బోనాల బందోబస్తులో 8 వేల మంది సిబ్బంది

ABN , First Publish Date - 2021-08-01T16:06:45+05:30 IST

బోనాల సందర్భంగా 8 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ...

బోనాల బందోబస్తులో 8 వేల మంది సిబ్బంది

హోంగార్డు నుంచి సీపీ దాకా అందరూ విధుల్లోనే..

నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు


హైదరాబాద్‌ సిటీ: బోనాల సందర్భంగా 8 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు, రోప్‌పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. శనివారం రాత్రి నుంచి బోనాలు ముగిసేవరకు హోంగార్డు నుంచి కమిషనర్‌ వరకు అందరూ బందోబస్తు విధుల్లో పాలుపంచుకుంటారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కూడా విధుల్లో ఉంటారని తెలిపారు. బోనాల ఉత్సవాలు, యాత్రలకు సంబంధించి ప్రతి అంశాన్ని సీసీ కెమెరాల ద్వారా నిత్యం పరిశీలిస్తుంటామన్నారు. దీని కోసం కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఏసీపీ రాజావెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం బోనాల ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తుందన్నారు. 


వాహనాల దారి మళ్లింపు

 ఫలక్‌నుమా నుంచి అలియాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను న్యూ షంశీర్‌గంజ్‌ టీ జంక్షన్‌ నుంచి జహనుమా, తాడ్‌బన్‌ వైపు మళ్లిస్తారు. 

 రాజన్నబౌలి నుంచి లాల్‌దర్వాజ వైపు వెళ్లే వాహనాలను పత్తర్‌కీ దర్గా నుంచి రామస్వామి గంజ్‌ వైపు మళ్లిస్తారు. 

 కందికల్‌ గేట్‌ నుంచి లాల్‌దర్వాజ వైపు వెళ్లే వాహనాలను ఛత్రినాక పాతపీఎస్‌ వై జంక్షన్‌ నుంచి గౌలిపురా వైపు మళ్లిస్తారు. 

 బాలాగంజ్‌ నుంచి లాల్‌దర్వాజ వైపు వెళ్లే వాహనాలను లక్ష్మీదేవి పాన్‌ షాపు నుంచి నెహ్రూ విగ్రహం వైపు అనుమతిస్తారు. 

 ఉప్పుగూడ నుంచి మహమ్మద్‌ షుకూర్‌ మసీదు  వైపు వెళ్లే వాహనాలను బాల్‌రాజ్‌ జువెల్లర్స్‌ పాయింట్‌ నుంచి గౌలిపురా క్రాస్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు. 

 గౌలిపురా మార్కెట్‌ నుంచి సుధా టాకీసు వైపు వెళ్లే వాహనదారులు లైబ్రరీ నుంచి అశోక్‌ పిల్లర్‌ క్రాస్‌ రోడ్‌ వైపు వెళ్లాలి. 

 మీర్‌కాదాయేరా, మొగల్‌పురా నుంచి శాలిబండ క్రాస్‌ రోడ్‌  వైపు, అశోక్‌ పిల్లర్‌ వైపు వెళ్లే వాహనాలను మొగల్‌పురా వాటర్‌ట్యాంక్‌ వైపు అనుమతిస్తారు. 

 భవానీ నగర్‌, తలాబ్‌కట్టా నుంచి చార్మినార్‌ వైపు వెళ్లే వాహనాలు బీబీబజార్‌ నుంచి అలీజాకోట్ల వైపు వెళ్లాలి. 

 అలీజాకోట్ల, మొగల్‌పురాల నుంచి చార్మినార్‌ వైపు వెళ్లే వాహనాలు చౌక్‌మైదాన్‌, హాఫీజ్‌ డంకా మసీదు వైపు అనుమతిస్తారు.

 యాకుత్‌పురా నుంచి గుల్జార్‌హౌజ్‌కు వచ్చే వాహనాలను ఎతేబార్‌ చౌక్‌ నుంచి మీరాలంమండి, అలీజాకోట్ల వైపు అనుమతిస్తారు. 

 పురానీహవేలి నుంచి టిప్పుఖానా మసీదు, చత్తాబజార్‌ వైపు వెళ్లే వాహనాలను లక్కడ్‌కోట్‌ క్రాస్‌రోడ్‌ నుంచి దారుల్‌షిఫా వైపు అనుమతిస్తారు. 

 చాదర్‌ఘాట్‌, శివాజీ బ్రిడ్డి, సాలార్‌జంగ్‌ రోటరీ, నూర్‌ఖాన్‌బజార్‌ నుంచి సాలార్‌జంగ్‌ మ్యూజి యం వైపు వెళ్లే వాహనాలను సాలార్‌జంగ్‌ రోటరీ వద్ద నుంచి మళ్లిస్తారు. 

 ఫతేదర్వాజా నుంచి హిమ్మత్‌పురా వైపు వెళ్లే వాహనాలను వాల్గాహోటల్‌ టీ జంక్షన్‌ నుంచి ఖిల్వత్‌ వైపు అనుమతిస్తారు. 

 ఖిల్వత్‌, మూసాబౌలిల నుంచి లాడ్‌బజార్‌ వైపు వచ్చే వాహనాలను మోతిగల్లీ టీ జంక్షన్‌ నుంచి మళ్లిస్తారు. 

 బండీకాఅడ్డా, ఘాంసీబజార్‌ నుంచి గుల్జార్‌హౌజ్‌ వైపు వెళ్లే వాహనాలను మిట్టీకాషేర్‌ నుంచి ఘాంసీబజార్‌, చేలాపురా వైపు అనుమతిస్తారు. 

