Abn logo
Sep 16 2021 @ 11:12AM

HYD: నైజీరియన్లకు సహకరిస్తున్న సైబర్‌ నేరగాడిపై పీడీ యాక్ట్‌

హైదరాబాద్‌ సిటీ: నైజీరియా కేటుగాళ్లకు సహకరిస్తూ, సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న అనిల్‌ కుమార్‌ పాండేపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. బుధవారం ఆ వివరాలను సీపీ వెల్లడించారు. బిహార్‌కు చెందిన అనిల్‌కుమార్‌ పాండే.. ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఈ క్రమంలో హోటల్‌కు వచ్చే నైజీరియా సైబర్‌ నేరగాళ్లతో పరిచయం ఏర్పడింది. గిఫ్ట్‌ ఫ్రాడ్‌, మ్యాట్రిమోనియల్‌ మోసాలు చేయడంలో నైజీరియన్లు సిద్ధహస్తులు. మోసం చేయగా వచ్చే డబ్బును డెబిట్‌ కార్డుల ద్వారా డ్రా చేసి ఇవ్వడానికి అనిల్‌కుమార్‌ బ్యాంకు ఖాతాలను ఉపయోగించేవారు. ఎంత డబ్బు డ్రా చేసి ఇస్తే అందుకు 10శాతం కమీషన్‌ చెల్లించేవారు. అక్రమంగా డబ్బు వస్తుండడంతో అనిల్‌కుమార్‌ సెక్యూరిటీ గార్డు పని మానేసి, తూర్పు ఢిల్లీలో కిరాణా దుకాణం ఏర్పాటు చేశాడు. ఎక్కువ మందితో పరిచయం కావడంతో పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలను సేకరించి నైజీరియా సైబర్‌ నేరగాళ్లకు అందించాడు. సైబర్‌ నేరగాళ్లతో జతకట్టిన అనిల్‌ దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి రూ. 24.50లక్షలు కొల్లగొట్టాడు. రాచకొండ పరిధిలో జరిగిన గిఫ్ట్‌ఫ్రాడ్‌ కేసులో ఢిల్లీకి వెళ్లిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు జులై 18న నైజీరియన్‌ ఫెడిలిస్‌ ఒబిన్నిన్‌తో పాటు అనిల్‌కుమార్‌ పాండేను అరెస్టు చేశారు. నైజీరియన్‌ నేరగాళ్లకు సహకరించిన అనిల్‌కుమార్‌పై సీపీ పీడీయాక్ట్‌ నమోదు చేశారు.