జల.. కలుషితం..!

ABN , First Publish Date - 2022-04-10T16:53:51+05:30 IST

మాదాపూర్‌ గుట్టలబేగంపేట, లంగర్‌హౌజ్‌లోనే కాదు.. రహమత్‌నగర్‌ డివిజన్‌ బ్రహ్మశంకర్‌నగర్‌, ఓంనగర్‌, ఓల్డ్‌ హఫీజ్‌పేట, సంతోష్‌నగర్‌ పరిధిలోని

జల.. కలుషితం..!

నగరంలో కలుషిత నీటి సరఫరా ఒకరి ప్రాణాలను బలిగొనడం కలకలం రేపుతోంది. మాదాపూర్‌లోని గుట్టలబేగంపేటలో మూడో రోజూ మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. లంగర్‌హౌజ్‌లోని వినాయకనగర్‌, అంబేడ్కర్‌నగర్‌, గాంధీనగర్‌ ప్రాంతాల్లో నీళ్లు కలుషితం అయ్యాయి. మూడు కాలనీల్లోనూ కనీసం ఇంటికొకరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నీరు కలుషితం అయ్యేందుకు గల కారణాలను అన్వేషిస్తోంది. ఏళ్ల నాటి పైపులైన్‌ వ్యవస్థ, వినియోగంలో లేని పైపులైన్లను తొలగించకపోవడం వల్ల వాటిలో నిల్వ ఉన్న నీళ్లు ప్రధాన పైపులైన్‌లోకి రావడం, నీటి సరఫరా నిలిపినప్పుడు నీళ్లు వెనక్కి వెళ్లే క్రమంలో మురుగునీరు కలుస్తుండడం వల్ల ఆయా ప్రాంతాల్లో నీరు కలుషితం అవుతున్నట్లు భావిస్తున్నారు. 


పురాతన పైపులైన్లతో తంటాలు  

పక్క పక్కనే తాగునీరు, మురుగులైన్లు

అడ్డగోలు తవ్వకాలతో ఇబ్బందులు

అశాస్ర్తీయంగా మరమ్మతు పనులు

ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు 


హైదరాబాద్‌ సిటీ: మాదాపూర్‌ గుట్టలబేగంపేట, లంగర్‌హౌజ్‌లోనే కాదు.. రహమత్‌నగర్‌ డివిజన్‌ బ్రహ్మశంకర్‌నగర్‌, ఓంనగర్‌, ఓల్డ్‌ హఫీజ్‌పేట, సంతోష్‌నగర్‌ పరిధిలోని ఆర్‌సీనగర్‌ ఈద్‌బజార్‌, జహనుమా, ఆర్‌కేపురం డివిజన్‌ కొత్తపేటలో ఇలా కోర్‌సిటీలోని పలు ప్రాంతాల్లో నిత్యం కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఈ తరహా ఫిర్యాదులు వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి. కానీ వేసవిలోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జలాశయాల నుంచి నగరానికి అత్యంత శుద్ధి చేసిన నీరే సరఫరా అవుతున్నా, గృహ కనెక్షన్లకు సరఫరా చేసే క్రమంలోనే కలుషితం అవుతున్నాయని అంటున్నారు.


లీకేజీల్లోకి మురుగునీరు..

కోర్‌ సిటీ పరిధిలో నిజాం కాలం నాటి పైపులైన్‌ వ్యవస్థ ఉంది. అది తరచూ దెబ్బతింటోంది. రంధ్రాలు పడ్డ చోట పైపులైన్లలోకి మురుగునీరు చేరుతోంది.  నగర విస్తరణలో తాగునీటి పైపులైన్‌ పక్కనే డ్రైనేజీ లైన్లు వచ్చాయి. వాటర్‌బోర్డు అధికారుల అధ్యయనంలో కూడా ఈ విషయాన్ని గుర్తించి కొన్ని చోట్ల పైపులైన్లు మార్చాలని సూచించారు. కోర్‌సిటీలోని పాతబస్తీతో పాటు నారాయణగూడ, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌, అంబర్‌పేట, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో పురాతన పైపులైన్‌ వ్యవస్థను మార్చాల్సి ఉంది. సుమారు రెండు వేల కిలోమీటర్ల మేర పైపులైన్‌ వ్యవస్థను మార్చాలంటే రూ.3వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ పనులు చేపట్టడం లేదు. 

ఇష్టానుసారంగా కనెక్షన్లు

అక్రమంగా కనెక్షన్ల కోసం తవ్వకాలు చేపట్టే క్రమంలో ప్రధాన పైపులైన్లు దెబ్బతింటున్నాయి. రాత్రివేళల్లో అశాస్త్రీయంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో లీకేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల స్థానికుల నిర్లక్ష్యం కూడా తాగునీరు కలుషితం కావడానికి కారణమవుతోంది. నీటి సరఫరా నిలిచిపోయినా కొందరు కుళాయి కట్టడం లేదు. దాంతో అదే పైపునుంచి మురుగునీరు వెనక్కి వెళ్తోంది. 


మూడో రోజూ అస్వస్థత

మాదాపూర్‌ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో మూడో రోజూ మరి కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కొండాపూర్‌లోని జిల్లా, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


యుద్ధ ప్రాతిపదికన పనులు జలమండలి జీఎం డేవిడ్‌రాజ్‌

లంగర్‌హౌస్‌: లంగర్‌హౌ్‌సలోని ఆయా బస్తీల్లో కలుషిత నీటి సమస్యకు రెండు రోజుల్లో చెక్‌ పెడతామని జలమండలి డివిజన్‌ - 3 జీఎం డేవిడ్‌రాజ్‌ తెలిపారు. శనివారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. 


ఖాళీ బిందెలతో ఆందోళన

పైపులైన్లను పరిశీలించేందుకు శనివారం గాంధీనగర్‌కు వచ్చిన జీఎం డేవిడ్‌రాజ్‌ను, ఇతర అధికారులను మహిళలు నిలదీశారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా మురుగునీరు వస్తున్నా పట్టించుకోలేదని కార్పొరేటర్‌ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పనులు పూర్తిచేసి మంచినీటిని అందిస్తామని జీఎం ప్రజలకు హామీ ఇచ్చారు.


వైద్య శిబిరాలు 

లంగర్‌హౌజ్‌లోని అంబేడ్కర్‌ నగర్‌, గాంధీనగర్‌, వినాయకనగర్‌ బస్తీల్లో శనివారం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వాంతులు, విరేచనాలు అవుతున్న వారికి మందులు అందజేసినట్లు గోల్కొండ క్లస్టర్‌ సీనియర్‌ మెడికల్‌ అధికారి అనురాధ తెలిపారు. కలుషిత నీరే దీనికి కారణం అన్నారు. 

Updated Date - 2022-04-10T16:53:51+05:30 IST