Easy Money Fraud: సరికొత్త మోసగాడు... టార్గెట్ వారే..

ABN , First Publish Date - 2022-09-06T00:34:43+05:30 IST

ఈజీ మనీ కోసం కొందరు మోసాల (Frauds)ను వృత్తిగా ఎంచుకుంటున్నారు. మాయమాటలతో అమాయకులను మోసం చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు.. తాము చేసిన..

Easy Money Fraud: సరికొత్త మోసగాడు...  టార్గెట్ వారే..

హైదరాబాద్ (Hyderabad): ఈజీమనీ (Easy Money) కోసం కొందరు మోసాల(Frauds)ను వృత్తిగా ఎంచుకుంటున్నారు. మాయమాటలతో అమాయకులను మోసం చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. తాము చేసిన మోసం వెలుగులోకి వచ్చినా పోలీసులకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్లపై నిఘా పెట్టిన ఏబీఎన్ క్రైమ్ టీమ్‎ (Abn Crime Team)కు ఓ ఘరానా మోసగాడు చిక్కాడు. బస్తీ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సరికొత్త మోసానికి తెరలేపాడు. కొందరు ఏజెంట్లను నియమించుకుని ఓ నయ దందాకు తెరలేపాడు. తీరా మోసపోయామని తెలుసుకున్న అమాయక బస్తీ ప్రజలు బోరుమంటున్నారు. 


సాధారణంగా మనం ఏదైనా ఓ వస్తువును ఫైనాన్స్ (Finance)‎లో కొనాలి అంటే ఆధార్ (Aadhar), పాన్ కార్డ్ (Pan Card), బ్యాంక్ అకౌంట్ (Bank Account) తప్పనిసరి...ఇవేమీ లేకుండా ఫైనాన్స్‎లో వస్తువులను కొనడం దాదాపుగా అసాధ్యం.. ఒకవేళ అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సిబిల్ స్కోర్ లేదని, ట్రాన్సక్షన్స్ లేవని రకరకాల కొర్రీలు పెట్టడం మనం చూస్తుంటాం..కానీ హైదరాబాద్‌లోని జవహర్‌నగర్, బాలాజీ‌నగర్‌లో మాత్రం వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను నిరుపేదలు  కొన్నారు. ఖరీదైన ఐఫొన్స్ కొనుగోలు చేశారు. బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్లు సొంతం చేసుకున్నారు. ఇవన్నీ ఫైనాన్స్ ద్వారానే కొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. వస్తువులు కొన్న వారు  తీసుకున్న రెండు మూడు నెలలకే ఫైనాన్స్ కట్టడం మానేశారు.  ఫైనాన్స్ ఎందుకు కట్టట్లేదని తీరా గ్రౌండ్‌కెళ్ళి వివరాలు సేకరించిన రికవరీ ఏజంట్లకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి. ఫైనాన్స్ పేరిట జరిగిన స్కాం బయట పడింది. వాస్తవానికి ఫైనాన్స్‌లో బస్తీ వాసుల పేరుతో వస్తువులు కొన్నప్పటికి అవి వారికి చేరలేదు. మధ్యలో ఎంటర్ అయిన ఓ వ్యక్తి ఆ వస్తువుల్ని చేజిక్కించుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా బస్తీ వాసులకు వస్తువు విలువలో కొంత మొత్తాన్ని ముట్టచెప్పాడు. బస్తీ వాసుల దగ్గర తీసుకున్న ఆ వస్తువులను ఇతర షో రూమ్‌లలో కొన్న రేట్‌కు విక్రయించి లాభాలను పొందాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బస్తీ వాసులకు దగ్గరుండి ఫైనాన్స్ చేయించింది ఆ వస్తువులను కొనిచ్చింది ఆ వ్యక్తే కావడం కొసమెరుపు. 


బాలాజీ నగర్‌కు  చెందిన వేణు గోపాల్ ఈ స్కాంకు ప్రధాన సూత్రధారి.. గతంలో ఇలాంటి మోసాలు చేయడంలో ఆరి తేరిన వేణుగోపాల్ (VenuGopal) ఈ మోసాల్నే తన వృత్తిగా మార్చుకున్నాడు. ముందుగా అమాయకులను ఆసరాగా చేసుకుని మోసం చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని రంగంలోకి దిగాడు. జవహర్ నగర్, బాలాజీ నగర్, తదితర ప్రాంతాల్లో ఉండే నిరుపేదలు, రోడ్డు పక్కన షెల్టర్ పొందుతున్న వాళ్లను టార్గెట్‌గా పెట్టుకున్నాడు. తన మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి వీలుగా ఏరియాల వారిగా కొందరు ఏజెంట్లను నియమించుకున్నాడు. ముందుగా తమ ప్లాన్‌లో భాగంగా వేణు గోపాల్‌తో పాటు ఏజెంట్లు బస్తీ వాసులు, రోడ్ సైడ్ షెల్టర్ పొందుతున్న వారు అలాగే ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారి దగ్గరకు వెళ్తారు. వారికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే లోన్ ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. తాము చెప్పినట్టు చేస్తే సులభంగా లోన్ వస్తుందని నమ్మిస్తారు. వారి అమాయకత్వాన్ని బట్టి లోన్ తిరిగి కట్టాల్సిన అవసరం లేదని చెప్తారు. కూలి నాలి చేసుకునే వాళ్ళు కాబట్టి చెప్పినట్టు చేస్తే డబ్బులు వస్తాయని ఆశతో కేటుగాళ్లు చెప్పినట్టు చేస్తున్నారు. మరోవైపు ఆధార్ పాన్ కార్డ్ లేని వారికి సైతం వేణు గోపాల్ అండ్ టీమ్ కార్డులను సమకూరుస్తుంది. 


