Abn logo
Sep 21 2021 @ 10:23AM

HYD: గచ్చిబౌలిలో భారీ దోపిడీ

యజమాని ఇల్లు గుల్ల చేసిన నేపాలీ దంపతులు

దైవదర్శనానికి వెళ్లి వచ్చేలోపు..

రూ. 15 లక్షలు, 1.2 కిలోల బంగారు నగలతో పరారీ


హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం: గచ్చిబౌలిలో ఓ ఇంట్లో  పనిమనుషులుగా చేరిన నేపాలీ దంపతులు భారీ దోపిడీకి పాల్పడిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమానులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి వచ్చేలోగా ఇల్లు గుల్ల చేశారు. రూ. 15 లక్షలు, 1.2కిలోల బంగారు నగలు అపహరించారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి టెలికామ్‌నగర్‌లో ప్రముఖ వ్యాపారి బీరమ్‌ గోవిందరావు నివసిస్తున్నాడు. తన మూడు అంతస్తుల భవనంలో మూడో అంతస్తు అద్దెకు ఇచ్చాడు. రెండు అంతస్తుల్లో కుటుంబంతో ఉంటున్నాడు. ఆయన ఇంట్లో నాలుగు నెలల క్రితం నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు పవిత్ర(30), లక్ష్మణ్‌(34) పనిలో చేరారు. దంపతులు నమ్మకంగా పనిచేస్తుండడంతో గోవిందరావు కుటుంబం వారిని పూర్తిగా నమ్మింది. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుంటుంబంతో కలిసి గోవిందరావు కుటుంబం శనివారం ఉదయం 11 గంటలకు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని పనిమనుషులకు చెప్పారు. అదునుకోసం ఎదురు చూస్తున్న నేపాలీ దపంతులు యజమాని కుటుంబం ఊరెళ్లిన రోజు అర్ధరాత్రి చోరీ పథకాన్ని అమలు చేశారు. ఇంట్లో మెయిన్‌ పవర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు. కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్‌రూమ్‌లో ఉన్న లాకర్‌ తెరిచి అందులో ఉన్న 1.2 కిలోల బంగారు నగలు, రూ. 15 లక్షలు తీసుకుని పారిపోయారు. 


గోవిందరావు శ్రీశైలం నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు వాచ్‌మన్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఇంటిపక్కనున్న స్నేహితుడికి ఫోన్‌ చేశారు. ఆయన వెళ్లి చూడగా వాచ్‌మన్‌ దంపతులు కనిపించకపోవడంతో లేరని చెప్పాడు. స్నేహితుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి గోవిందరావు ఫోన్‌ చేయగా.. వాచ్‌మన్‌ ఉదయం నుంచి కనిపించడం లేదని చెప్పారు. గోవిందరావు కుటుంబం వెంటనే ఆదివారం రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు. కిటికీ గ్రిల్స్‌, బెడ్‌రూమ్‌ లాకర్‌ తెరిచి ఉండడంతో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.