గంజాయి దందాపై సీక్రెట్ ఆపరేషన్‎.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-05-27T00:20:54+05:30 IST

గంజాయి దందాపై ABN క్రైమ్ బ్యూరో సీక్రెట్ ఆపరేషన్‎ చేసింది. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి ...

గంజాయి దందాపై సీక్రెట్ ఆపరేషన్‎.. వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్: గంజాయి దందాపై ABN  క్రైమ్ బ్యూరో సీక్రెట్ ఆపరేషన్‎ చేసింది. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలు సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో గంజాయి వ్యాపారులు కొత్త రూటు ఎంచుకున్నారు. మహిళలతో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు.  


తెలంగాణ ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపింది. ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేసి సాగు చేసే వారిపై కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెద్దఎత్తున హైదరాబాద్‌కు గంజాయి రవాణా అవుతోంది. దీంతో పోలీసులు చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నిందితులు దొరికిపోతున్నారు.


గతంలో ఇబ్రహీంపట్నంలో విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలుగా మారి పోలీసులకు పట్టుబట్టారు.  ఆ సమయంలో గంజాయి వినియోగాన్ని, రవాణాను నివారించాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్‌ పోలీసులు, పోలీసులు సంయుక్తంగా పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు.  అంతేకాదు గంజాయి అమ్ముతున్న ప్రాంతాల్లో కూడా సోదాలు చేసి భారీ ఎత్తున అరెస్ట్‌లు చేశారు. దీంతో కొంతమేర గంజాయి సరఫరా కంట్రోల్‌ అయింది. 


అయితే గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. మహిళలతో గంజాయి దందా చేయిస్తున్నారు. పెద్ద అంబర్‌పేట అవుటర్‌ రింగ్‌రోడ్డు‌పై హయత్‌నగర్‌ పోలీసులు ఏకంగా 470 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వాహనాల్లో మహిళలుంటే తనిఖీ చేయరని... కమీషన్‌ ఆశ చూపి వాళ్లను గంజాయి అమ్మకాల్లో ఇన్వాల్వ్ చేశారు.


తాజాగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 470 కిలోల గంజాయిని కార్లలో హైదరాబాద్‌ తరలిస్తున్నారు. పెద్ద అంబర్‌పేట వద్ద కార్లలోకి గంజాయిని మార్చుతుండగా హయత్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పక్క రాష్ట్రంలో గంజాయి సాగును కంట్రోల్‌ చేస్తే తెలంగాణలో అక్రమ రవాణాకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2022-05-27T00:20:54+05:30 IST