అనంతరం బాధితులను తీసుకుని స్థానికంగా ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే షో రూమ్‌కు వెళ్తారు.  తమకు ఫైనాన్స్‌లో టీవీ (Tv), ఫ్రిజ్ (Fridge) లాంటివి కావాలి అని కోరుతారు. అక్కడే ఫైనాన్స్ ఏజంట్ల ద్వారా డాక్యుమెంటేషన్ పూర్తి చేయిస్తారు. కొనాల్సిన వస్తువుకు సంబంధించిన డౌన్ పేమెంట్ బాధితుల పేరుతో వేణు గోపాల్ చెల్లిస్తారు. అనంతరం షాప్‌లో బాధితుల పేరు మీద ఓ యాభై వేల రూపాయల విలువ చేసే వస్తువు కొంటే ఆ వస్తువును బాధితులకు ఇవ్వకుండా తనే తీసుకుని కేవలం ఐదు పది వేల రూపాయలు బాధితుల చేతిలో పెడతారు. ఇదే మీకు వచ్చిన లోన్ అని చెప్పి బాధితులను నమ్మిస్తాడు. అనంతరం బాధితుల నుండి చేజిక్కించుకున్న వస్తువును యాక్చువల్ రేట్‌కు బయట షాపులకు విక్రయిస్తూ వేణు గోపాల్ లాభాలను పొందుతున్నాడు. అమాయకుల పేరుతో వస్తువులను కొని ఆ వస్తువులను అమ్ముకోవడం ద్వారా మంచి ఆదాయం ఉండటంతో వేణు గోపాల్ ఈ మోసాలను కంటిన్యూ చేస్తున్నాడు. 


ఇదంతా తెలియని బాధితులు వేణు గోపాల్ చెప్పినట్టు నడుచుకున్నారు. ఇలా అతని బాధితులు వందల్లో ఉన్నారు. అయితే  తీసుకున్న ఫైనాన్స్ తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు రంగ ప్రవేశంతో ఇతని  స్కాం వెలుగులోకి వచ్చింది.  కొన్న వస్తువుకు  సంబంధించిన వాయిదాలు కట్టాలంటూ బాధితుల వద్దకు వెళ్లిన రికవరీ ఏజెంట్లకు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి యాభై వేల రూపాయలు విలువ చేసే వస్తువు కొంటే వేణుగోపాల్ బాధితులకు ఇచ్చింది మాత్రం పది వేల లోపే. కానీ రికవరీ ఏజెంట్లు మాత్రం వస్తువు మీరే తీసుకున్నారు కాబట్టి యాభై వేలు మీరే కట్టాలి అంటూ ఉండటంతో మోసపోయామని గ్రహించి బాధితులు లబోదిబోమంటున్నారు.


బాలాజీ నగర్‌కు చెందిన మహిళకు లోన్ ఇప్పిస్తానని వేణు గోపాల్ సంప్రదించాడు. లోన్ ప్రాసెస్ మొత్తం తాను చూసుకుంటా అని తాను చెప్పినట్టు చేస్తే చాలని చెప్పాడు. ఆమె పేరుపై వేణు యాభై వేల విలువ చేసే  టీవీ కొన్నాడు.  ఇందులో బాధితురాలికి ఇరవై వేలు ఇచ్చి ఆమె పేరుతో కొన్న టీవీ అతనే తీసుకువెళ్ళాడు. తాను తీసుకున్నది ఇరవై వేలు అయితే రికవరీ ఏజెంట్ యాభై వేలు కట్టాలని అంటున్నారని, ఏజెంట్ రికవరీ కోసం వచ్చే దాకా తాము మోసపోయినట్టు తెలియలేదని బాధితురాలి ఏబీఎన్ ముందు బాధితురాలు వాపోయారు. 


