ఓ వైపు వరదలు.. మరోవైపు దొంగలు..

ABN , First Publish Date - 2020-10-28T13:28:14+05:30 IST

వరదలు, ముంపులతో నగర జనం అతలాకుతలమవుతోంటే.. అవకాశంగా మలుచుకున్న కొందరు దొంగలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఇల్లు వదిలిన చాలామంది ఇప్పటికీ తెలిసిన వారు, బంధువుల...

ఓ వైపు వరదలు.. మరోవైపు దొంగలు..

హైదరాబాద్‌ : వరదలు, ముంపులతో నగర జనం అతలాకుతలమవుతోంటే.. అవకాశంగా మలుచుకున్న కొందరు దొంగలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఇల్లు వదిలిన చాలామంది ఇప్పటికీ తెలిసిన వారు, బంధువుల ఇళ్లల్లో ఆశ్రయం పొందుతున్నారు. భవంతులున్న కొన్నిచోట్ల గ్రౌండ్‌ ఫ్లోర్‌ వదిలి ఫస్ట్‌ఫ్లోర్‌లకు షిఫ్టు అయ్యారు. అవకాశం లేని వారు ఎలాగోలా ఆయా బస్తీలు దాటి రోడ్లపైకి వచ్చి తెలిసిన వారి వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు వరదముంపు బాధితుల ఇళ్లను కొల్లగొట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.


ఇళ్లు వదిలి..

ఉన్నపళంగా ఇళ్లను వదిలి వెళ్లడంతో ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి, ఆభరణాలు, నగదును భద్రపరిచే తీరిక కూడా లేకుండా పోయింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వారు మాత్రం కనీసం ఇళ్లకు తాళాలు కూడా వేయలేని దుస్థితిలో ఇల్లు వదిలి వెళ్లారు. వర్షాలకు వరద ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. దాంతో ఇళ్లు వదిలి వెళ్లిన వారు తిరిగి వచ్చి తమ ఇళ్ల పరిస్థితి చూడటానికి ఆస్కారం కూడా లేకుండా పోయింది. దీన్నే అవకాశంగా మలుచుకున్న దొంగలు ఇళ్లల్లోకి చొరబడి అందిన కాడికి దోచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఒకటి, రెండు బస్తీల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూసినప్పటికీ.. వర్ష ముంపు బాధితులు అందరూ తిరిగి తమ ఇళ్లకు చేరుకునే సమయానికి ఇలాంటి ఘటనలు మరిన్ని వెలుగు చూసే అవకాశముంది.


ఇళ్లకు తిరిగి రావడంతో..

చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో వర్ష ప్రభావానికి గురైన అల్‌జుబేల్‌ కాలనీ, అలీనగర్‌, గాజియే మిల్లత్‌ కాలనీ ప్రాంతాల్లో ఉన్న బస్తీలన్నీ భారీ వర్షం కురిసిన రోజు దాదాపు ఖాళీ అయ్యాయి. అక్కడ ఉన్న వారు కూడా బంధు మిత్రుల ఇళ్లకు చేరుకుని తలలు దాచుకున్నారు. వారం రోజులు భారీ వర్షాలు కురిశాయి. వర్షాలు కాస్త తగ్గిపోవటంతో స్థానికులు తిరిగి తమ ఇళ్లకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో  కొందరు తిరిగి తమ ఇళ్లకు వచ్చి చూడగా కొన్ని వస్తువులు చోరీ అయినట్లు గుర్తించారు. అందరూ పూర్తిగా తమ ఇళ్లకు చేరుకున్న తర్వాత ఎన్ని ఇళ్లల్లో చోరీలు జరిగాయనేది స్పష్టత వస్తుందని బస్తీవాసులు చెబుతున్నారు. వాస్తవంగా భారీగా వర్షం కురిసిన నాటి నుంచి చాలా మంది ఇళ్లు వదిలి వెళ్లడంతో పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో దొంగలకు కాస్త అవకాశం దక్కి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ అంతరాయం వల్ల అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైతే అందుబాటులో ఉన్న బస్తీ వాసులు రేయింబవళ్లు బస్తీలోని ఇళ్లపై నిఘా పెట్టామని.. ఎవరైనా అనుమానితులు కనిపించగానే విచారిస్తున్నామని తెలిపారు. వర్షం తీవ్రంగా పడిన తొలి మూడు నాలుగు రోజుల్లో ఏం జరిగి ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్‌జుబేల్‌ కాలనీలో ఇప్పటికే రెండు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-10-28T13:28:14+05:30 IST