చెత్త డంపింగ్‌ కబ్జాకు ప్లానింగ్‌

ABN , First Publish Date - 2021-10-27T17:46:04+05:30 IST

ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే తాట తీస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్న జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం విభాగాలు ఐటీ కారిడార్‌లో రోడ్డు పక్కనే జరుగుతున్న కబ్జాతంతును

చెత్త డంపింగ్‌ కబ్జాకు ప్లానింగ్‌

బడా నేతల భూ దందా

ఐటీ కారిడార్‌లో బడా నేతలు భూ దందాకు తెగబడ్డారు. పేదలను వంచించి కోట్లకు పడగలెత్తేందుకు ఏకంగా ప్రభుత్వ భూమినే చెరబట్టారు. నోటరీ ద్వారా భూములు విక్రయిస్తూ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. విప్రో జంక్షన్‌ నుంచి గోపన్‌పల్లికి వెళ్లే వంద అడుగుల రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు అంటూ రూ.లక్షలు తీసుకుని పేదలకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ రెవెన్యూ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 


పేదల ఆశలతో చెలగాటం

ప్రభుత్వ భూముల అమ్మకం

60 గజాలకు లక్షల వసూళ్లు 

చెత్త వేయడం, ఆక్రమించడం

గోపన్‌పల్లి సర్వే నెంబర్‌ 37లో కబ్జా తీరు 

అన్యాక్రాంతమవుతున్న విలువైన భూమి

తహసీల్దార్‌ ఆదేశాలు 

పట్టించుకోని రెవెన్యూ అధికారి


హైదరాబాద్‌సిటీ/రాయదుర్గం: ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే తాట తీస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్న జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం విభాగాలు ఐటీ కారిడార్‌లో రోడ్డు పక్కనే జరుగుతున్న కబ్జాతంతును పట్టించుకోవడం లేదు. ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌లోని విప్రో జంక్షన్‌ నుంచి గోపన్‌పల్లి మార్గంలో వంద అడుగుల ప్రధాన రహదారి ఉంది. ఆ దారి వెంట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కొలువవడంతో చదరపు గజం లక్షల్లో పలుకుతోంది. గోపన్‌పల్లి రెవెన్యూ సర్వేనెంబర్‌ 37, 34లో సుమారు 320 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని టీఎన్‌జీఓ, ఏపీఎన్‌జీఓ, సెక్రటేరియట్‌ ఉద్యోగులకు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం ఇచ్చింది. దాంతో పలువురు కాలనీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్థలంలో భూ దందా జరుగుతోంది. సర్వే నెంబర్‌ 37లో గతంలో ఈ ప్రాంతంలోని స్టోన్‌ క్రషర్ల వద్ద పనిచేసే పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవారు. దశాబ్దకాలంగా ఈ ప్రాంతంలో భూముల విలువ విపరీతంగా పెరిగి పోవడంతో కబ్జాదారులు పేదలను అడ్డు పెట్టుకొని వారి గుడిసెల పక్కనే గుడిసెలు వేస్తున్నారు. 60 గజాల చొప్పున ప్లాట్లుగా చేసి రూ. 4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మొదట గుడిసెలు వేసుకోవాలని, తర్వాత నిర్మాణాలు చేసుకోవాలని సూచిస్తున్నారు. నోటరీలతో విక్రయిస్తున్నారు.


ముందు చెత్త, తర్వాత గుడిసెలు

జర్నలిస్టు కాలనీని ఆనుకుని ఉన్న ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు మొదట చెత్తను పోస్తున్నారు. నిర్మాణరంగ, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను రాత్రి సమయంలో నెంబర్లు లేని వాహనాల్లో తీసుకొస్తున్నారు. ఎన్‌సీసీ కంపెనీ ఇతర ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చి ఇక్కడే పెద్దఎత్తున పోస్తోందని స్థానికులు వాపోతున్నారు. చెత్తతో ఆ ప్రాంతాన్ని దుర్గంధంగా మార్చిన తర్వాత ఒక్కొక్కటిగా గుడిసెలు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానికంగా ఉన్న బడా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వీరికి కొంత మంది అధికారుల అండదండలు ఉండడంతో భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. వారం రోజుల క్రితం బదిలీపై వెళ్లిన ఓ రెవెన్యూ అధికారి పరోక్షంగా ఈ దందాకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమణలపై గతంలో శేరిలింగంపల్లి తహశీల్దార్‌కు ఫిర్యాదులు రావడంతో గుడిసెలను తొలగించాలని, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సదరు అధికారి కొన్ని గుడిసెలను తొలగించి మొత్తం తొలగించినట్లు పై అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులకు తొలగించిన గుడిసెల స్థానంలో కూడా కబ్జాదారులు తిరిగి గుడిసెలు వేశారు. ఈ దందాలో కీలకంగా ఉన్న రెవెన్యూ అధికారి తక్కువ సమయంలో అందినకాడికి దండుకొని ఇక్కడి నుంచి బదిలీ చేయించుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. 


నిఘా లేదు.. 

విప్రో జంక్షన్‌కు కూతవేటు దూరంలోనే రోడ్డు వెంట ప్రభుత్వ భూమిలో పెద్దఎత్తున చెత్తను డంప్‌ చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. ఇక్కడ ఎలాంటి నిఘా లేదు. తమకు సంబంధం లేదన్నట్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలతో చెత్త వేయకుండా పలు ప్రాంతాల్లో నిఘా పెంచినట్లుగా ఈవీడీఎం అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. భారీ స్థాయిలో చెత్త పేరుకుపోయి ఈ ప్రాంతం దుర్గంధంగా మారిపోవడంతో పందుల ఆవాసంగా మారింది. వాటి వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయని సమీప కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-10-27T17:46:04+05:30 IST