ప్రభుత్వ భూమా.. అమ్మేయ్‌..!

ABN , First Publish Date - 2022-01-26T16:41:31+05:30 IST

కబ్జారాయుళ్లకు నగర శివారులోని జవహర్‌నగర్‌ బంగారు బాతుగా మారింది. కొందరు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించి, అమ్మేస్తున్నారు. జవహర్‌నగర్‌ చుట్టూ సుమారు

ప్రభుత్వ భూమా.. అమ్మేయ్‌..!

కబ్జారాయుళ్లకు బంగారు బాతు జవహర్‌నగర్‌

షాడో కార్పొరేటర్‌ భూ దందా

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ స్టింగ్‌  ఆపరేషన్‌లో వెలుగులోకి.. 


హైదరాబాద్‌ సిటీ/ జవహర్‌నగర్‌: కబ్జారాయుళ్లకు నగర శివారులోని జవహర్‌నగర్‌ బంగారు బాతుగా మారింది. కొందరు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించి, అమ్మేస్తున్నారు. జవహర్‌నగర్‌ చుట్టూ సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతుండగా, ఆ భూముల్లో చాలా వరకు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని.. నేడు వందల ఎకరాలే మిగిలాయని చెబుతున్నారు. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ రంగంలోకి దిగగా, షాడో కార్పొరేటర్‌ బాగోతం బయట పడింది.  


ఎవరీ షాడో కార్పొరేటర్‌.. 

కార్పొరేషన్‌ పరిధిలో మూడో డివిజన్‌ అధికార పార్టీ కార్పొరేటర్‌ భర్త బల్లి శ్రీనివాస్‌ మొన్నటి వరకు సాధారణ వ్యక్తి. భార్య ప్రజా ప్రతినిధి కాగానే, అతను షాడో కార్పొరేటర్‌గా అవతారమెత్తాడు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, పేకాట కేసులో పోలీసులకు అడ్డంగా చిక్కాడు. తన అనుచరగణంతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్న అతను అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులకు తలనొప్పిగా మారాడు. మంత్రి అనుచరుడనని ప్రచారంతో అధికారులు సైతం అతడి కబ్జా బాగోతాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. 


స్టింగ్‌ ఆపరేషన్‌ ఇలా.. 

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి బృందం బల్లి శ్రీనివాస్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసి, తమకు ప్లాట్‌ కావాలని అడిగింది. దీంతో ఒకరు వచ్చి చెన్నాపురం టు డెంటల్‌ కాలేజీ వెళ్లే దారిలో ఐదు ఎకరాల స్థలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ‘దిస్‌ల్యాండ్‌ బిలాంగ్స్‌ టు తెలంగాణ గవర్నమెంట్‌’ అన్న బోర్డు స్పష్టంగా ఉంది. అక్కడి నుంచి చిక్కులోని బావి వద్ద ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న పది ఎకరాల స్థలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడా.. దిస్‌ ల్యాండ్‌ బిలాంగ్స్‌ టు తెలంగాణ గవర్నమెంట్‌ అనే బోర్డు దర్శనం ఇచ్చింది. స్థలం చూసిన తర్వాత ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ బృందం షాడో కార్పొరేటర్‌ వద్దకు వచ్చింది. సదరు స్థలాన్ని సొంత స్థలంగా పేర్కొం టూ లే అవుట్‌ పత్రాలు కూడా చూపించారు. ‘జవహర్‌ నగర్‌ మొత్తం నాదే.. నేను అమ్మేది మాజీ సైనికుల ల్యాండ్‌. ఆ లెక్కన జవహర్‌నగర్‌ మొత్తం మాజీ సైనికులకు అలాట్‌ చేసిన భూమే... ఇప్పటికే జవహర్‌నగర్‌లో నివసించే వారికి రాని సమస్య మీ కెందుకు వస్తుంది’ అని అభయం ఇచ్చాడు. వాస్తవానికి అతను ఆక్రమించిన భూములన్నీ మాజీ సైనికులవే.. కేవలం నోటరీల మీదే ప్లాట్ల క్రయవిక్రయాలు కొనసాగించి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. 


స్పందించిన అధికారులు  

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన కథనాలతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. కబ్జాలు పరిశీలించేందుకు అంతర్గత విచారణకు ఆదేశించారు. షాడో కార్పొరేటర్‌ ఇప్పటి వరకు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను విజిలెన్స్‌ అధికారులు తనిఖీచేసి, వాటి వివరాలు సేకరిస్తున్నారు. ఓ వైపు అధికారుల విచారణ సాగుతుండగానే, షాడో కార్పొరేటర్‌ భూములను అమ్మే ప్రయత్నాలు మాత్రం ఆపలేదని తెలుస్తోంది. 


పీడీ యాక్ట్‌కు రంగం సిద్ధం 

గతంలో జవహర్‌నగర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న బల్లి శ్రీనివాస్‌ గత ఏడాది అధికార పార్టీలో చేరారు. అంబేడ్కర్‌నగర్‌లోని ప్రభుత్వ భూమి సర్వేనంబర్‌ 266, 267, 268లలో ఉన్న సుమారు 10 ఎకరాల్లో పేపర్‌పైనే లే-అవుట్‌చేసి ఇప్పటికే 3 ఎకరాలను అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. చెన్నాపురం సమీపంలోని సర్వేనంబర్‌ 647లో కూడా మరికొందరు అధికార పార్టీ కార్పొరేటర్లను కలుపుకొని అక్కడా వ్యవహారం నడిపి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్నారు. గతంలోనే రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బల్లి శ్రీనివా్‌సపై పోలీసులు పీడీయాక్డ్‌ నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

Updated Date - 2022-01-26T16:41:31+05:30 IST