 పురానాపుల్‌, మూసాబౌలి నుంచి నయాపుల్‌ వైపు వచ్చే వాహనాలను ముస్లింజంగ్‌ బ్రిడ్జి నుంచి బేగంబజార్‌ వైపు అనుమతిస్తారు.

 గౌలిగూడ, సిద్ధిఅంబర్‌ బజార్‌ నుంచి నయాపుల్‌ వైపు వచ్చే వాహనాలను అఫ్జల్‌గంజ్‌ క్రాస్‌రోడ్‌ నుంచి మళ్లించి ముస్లింజంగ్‌ బ్రిడ్జి, ఉస్మానియా ఆస్పత్రి వైపు అనుమతిస్తారు. 

 మదీనా క్రాస్‌ రోడ్‌ నుంచి ఇంజన్‌బౌలి మధ్యలో ఉన్న గుల్జార్‌హౌజ్‌, చార్మినార్‌, హిమ్మత్‌పురా, నాగులచింత, అలియాబాద్‌ రోడ్లు పూర్తిగా మూసి ఉంటాయి. 

 ఆర్టీసీ బస్సులు పాత సీబీఎస్‌ నుంచి గౌలిగూడ రాం మందిర్‌ రోడ్‌, దారుల్‌షిఫా క్రాస్‌ రోడ్స్‌, ఇంజన్‌బౌలిల వద్ద ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాల్సి ఉంటుంది. 

 భక్తులు తమ వాహనాలను తాము వచ్చే ఏరియాల ఆధారంగా శాలిబండ పోస్టాఫీసు ఎదురుగా, ఆర్యమైదాన్‌ వద్ద, లక్ష్మీనగర్‌ వేంకటేశ్వర టెంపుల్‌, సరస్వతీ విద్యానికేతన్‌, ఫలక్‌నుమా జూనియర్‌ కాలేజీ, పత్తర్‌కీ దర్గా సమీపంలో, చార్మినార్‌ బస్‌ టర్మినల్‌లో పార్క్‌ చేసుకోవాలి. 


అంబర్‌పేట్‌లో ఉదయం 10 నుంచి జిల్లా, సిటీ బస్సులు

అంబర్‌పేట్‌ మహంకాళి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉప్పల్‌ నుంచి అంబర్‌ పేట్‌ మీదుగా సీబీ్‌సకు వచ్చే జిల్లా బస్సులను ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, హబ్సిగూడ, తార్నాక, అడిక్‌మెట్‌, విద్యానగర్‌, ఫీవర్‌ ఆస్పత్రి, టూరిస్ట్‌ హోటల్‌ జంక్షన్‌, నింబోలి అడ్డ, చాదర్‌ఘాట్‌ల మీదుగా సీబీఎస్‌ కు అనుమతిస్తారు. తిరిగి వెళ్లే జిల్లా బస్సులు కూడా అవే రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. 

 ఉప్పల్‌ నుంచి అంబర్‌పేట్‌ మీదుగా వెళ్లే సిటీ బస్సులను గాంధీ విగ్రహం వద్ద మళ్లించి సీపీఎల్‌ అంబర్‌పేట్‌, సాల్ధానా గేట్‌, అంబర్‌పేట్‌ టీ జంక్షన్‌, రోడ్‌ నెంబర్‌ 6 మీదుగా అనుమతిస్తారు. తిరిగి వెళ్లే బస్సులు కూడా అవే రూట్లలో వెళ్తాయి. 

 సోమవారం మధ్యాహ్నం 3గంటల నుంచి తెల్లవారు జాము 3గంటల వరకు ఉప్పల్‌ నుంచి అంబర్‌పేట్‌ మీదుగా వెళ్లే జిల్లా, సిటీ బస్సులు ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి తార్నాక, అడిక్‌మెట్‌, కాచిగూడ, నింబోలిఅడ్డల మీదుగా మళ్లిస్తారు. తిరిగి వెళ్లే బస్సులు అవే రూట్లలో వెళ్లాలి. 

 దిల్‌సుక్‌నగర్‌ నుంచి అంబర్‌పేట్‌ వైపు వెళ్లే బస్సులను అలీ కేఫ్‌ వద్ద మళ్లించి జిందా తిలిస్మాత్‌ రోడ్‌- రోడ్‌ నెంబర్‌ 6, తిలక్‌నగర్‌, నింబోలిఅడ్డల వైపు మళ్లిస్తారు.

 ఉప్పల్‌ నుంచి వచ్చే సాధారణ వాహనాలు రాయల్‌ జ్యూస్‌ కార్నర్‌, మల్లికార్జున్‌ నగర్‌, డీడీ కాలనీ, సిండికేట్‌ బ్యాంక్‌ల మీదుగా వెళాల్సి ఉం టుంది. నింబోలి అడ్డ నుంచి అంబర్‌పేట్‌ వైపు వచ్చే వాహనాలను రోడ్‌ నెంబర్‌ 6, శివం రోడ్‌ లేదా జిందా తిలిస్మాత్‌ల మీదుగా మళ్లిస్తారు. 


ట్యాంక్‌ బండ్‌ కట్టమైసమ్మ గుడి వద్ద 

 ఇక్బాల్‌ మినార్‌ నుంచి కట్టమైసమ్మ గుడి వైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై వాహనాలను అనుమతించరు. 

 లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంఆర్‌ఓ ఆఫీస్‌ నుంచి అశోక్‌నగర్‌వైపు పంపుతారు.

 అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఇందిరాపార్కు వైపు వెళ్లే వాహనాలను అశోక్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌ వైపు పంపుతారు.

 ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను రమ్యా హోటల్‌ నుంచి దోమలగూడ వైపు పంపుతారు.

Updated Date - 2021-08-01T16:06:45+05:30 IST