లోన్ ఇప్పిస్తా అని వేణు గోపాల్ తనను సంప్రదించారని మరో బాధితురాలు అంటున్నారు. తనకు పాన్ కార్డ్ లేకపోతే వేణు గోపాల్ ఇప్పించాడని, పాన్ కార్డ్ వచ్చిన అనంతరం తన పేరుపైర రూ. 35 వేల విలువ చేసే ఫ్రిజ్ కొన్నాడని చెప్పింది. తనకు లోన్ ఇప్పిస్తా అని తీసుకువెళ్ళాడని, తీరా తనకు ఐదు వేల రూపాయలు లోన్ శాంక్షన్ అయిందని చెప్పి తన పేరుపై ఫ్రిజ్ కొన్నాడని వాపోయింది. వేణు గోపాల్ తనను మోసం చేయడమే నాలాంటి వాళ్ళను చాలా మందిని మోసం చేశాడని చెప్తోంది


మరో బాధితుడికి సంబంధించిన వివరాలతో ఒకే రోజు మూడు టీవీలు కొన్నాడు వేణు గోపాల్. ఇందుకోసం బాధితుడికి మాయ మాటలు చెప్పాడు. నీ పేరుపై నేను లోన్ తీసుకుంటా అని దాన్ని నేను కట్టుకుంట అని నమ్మబలికాడు. తాను లోన్ తీసుకుని కట్టడం ద్వారా భవిష్యత్‌లో బ్యాంకులు పెద్ద ఎత్తున లోన్లు ఇస్తాయని బాధితుడిని నమ్మించాడు. డబుల్ బెడ్ రూంలకు కూడా బ్యాంక్ లోన్ ఇస్తాయని కపట మాటలు చెప్పాడు. అదంతా నిజం అని నమ్మిన బాధితుడి చేతిలో ఐదు వేలు పెట్టు ఒకే రోజు మూడు టీవీలను కొని వాటిని ఇతర షాపులో అమ్మి లాభాలను పొందాడు వేణు గోపాల్.... తన పన్నాగం కోసం బాధితుడికి పాన్ కార్డ్‌తో పాటు ఓ బ్యాంక్‌లో అకౌంట్ కూడా తెరిపించాడు.. 


అమాయకులను మోసం చేయడానికి వేణుగోపాల్ ఏకంగా ఓ చిన్నపాటి ఆఫీస్‌నే తెరిచాడు. అందులో ఓ యువతిని ఎంప్లాయ్‌గా నియమించుకుని ఆమె చేతే ఫైనాన్స్ ప్రాసెసింగ్, వస్తువులను కొనడం వంటివి చేయించాడు... తన వద్ద ఎంప్లాయ్‌గా పనిచేసిన యువతికి కూడా కుచ్చుటోపీ పెట్టాడు వేణు గోపాల్.. ఆ యువతి ఇంట్లో ఇద్దరి పేరు మీద ఫైనాన్స్‌లో వస్తువులు కొని వారిని కూడా మోసం చేశాడు. దీంతో ఆ యువతి వేణు గోపాల్ మోసం తెలుసుకుని అతని వద్ద నుండి బయట పడింది.. ఇక ఇదే కాకుండా ప్రాంతాల వారీగా ఏజెంట్లను నియమించుకున్నాడు. వారి సహాయంతో అమాయకులను మోసం చేశాడు. ప్రతిఫలంగా ఏజెంట్లకు వెయ్యి రెండు వేల చొప్పున చెల్లించాడు.. ఇక  మోసం చేసి కొనుగోలు చేసిన వస్తువులను వేణు గోపాల్ గజ్వేల్‌లో విక్రయించే వాడు..గజ్వేల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తన నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకుని మోసం చేసి కొనుగోలు చేసిన వస్తువులను మార్కెట్ రేట్ ప్రకారం అమ్మి సొమ్ము చేసుకున్నాడు.. బాధితులు మాత్రం ఫైనాన్స్‌లు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. రోజు వారి కూలీలుగా పని చేసుకుంటూ పొట్ట పోసుకునే తమను వేణు గోపాల్ మోసం చేశాడని వేలకు వేలు ఫైనాన్స్‌లు ఎలా చెల్లించాలంటూ విలపిస్తున్నారు. 


వేణు గోపాల్ మోసాలపై నిఘా పెట్టిన ఏబీఎన్ క్రైమ్ టీం అతన్ని సంప్రదించగా వ్యంగంగా మాట్లాడాడు.. అవును ఇతరుల పేరు మీద వస్తువులను కొన్నాను. వాటిని ఇతర షాపుల్లో విక్రయించాను తప్పేంటి అని నిస్సిగ్గుగా మాటలు పేలాడు. అయినా  జర్నలిస్టులు ఎప్పుడు రికవరీ ఏజెంట్లుగా మారారని వ్యంగంగా మాట్లాడుతూ తనను ఎవరు ఏం చేయలేరన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. బాధితులు అమాయకులు కావడంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయరన్న ధీమాతో ఇంకా తన మోసాలను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే వందలాది మందిని మోసం చేసిన వేణు గోపాల్ ఇంకా అక్రమ సంపాదన కోసం వంకర మార్గాలను వెతుకుతున్నాడు. ఇకనైనా అతని మోసాలపై జవహర్ నగర్ పోలీసులు దృష్టి సారించాలి. వేణు గోపాల్ లాంటి వారి మోసాలను లైట్ తీసుకుంటే ఫైనాన్స్ సంస్థల వేధింపులకు అమాయకులు బలి అవ్వాల్సి ఉంటుంది.




Updated Date - 2022-09-06T00:34:43+05:30 IST