వర్షం పడితే వరద.. తగ్గితే బురద!

ABN , First Publish Date - 2022-09-29T17:42:54+05:30 IST

నగరంలో ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కంకర తేలి.. గుంతలమయమై.. పోటెత్తిన వరదకు నీళ్లు నిలిచి.. బురదగా మారి.. ఇసుక మేటలు వేసిన రహదారులపై

వర్షం పడితే వరద.. తగ్గితే బురద!

గుంతలు, కంకరమేటలు

నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

వందల కోట్లతో మరమ్మతులు చేసినా నాణ్యతాలేమి


హైదరాబాద్‌ సిటీ: నగరంలో ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కంకర తేలి.. గుంతలమయమై.. పోటెత్తిన వరదకు నీళ్లు నిలిచి.. బురదగా మారి.. ఇసుక మేటలు వేసిన రహదారులపై ప్రయాణాలు చేస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తగ్గితే బురదమయంగా మారుతున్నాయి. వాతావరణం పొడిగా ఉంటేనేమో.. దుమ్మురేగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వర్షానికి ఉస్మాన్‌గంజ్‌, ఎల్బీనగర్‌ రెయిన్‌బో ఆస్పత్రి, టోలిచౌకి, నదీంకాలనీ, పరేడ్‌ గ్రౌండ్‌ రోడ్‌, సుందరయ్య పార్కు, ఛేనంబర్‌, రామంతాపూర్‌ ధర్మకిరణ్‌ హోమియో ఆస్పత్రి, లక్డీకాపూల్‌, బంజారాహిల్స్‌ పీఎఫ్‌ ఆఫీస్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై మోకాలిలోతు నీళ్లు నిలవడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడ్డప్పుడే కాదు.. ఆ తర్వాత రోడ్లపై అలాగే నీరు నిలిచి ఉండటంతోనే రోడ్లు నాశనం అవుతున్నాయి. అధికార యంత్రాంగం మరమ్మతులు చేసి అప్పటికప్పుడు రోడ్లను నిగనిగలాడేలా చేస్తున్నా నాణ్యతా రహిత మెటీరియల్‌ వాడుతుండటంతో కొన్నిరోజులకే పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. మరమ్మతు పనుల్లో శాస్త్రీయ విధానం అవలంభించకపోవడమే ఇందుకు కారణమని ఇంజనీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


 గ్రేటర్‌లో 9104 కి.మీల మేర రోడ్లున్నాయి. ఇందులో 812 కి.మీల ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ)లో భాగంగా ఐదేళ్ల కాలవ్యవధికి ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందుకుగాను రూ.1839 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మిగతా రోడ్ల నిర్మాణం, నిర్వహణ జీహెచ్‌ఎంసీ అధీనంలో ఉంది. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తుకేబుళ్లు, బాక్స్‌ డ్రెయిన్‌లు, వరద నీటి కాలువలల నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వర్షాకాలానికి ముందే పలు ప్రాంతాల్లో ఆయా పనులు పూర్తయినా రోడ్ల పునరుద్ధరణ చేపట్టలేదు. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. చినుకు పడిందంటే రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. 


నీళ్లు నిలిచే ప్రాంతాలు 140కి పైగానే

నగరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలు 140కిపైగా ఉన్నట్టు గతంలో గుర్తించారు. నగరం విస్తరిస్తున్న క్రమంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద నీటి సమస్యకు పరిష్కారం చూపామని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాకున్నా కొంత ఉపశమనం లభించింది. అదే సమయంలో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాని ప్రాంతాలు 100కు పైగానే ఉన్నాయి. రోజు రోజు కొత్త ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలుస్తోంది.  ఈ సమస్య పరిష్కారానికిగానూ వాక్యూమ్‌ డీవాటర్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (వీడీసీసీ) ప్యాచ్‌లు వేస్తామని ప్రకటించినా చాలా చోట్ల పనులు పూర్తి కాలేదు. దీంతో తరచూ రోడ్లపై గుంతలు ఏర్పడటంతోపాటు, కంకర, మట్టి మేటలు వేస్తోంది. సీఆర్‌ఎంపీ రోడ్లలోనూ పలుచోట్ల గుంతల మరమ్మతులో సంబంధిత ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అయినా అధికారులు వారికి పెనాల్టీ విధించడంలో ఉదాసీనంగా    వ్యవహరిస్తున్నారు. 


వీడని వాన

నగరంలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురిసింది. రహదారులు వరద నీటితో మునిగిపోయాయి. రోడ్లపై మురుగునీరు ఏరులై ప్రవహించింది. హయత్‌నగర్‌లో అత్యధికంగా 4.7, గచ్చిబౌలి ఖజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 3.1 సెం.మీ వర్షం కురిసింది. 


మరో రెండురోజుల పాటు వర్షాలు

మరో రెండు రోజుల పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో  భారీ వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అన్నారు. 

Updated Date - 2022-09-29T17:42:54+05:30 IST