‘మహా’ ప్లాన్‌ @2051

ABN , First Publish Date - 2022-05-11T17:58:26+05:30 IST

మాస్టర్‌ ప్లాన్‌ - 2051 రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా అధికార యం త్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రత్యేక కన్సల్టెన్సీ ఏర్పాటు

‘మహా’ ప్లాన్‌ @2051

భవిష్య అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు

రీజినల్‌ రింగ్‌రోడ్డు అవతలి వరకు అభివృద్ధి

మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు సర్కారు నిర్ణయం

అమలుదిశగా త్వరలోనే అడుగులు


ముప్పై ఏళ్ల నగర భవిష్యత్‌ అవసరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం అవుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ - 2031, 2041 తప్పులతడకగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో నూతన ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి కోసం సరికొత్త ప్లాన్‌కు త్వరలోనే అడుగులు పడనున్నాయి.


హైదరాబాద్‌ సిటీ: మాస్టర్‌ ప్లాన్‌ - 2051 రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా అధికార యం త్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రత్యేక కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నిర్ణీత గడువులోగా కొత్త మాస్టర్‌ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవలే నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్న మాస్టర్‌ప్లాన్‌లు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటుకానున్న సరికొత్త పట్టణాలు, సిటీలకు ఒకే మాస్టర్‌ప్లాన్‌ ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే ఓఆర్‌ఆర్‌ లోపలున్న నగరం,  ఓఆర్‌ఆర్‌ అవతలి నుంచి ప్రతిపాదిత రీజనల్‌ రింగ్‌రోడ్డు వరకు ఉండే నగరం, ఆర్‌ఆర్‌ఆర్‌ అవతల మరో ఐదు కిలోమీటర్ల వరకు గల ప్రాంతాలతో మహా మాస్టర్‌ప్లాన్‌ అవసరమని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.


భవిష్యత్‌ అవసరాలకు..

హెచ్‌ఎండీఏ పరిధి ఏడు జిల్లాల్లోని 70 మండలాలు, 40 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 719 గ్రామ పంచాయతీలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందడానికి అధికారులు మాస్టర్‌ప్లాన్‌కు కసరత్తు చేస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీతోపాటు ఏడు కార్పొరేషన్లు, 32 మున్సిపాలిటీలు, భవిష్యత్తులో వాటి పరిసర ప్రాంతాల్లో వచ్చే అభివృద్ధిని రాబోయే 30 ఏళ్లకు అంచనా వేయనున్నారు. 2051 అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడే నగరాలు, అభివృద్ధి చేయాల్సిన రోడ్లు, ఫార్మా, ఫ్యాబ్‌, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, ఆటోమొబైల్స్‌, లాజిస్టిక్‌ తదితర వాటిని మాస్టర్‌ప్లాన్‌లోనే నిర్ధారణ చేయనున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో నిర్ణయించే జోన్లు, రోడ్ల ఆధారంగానే భవిష్యత్తు పట్టణ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. కొత్త మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే ఏడు కార్పొరేషన్లు, 32 మున్సిపాలిటీలు, హెచ్‌ఎండీఏ భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.


మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు కన్సల్టెన్సీ

హెచ్‌ఎండీఏ పరిధిలోని ఐదు మాస్టర్‌ప్లాన్‌లను ఇంటిగ్రేటెడ్‌ చేసే బాధ్యతను గతంలో ఆర్వీ కన్సల్టెన్సీకి అప్పగించారు. తాజాగా రూపొందించే మాస్టర్‌ప్లాన్‌ కొత్తది కావడంతో రీజినల్‌ రింగ్‌రోడ్డు అవతల ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ల ఆధారంగా జోన్లను నిర్ణయించనున్నారు. వచ్చే 30 ఏళ్లను అంచనా వేయడానికి వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు, ఆయా ప్రాంతాల్లో కొన్నాళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాల్సి ఉంటుంది. పట్టణ, నగరాల అభివృద్ధికి అనుగుణంగా గ్రీన్‌జోన్లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి ఆయా ప్రాంతా ల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల నేతృత్వంలో మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు కన్సల్టెన్సీని నియమించనుంది. ఇందుకోసం త్వరలో టెండర్లను ఆహ్వానించి కొత్త మాస్టర్‌ప్లాన్‌ బాధ్యతలను అప్పగిస్తారని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే విధంగా దిశానిర్ధేశం చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Read more