Hyd: విశాఖలో రూ. లక్ష.. సిటీలో 3 లక్షలు

ABN , First Publish Date - 2021-09-17T17:24:05+05:30 IST

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తైలం (హాషిష్‌ ఆయిల్‌)ను నగరానికి స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠా ఆట కట్టించారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు

Hyd: విశాఖలో రూ. లక్ష.. సిటీలో 3 లక్షలు

గంజాయి ఆయిల్‌కు డిమాండ్‌

ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్న రాచకొండ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తైలం (హాషిష్‌ ఆయిల్‌)ను నగరానికి స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠా ఆట కట్టించారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ. 9లక్షల విలువైన 3 లీటర్ల హాషిష్‌ ఆయిల్‌, యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌, రూ. 800 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ కార్యాలయంలో గురువారం సీపీ మహేష్‌ భగవత్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 


మెదక్‌ జిల్లా నార్సింగ్‌ మండలం చేగుంటకు చెందిన మల్లప్పగారి శ్రీకాంత్‌ పటాన్‌చెరులో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి విశాఖపట్నంకు చెందిన మునగపాక వెంకటరాజు స్నేహితుడు. ఇద్దరూ కలిసి కొంతకాలంగా విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌, పటాన్‌చెరు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు. శ్రీకాంత్‌ తన అనుచరులతో కలిసి గంజాయిని విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నాడు. 


గంజాయి పోయి.. ఆయిల్‌ వచ్చే.. 

కేజీల కొద్దీ గంజాయిని సప్లై చేయడం కన్నా.. గంజాయి తైలం నుంచి (హాషిష్‌ ఆయిల్‌)ను సరఫరా చేయడం ఉత్తమమని భావించారు. సులభంగా ట్రాన్స్‌పోర్టు చేయవచ్చని పథకం వేశారు. తనతో పాటు గంజాయి తైలం సరఫరా చేయడానికి విశాఖపట్నంకు చెందిన తల్లవలస కొండల్‌రావు, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్‌పల్లికి చెందిన చాకలి వెంకటేశ్‌ లను శ్రీకాంత్‌ తన ముఠాలో చేర్చుకున్నారు. విశాఖ నుంచి వెంకటరాజు ద్వారా లీటర్‌ రూ. లక్ష చొప్పున 5 లీటర్ల హాషిప్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి శ్రీకాంత్‌ హైదరాబాద్‌కు తీసుకొస్తాడు. దాన్ని అనుచరుల ద్వారా పదిగ్రాములు రూ. 3000 చొప్పున కస్టమర్‌లకు అమ్ముతుంటాడు. మొత్తంగా లీటర్‌కు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నాడు.


ఇలా పట్టుబడ్డారు.. 

ముఠాలోని వెంకటేష్‌, కొండల్‌ రావులు లీటర్‌ హాషిష్‌ ఆయిల్‌ను విక్రయించడానికి యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌పై ఎల్‌బీనగర్‌కు వచ్చారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌ బాబు, లా అండ్‌ ఆర్డర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాలతో డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షణలో స్మగ్లింగ్‌ ముఠాలోని వెంకటేష్‌, కొండల్‌రావులను పట్టుకున్నారు. వారి ద్వారా ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. వెంకటరాజు పరారీలో ఉన్నాడు. చాకచక్యంగా స్మగ్లింగ్‌ ముఠా ఆటకట్టించిన ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటి లా అండ్‌ ఆర్డర్‌ టీమ్‌ను సీపీ అభినందించారు.

Updated Date - 2021-09-17T17:24:05+05:30 IST