 తర్వాత సుమారు నలభై ఏళ్ల తర్వాత ఆమె మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు. పుణెలోని దీనానాథ్‌ మం గేష్కర్‌ మెమోరియల్‌ ఆస్పత్రి పరిశోధనా కేంద్రానికి విరాళాల సేకరణలో భాగంగా లతా దీదీ ఆ సంగీత విభావరిలో పాడారు. తర్వాత 1990లలో నాంపల్లి లలిత కళా తోరణం ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహావిష్కరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వా నించారు. గాన కోకిల ప్రార్థనా గీతంతోనే ఆ కార్యక్రమం ప్రారంభమైంది.


లతా దీదీతో ప్రత్యేక అనుబంధం

మా నాన్న ఆర్వీ రమణమూర్తిని లతా మంగేష్కర్‌ సొంత తమ్ముడిలా అభిమానించేవారు. ఆయన చొరవతోనే ఆమె నగరానికి మూడు సార్లు వచ్చారు. 1980లలో ఒకసారి హియాయత్‌నగర్‌లోని మా ఇంటికి లతా దీదీ వచ్చారు. నాన్న చనిపోయినప్పుడు చాలా బాధతో వాయిస్‌ మెసేజ్‌ పంపారు. దీనానాథ్‌ సంస్మరణ సభలు, స్మారక సంచిక తేవడంలోనూ మా నాన్న ప్రముఖ పాత్ర పోషించారు. లతా మంగేష్కర్‌ పేరుతో ప్రముఖ గాయనీ, గాయకులు జానకి, చిత్ర తదితరులకు అవార్డులను ప్రదా నం చేశారు. అలా మా కుటుంబంతో లతా మంగేష్కర్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. - భువన, ఆర్వీ రమణమూర్తి కుమార్తె

 

లతామంగేష్కర్‌ ఇంటికి వెళ్లాను..

లతా మంగేష్కర్‌, ఆశాభోంస్లే ఇరువురితో కలిపి నగరంలో ఒక సంగీత కార్యక్రమం నిర్వహించాలనేది నా కల. అందుకోసం మూడుసార్లు లతాను కలిశాను. మరో సందర్భంలో ప్రఖ్యాత గాయని సుశీల మీద డాక్యుమెంటరీ రూపొందించే క్రమంలోనూ వారింటికి వెళ్లాను. అప్పుడు ఆమె నాకు ఇచ్చిన గౌరవం, నా పట్ల చూపిన వాత్సల్యం నాకు మాత్రమే దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. నా కల నెరవేరకుండానే ఆమె తుదిశ్వాస విడవడం బాధాకరం.- సంజయ్‌ కిషోర్‌, సంగం ఫౌండేషన్‌.




లతా మంగేష్కర్‌ అన్నమయ్య సంస్కృత కీర్తనలను ‘స్వర లతార్చన’ ఆల్బమ్‌ను 2010లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు రూపొందించారు. అందులోని పాటలకు సురేఖమూర్తి తదితర గాయనీ, గాయకులు కోరస్‌ పాడారు. అదే ఏడాది జనవరి 31న శిల్పకళా వేదిక లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, అక్కినేని నాగేశ్వరరావు సమక్షంలో ఆమెను సత్కరించారు. ‘కళా సరస్వతి’ అవార్డు ప్రదానం చేశారు. అంతకు ముందు 2005లో రెండు రోజులు ఓ కార్యక్రమంలో లతా మంగేష్కర్‌ పాల్గొన్నట్లు సినీనటుడు శంకర్‌ మేల్కొటే చెబుతున్నారు. అలా ఆమె నాలుగు సార్లకు పైగా నగరాన్ని సందర్శించినట్లు కళావేదిక నిర్వాహకురాలు రాయవరపు భువన వివరిస్తున్నారు.

Updated Date - 2022-02-07T14:25:34+05:30 IST