ఆ ముగ్గురూ ఏమయ్యారో...!

ABN , First Publish Date - 2020-10-18T14:11:35+05:30 IST

అలీనగర్‌ నాలా వరద తాకిడికి ప్రహరీ కూలింది. ఆ ఇంటి వెనకాలకు వరద నీరొచ్చింది. ఇంట్లోకి కూడా వరద వస్తుందేమోనని భయపడి పక్కనే ఉన్న తమ్ముడి ఇంట్లో తలదాచుకుందామని బయలుదేరిన ఎం.ఎ.తాహేర్‌ ఖురేషీ కుటుంబంలోని ఎనిమిది మంది, అతని తమ్ముడు ఈ నెల 13న

ఆ ముగ్గురూ ఏమయ్యారో...!

హైదరాబాద్ : అలీనగర్‌ నాలా వరద తాకిడికి ప్రహరీ కూలింది. ఆ ఇంటి వెనకాలకు వరద నీరొచ్చింది. ఇంట్లోకి కూడా వరద వస్తుందేమోనని భయపడి పక్కనే ఉన్న తమ్ముడి ఇంట్లో తలదాచుకుందామని బయలుదేరిన ఎం.ఎ.తాహేర్‌ ఖురేషీ కుటుంబంలోని ఎనిమిది మంది, అతని తమ్ముడు ఈ నెల 13న కొట్టుకుపోయారు. ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తాహేర్‌ ఖురేషీ చెట్టును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి ఆచూకీ నేటికీ తెలియలేదు.


నాటి జల ప్రళయంపై తాహేర్‌ ఖురేషీ ఏం చెబుతున్నారంటే.. 

ఈ నెల 13వ తేదీ రాత్రి 2:20 నిమిషాలకు ఇంటి వెనకాల పెద్ద శబ్దం రావడంతో నిద్రలేచాను. మేడపైకి వెళ్లి చూస్తే ఇంటి ప్రహరీ కూలిపోయి లోపలకి వరద నీరొస్తోంది. అందరినీ నిద్రలేపాను. పక్కనే తమ్ముడు ఎం.ఎ.ఖుద్దుస్‌ ఖురేషీ నివాసం ఉంటుంది. తమ్ముడికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. ‘మాకు భయంగా ఉంది. మీ ఇంటికి వస్తాను’ అని చెప్పాను. సరేనని చెప్పడంతో అందరమూ ఇంటి ముందున్న ర్యాంపు వద్దకు వచ్చి నిల్చున్నాము. ర్యాంపు ఎడమవైపు నుంచి వరద ప్రవాహం వస్తోంది. కుడిపక్కన నాలా ఉంది. తమ్ముడు బయటకు రావడం చూసి నేను ముందుగా ర్యాంపు దిగి అతని ఇంటివైపు నడవడం ప్రారంభించాను. అందరూ నా వెంట నడవసాగారు. ఇంతలోనే వరద ప్రవాహం పెరిగి నీటిలో కొట్టుకుపోయాం. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. నేను రాత్రంతా మా ఇంటికి దగ్గరలో ఉన్న ఓ తుమ్మ చెట్టును పట్టుకుని నిలబడ్డాను. ఉదయం 5:30 సమయంలో మసీదులో ఆజాన్‌ వినబడగానే మెల్లిగా పైకి లేచి నడుచుకుంటూ ఇంటికి వచ్చాను.


కొట్టుకుపోయారు..

మమ్మల్ని వారి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చిన తమ్ముడు ఖుద్దుస్‌ ఖురేషీ (55)తో పాటు నా కొడుకు ఐటీ ఉద్యోగి వాజిద్‌ ఖురేషీ (31), అతని కుమారుడు వాహేబ్‌ ఖురేషీ (5), డైరీ ఫామ్‌ నిర్వహించే నా మరో కొడుకు వాసే ఖురేషీ (27), కోడళ్లు ఫర్జానా తబస్సుమ్‌, ధరబ్‌షా ఖురేషీ, మనవరాలు అమీనా ఖురేషీ, కోడలు ఫర్జానా హుమేరా కొట్టుకుపోయారు. అమీనా ఖురేషీ, ఫర్జానా తబస్సుమ్‌, దరబ్‌షా ఖురేషీ, ఫర్జానా హుమేరా మృతదేహాలు లభ్యమయ్యాయి. వాజీద్‌, వాసే, ఖుద్దుస్‌ మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాకు ధైర్యం ఇచ్చారు.

Updated Date - 2020-10-18T14:11:35+05:30 IST