అకృత్యాలు ఆగేదెన్నడు?

ABN , First Publish Date - 2021-09-16T17:42:45+05:30 IST

ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ఓ మానవ మృగం మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. గంజాయి మత్తులో ఉన్న కామాంధుడు.. కారా పొట్లం ఇస్తానని చెప్పి పాపను గుడిసెలోకి

అకృత్యాలు ఆగేదెన్నడు?

హైదరాబాద్‌ సిటీ :  ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ఓ మానవ మృగం మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. గంజాయి మత్తులో ఉన్న కామాంధుడు.. కారా పొట్లం ఇస్తానని చెప్పి పాపను గుడిసెలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి అనంతరం చంపేశాడు. గుడిసెలోనే మృతదేహాన్ని వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఎప్పటికప్పుడు పోలీసులు పోకిరీలు, ఆకతాయిల ఆటకటిస్తున్నా చిన్నారులు, మహిళలపై అరాచకాలు ఆగడం లేదు. 


చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులు

దేశంలో.. ప్రతి అరగంటకు ఓ చిన్నారిపై హింస

ప్రతి నలుగురిలో ఒకరిపై లైంగిక దాడి

ప్రపంచంలో దేశంలోనే అధికం


చట్టాలున్నా.. రక్షణ లేదు.. 

ఇటీవల ట్రై కమిషనరనేట్‌ పరిధిలో చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్థులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయి. న్యాయస్థానాలు మరణ శిక్షతో పాటు, యావజ్జీవ కారాగార శిక్షలు, 20 ఏళ్లు, 15 ఏళ్లు ఇలా నేరతీవ్రతను బట్టి కఠిన శిక్షలు విధిస్తున్నాయి. అయినా మృగాళ్లలో మార్పు రావడంలేదు. దేశంలో చిన్నారులు, మహిళలపై రోజు రోజుకు లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా.. నిర్భయ లాంటి పదునైన చట్టాలు చేసినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. 


స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం.. 

ప్రతి అరగంటకు ఒక చిన్నారి లైంగిక దాడికి గురవుతోంది.

లైంగిక హింసకు గురవుతున్న బాలికలు - ప్రతి నలుగురిలో ఒకరు

 లైంగిక హింసకు గురవుతున్న బాలురు - ప్రతి 20 మందిలో ఒకరు

 లైంగిక హింసను ఎదుర్కొంటున్న వారిలో  

అమ్మాయిలు - 53 శాతం. అబ్బాయిలు - 49 శాతం

 చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో 50 శాతం తెలిసిన, పరిచయం ఉన్న వ్యక్తులే

 ఇళ్లలో లైంగిక హింసకు గురవుతున్న చిన్నారులు 53 శాతం

 స్కూల్లో లైంగిక వేధింపులు భరిస్తున్న చిన్నారులు 49 శాతం

 పని ప్రదేశాల్లో లైంగిక దాడులను ఎదుర్కొంటున్న చిన్నారులు 61 శాతం

చైల్డ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో లైంగిక హింసకు గురవుతున్న వారు 47 శాతం


బాలిక పట్ల అసభ్య ప్రవర్తన 

బంజారాహిల్స్‌: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఓ కుటుంబం బంజారాహిల్స్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మ్‌న్‌గా పనిచేస్తూ సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉంటోంది. వారికి ఓ కుమార్తె(11) ఉంది. ఈ నెల12న బాలిక తండ్రిసరుకులు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. తల్లి పనికి వెళ్లింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై హెల్మెట్‌ పెట్టుకొని వచ్చిన వ్యక్తి నేరుగా సర్వెంట్‌ క్వార్టర్స్‌లోని బాత్‌రూంలోకి వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఇంటి యజమాని బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని కూడా అందచేశాడు. గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


లైంగిక హింసపై ఫిర్యాదు చేయాలనుకుంటే..

డయల్‌  100

చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ - 1098

హైదరాబాద్‌ సిటీ, వాట్సప్‌ నెంబర్‌ 9490616555

సైబరాబాద్‌ వాట్సప్‌ నెంబర్‌- 9490617444

రాచకొండ వాట్సప్‌ నెంబర్‌ -9490617111

Updated Date - 2021-09-16T17:42:45+05:30 IST