మీరే రియల్‌ హీరోలు.. మీ కుటుంబాలకు సెల్యూట్‌!

ABN , First Publish Date - 2020-06-07T14:25:57+05:30 IST

క్షణం తీరిక లేకుండా లాక్‌డౌన్‌ విధులు నిర్వర్తించిన పోలీసుల్లో కొందరికి కరోనా సోకడం బాధాకరం అని, వారు చేసిన సేవలకు గర్విస్తున్నానని సీపీ అంజనీకుమార్‌ అన్నారు.

మీరే రియల్‌ హీరోలు.. మీ కుటుంబాలకు సెల్యూట్‌!

హైదరాబాద్‌ : క్షణం తీరిక లేకుండా లాక్‌డౌన్‌ విధులు నిర్వర్తించిన పోలీసుల్లో కొందరికి కరోనా సోకడం బాధాకరం అని, వారు చేసిన సేవలకు గర్విస్తున్నానని సీపీ అంజనీకుమార్‌ అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పోలీసులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని సీపీ అన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి, వారికి సహకరించిన కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులు రియల్‌ హీరోలంటూ కితాబిచ్చారు.


శనివారం తారామతిబారాదరిలో నిర్వహించిన ‘స్త్రీ’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు, వలస కూలీలకు పోలీసులు నిత్యావసరాలు అందించారని,  ప్రాణాపాయంలో ఉన్న జంతువులను కూడా కాపాడి అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. సీఎం చెప్పినట్లుగా ఏ ఒక్క వలస కార్మికుడు ఖాళీ కడుపుతో ఉండకూడదన్న మాటలను  ఆచరించేందుకు పోలీసులు  శ్రమించారన్నారు. ఇంత గొప్ప టీం తన వెంట ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. అన్నింటికన్నా గొప్ప ఉద్యోగం పోలీసులదని అభిప్రాయపడ్డారు. 


లంగర్‌హౌస్‌ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో నిందితులను అరెస్ట్‌ చేసేవరకు ఈస్ట్‌జోన్‌ పోలీసు సిబ్బంది విశ్రమించలేదన్నారు. హత్యలు జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి 3.30 గంటల సమయంలో నిందితులను అరెస్ట్‌ చేసిన తర్వాతే ఇళ్లకు వెళ్లారని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేసిన పోలీసులకు 6 నుంచి 8 వారాల తర్వాతే ఒక్కరోజు సెలవు ఇచ్చామన్నారు. లాక్‌డౌన్‌ వేళ పోలీసులు అనేక ఇతర అత్యవసర సేవలనూ అందించారని, గర్భిణులను ఆస్పత్రులకు తరలించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కేరళలో ఏనుగు మరణం వెనుక మానవత్వం లేని కొందరు మనుషులు ఉన్నారని, వారి చేష్టలు మనిషి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ వేళ దాదాపు ఐదు లక్షల మంది వలస కార్మికులను తరలించామన్నారు. అమెరికా పరిణామాల గురించి కూడా వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-07T14:25:57+05:30 IST