Abn logo
Sep 21 2021 @ 12:02PM

HYD: మళ్లీ దంచికొట్టింది

 పలు ప్రాంతాల్లో భారీ వర్షం... పాతబస్తీలో కుండపోత

 తాడు పట్టుకుని వరద దాటిన స్థానికులు

 జాపార్కు వద్ద అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు


హైదరాబాద్‌ సిటీ: నగరంలో వర్షం మళ్లీ దంచికొట్టింది. ఆదివారం మధ్యాహ్నం మబ్బులు కమ్ముకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే చిరుజల్లులు మొదలై భారీ వర్షం కురియడంతో జనజీవనం స్తంభించిపోయింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, రోడ్లపై చిరువ్యాపారులు వర్షంతో తడిసి ముద్దయ్యారు. ప్రధానంగా సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, చిక్కడపల్లి, రామంతాపూర్‌, రాంనగర్‌, కవాడిగూడ, ఇందిరాపార్కు, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, విద్యానగర్‌, అడిక్‌మెట్‌, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉప్పర్‌పల్లి పిల్లర్‌నెంబర్‌ 191 వద్ద సుమారు 45 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఓ సందర్భంలో సోమవారం రాత్రి 9 వరకు భారీ వర్షం కురిసే అవకాశముందని, అత్యవసర పనులకు తప్ప.. మిగతా ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు. 


పాతబస్తీలో వరద ఉధృతి

మదీన : సుమారు గంటపాటు  కురిసిన కుండపోత వర్షంతో పాతబస్తీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా బహదూర్‌పురా నాలా వర్షానికి పొంగి పొర్లడంతో రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరింది. ఆ మార్గంలో వెళ్లిన పాదచారులు, వాహనదారులను తాడు సాయంతో స్థానిక యువకులు దాటించారు. అలాగే చార్మినార్‌ వద్ద వరద భారీగా ప్రవహించింది. వీటితోపాటు బండ్లగూడ, ఆసి్‌ఫనగర్‌, లంగర్‌హౌజ్‌లోని రోడ్లపై వర్షపు నీరు పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సైదాబాద్‌ కృష్ణానగర్‌ వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. డీఆర్‌ఎఫ్‌ బృందం వచ్చి మృతదేహన్ని బయటకు  తీసింది. కిషన్‌బాగ్‌కు వెళ్ళే దారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నడుముకన్నా ఎక్కువ లోతు వరకు నీరు నిలిచి ఉండడంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు. ఛత్రినాక, హనుమాన్‌ నగర్‌, లలితాబాగ్‌లలో బస్తీలన్నీ జలమయమయ్యాయి. ఛత్రినాక చౌరస్తాలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా పాతబస్తీలో ఏర్పడిన వరద ఇబ్బందులపై చాలామంది ట్విట్టర్‌ ద్వారా ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 


జూపార్కులో..

జూపార్కు వెనుక వైపు ఉన్న మీరాలం చెరువు మరోసారి నిండిపోయింది. చెరువు కట్టపైనుంచి నేరుగా జూపార్కులోకి వరద నీరు ప్రవహించింది. 9.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 

హైదరాబాద్మరిన్ని...