Abn logo
Sep 21 2021 @ 12:10PM

అధికారులకు పండగ

 గ్రేటర్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాలెన్ని, ఎన్ని క్రేన్లు కావాలన్నది ముందస్తుగా అంచనా వేయాలి. అదేమీ లేకుండా అవసరానికి మించి క్రేన్లు ఏర్పాటు చేశారని, ఇదంతా కమీషన్ల కోసమే అనీ అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంతో పోలిస్తే విగ్రహాలు తగ్గగా, క్రేన్ల సంఖ్య ఎందుకు పెరిగిందన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. నిమజ్జనానికి 5 లక్షల మంది వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేసిన విభాగాలు 15 లక్షల మాస్కులను కొనుగోలు చేయడంపై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి.


నిమజ్జన వేళ ప్రజాధనం వృథా

అవసరానికి మించి ఏర్పాట్లు 

కమీషన్ల కోసమే అన్న ఆరోపణలు 

మాస్క్‌ల నుంచి క్రేన్ల వరకు  ఫ ఏర్పాట్లలో ఎవరికి వారే..

బల్దియా, ఈవీడీఎం విడివిడిగా కంట్రోల్‌  రూంలు 

జీహెచ్‌ఎంసీ, వైద్య విభాగం.. వేర్వేరుగా మాస్కుల పంపిణీ


హైదరాబాద్‌ సిటీ: బోనాలు, గణేష్‌ నిమజ్జనం, బక్రీద్‌, రంజాన్‌ వంటివి కొందరు అధికారులకు కాసులు కురిపించే పండుగలుగా మారుతున్నాయి. లెక్కా పత్రం, ఉన్నత స్థాయి పరిశీలన లేకపోవడంతో ఏర్పాట్ల పేరిట ఇష్టానికి ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో కింది స్థాయి వారు ప్రత్యేక బృందాలు, అదనపు వాహనాలు, వ్యర్థాలను సేకరించే కవర్ల కొనుగోలు పేరిట కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. వీటిలో మెజార్టీ ఒకటి, రెండు రోజుల వ్యవధి ఉండే టెండర్‌ విధానం ద్వారా సమకూరుస్తున్నవే. కొందరు అధికారులు తమకు తెలిసిన సంస్థలకు మాత్రమే సమాచారమిచ్చి బిడ్‌ దాఖలు చేసేలా జాగ్రత్త పడుతుంటారు. కాంట్రాక్టు విలువను బట్టి వారికి కమీషన్‌ అందుతుందని ఓ జోనల్‌ కమిషనర్‌ పేషీలోని ఉద్యోగి తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని చార్మినార్‌, సికింద్రాబాద్‌ జోన్ల పరిధిలో ఈ తరహా తతంగాలు ఎక్కువగా జరుగుతాయన్న విమర్శలున్నాయి. కాగితాల్లో అంకెల గారడీ చేసి బిల్లులు చెల్లిస్తుంటారు. ఈ ఏడాది చివరి నిమిషంలో నిమజ్జన ఏర్పాట్లు చేయడంతో గందరగోళం మరింత పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదనుగా  కొందరు కిందిస్థాయి అధికారులు మాయ చేశారనే ఆరోపణలున్నాయి. నిమజ్జన కేంద్రాల వద్ద కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటులోనూ ఇష్టారాజ్యమే. జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం ఒకే సంస్థ పరిధిలో ఉన్నప్పటికీ, వేర్వేరుగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాయి. జీహెచ్‌ఎంసీ 106 క్రేన్లు ఏర్పాటు చేయగా.. ఆర్‌ అండ్‌ బీ, ఇతర విభాగాలు మరో 250కిపైగా క్రేన్లు ఏర్పాటు చేశాయని చెబుతు న్నారు. క్రేన్ల కోసం జీహెచ్‌ఎంసీ రూ.9 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్టు ఓ అధికారి చెప్పారు. 


15 లక్షల మాస్కులు  ఏమయ్యాయ్‌..?

మహా నిమజ్జనం వేళ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయలోపం మరోసారి బయటపడింది. వేడుకల వేళ ఏర్పాట్ల పేరిట ప్రజాధనాన్ని పలు శాఖలు వృథా చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ విభాగం ఏం చేయాలి, కొవిడ్‌ నేపథ్యంలో ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఒకే పనిని వేర్వేరు విభాగాలు చేశాయి. గ్రేటర్‌లో శోభాయాత్ర, నిమజ్జనానికి 5 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా. తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. కానీ జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలు భిన్నంగా వ్యవహరించాయి. మనదేం పోతుందిలే అనుకున్నారేమో.. ఎవరికి వారుగా కొవిడ్‌ నియంత్రణ చేపట్టాయి. హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ఐదు లక్షలు, వైద్యారోగ్య శాఖ ఏకంగా 10 లక్షల మాస్క్‌లు కొనుగోలు చేసింది. మాస్క్‌ల కోసం జీహెచ్‌ఎంసీ రూ.6.60 లక్షలు వెచ్చించింది. నిమజ్జన ఏర్పాట్లపై పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ వివిధ విభాగాలతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎవరు ఏ ఏర్పాట్లు చేయాలన్నది చర్చించలేదా, చర్చించినా అధికారులు పట్టించుకోలేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఐదు లక్షల మంది భక్తుల కోసం రెండు విభాగాలు 15 లక్షల మాస్క్‌లు కొనుగోలు చేశాయి. ఇందులో ఎన్ని పంపిణీ చేశారు, ఎన్ని మిగిలాయి వాటిని ఏం చేస్తారో అధికారులకే తెలియాలి. జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం మొత్తం మాస్క్‌లు పంపిణీ చేశామని చెబుతున్నారు. 

హైదరాబాద్మరిన్ని...