నాగపూర్‌ నుంచి హైదరాబాద్ వచ్చి బాబాగా అవతారమెత్తి.. చివరికి..!

ABN , First Publish Date - 2021-02-20T13:45:44+05:30 IST

బాబా ముసుగులో అమాయకులను తప్పుదోవ పట్టిస్తూ...

నాగపూర్‌ నుంచి హైదరాబాద్ వచ్చి బాబాగా అవతారమెత్తి.. చివరికి..!

  • మోసాల బాబా.. దృష్టి మరల్చి చోరీలు
  • ముగ్గురు అంతరాష్ట్ర మోసగాళ్ల అరెస్టు
  • చోరీలకు పాల్పడుతున్న మరో ఘరానా దొంగ అరెస్టు 
  • రెండు వేర్వేరు కేసుల్లో రూ. 20లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ : బాబా ముసుగులో అమాయకులను తప్పుదోవ పట్టిస్తూ, దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నాగపూర్‌ ప్రాంతానికి చెందిన సలీమ్‌ అలీ (60), మహమ్మద్‌ సాదిఖ్‌ (24), ఖుర్బాన్‌ అలీ (23)లతో పాటు మరో ఇద్దరు కలిసి ఓ ముఠాగా తయారయ్యారు. ఈ గ్యాంగుకు సలీం లీడర్‌. 1993 నుంచే నేరాల బాట పట్టిన సలీమ్‌ దృష్టి మరల్చి మోసాలకు పాల్పడటంలో నేర్పరి. తన బంధుమిత్రులను తన గ్యాంగులో చేర్చుకుని మోసాలు చేస్తుంటాడు. ఇప్పటి వరకు మహారాష్ట్రలోని కోత్వాలి, గిట్టిఖదన్‌, పైఢోనీ పోలీ్‌సస్టేషన్లతో పాటు నగరంలో ఉప్పల్‌, మార్కెట్‌ పీఎస్‌లలో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. ఈ గ్యాంగు సభ్యులు టార్గెట్‌ చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి అక్కడ వ్యాపార సముదాయాలకు దగ్గరలో, తక్కువ ఖర్చులో ఉండే లాడ్జిల్లో బస చేస్తుంటారు. 


అక్కడ బాబా అవతారమెత్తి అమాయకులను తమ బుట్టలోకి దించుతారు. సలీం బాబా వేషం వేసుకుని తన వద్ద శక్తి ఉందని నమ్మిస్తాడు. అతనితో పాటు ఉన్న మిగతా ఇద్దరు తాము కూడా సమస్యలతో వచ్చామని అక్కడి వారిని నమ్మిస్తారు. బాబా వద్దకు వచ్చే వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆయా సమస్యలను కోడ్‌ భాషలో బాబాకు తెలియజేస్తారు. బాబా తన వద్ద అతీంద్రీయ శక్తులున్నట్లు నటించి వారి సమస్యల గురించి ప్రస్తావించగానే బాధితులకు నమ్మకం పెరుగుతుంది. అదే ఆశతో వా రిని పూర్తిగా బుట్టలోకి దించడం.. బాబా ఆశీస్సులు తీసుకోవాలంటూ నమ్మిస్తూ వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను తీసుకుని పరారవుతుంటారు. సమాచారం మేరకు నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులు ముగ్గరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 


దృష్టి మరల్చి..

దృష్టి మరల్చి మోసాలకు పాల్పడటంతో పాటు ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. హబీబ్‌ ముస్తఫా (ఇతనిపై 15 నాన్‌బెయిలబుల్‌ వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి) చోరీల్లో ఆరితేరిన వాడు. ఇతని అరెస్టుతో 15 చోరీ కేసుల చిక్కుముడి వీడింది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. మాదన్నపేట్‌ ప్రాంతానికి చెందిన హబీబ్‌ (44) అలియాస్‌ దిలావర్‌ ఖాన్‌ మెకానిక్‌గా పని చేసేవాడు. ఇప్పటి వరకు 42 చోరీ కేసుల్లో నిందితుడు. ఇతనితో పాటు అంతరాష్ట్ర ముఠా నుంచి సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రూ. 20లక్షలు విలువ చేసే 290 గ్రాముల బంగారం, 217 గ్రాముల వెండి ఆభరణాలు, 3 మోటార్‌ సైకిళ్లు, 2ఎల్‌ఈడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి సౌత్‌జోన్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌ ద్వారా ఈ రెండు గ్యాంగుల ఆట కట్టించారు.

Read more