తాకీదులిచ్చినా వీడని మొండితనం

ABN , First Publish Date - 2021-06-18T17:39:05+05:30 IST

నోటీసులిచ్చినా, పలుమార్లు పోలీసులు అడిగినా వివరాలివ్వడంలో ట్విటర్‌ మొండితనం వీడలేదు. ఎంతోమంది ప్రముఖులు, మీరాచోప్రాలాంటి సెలబ్రిటీలు, చివరకు పోలీసుల మీద...

తాకీదులిచ్చినా వీడని మొండితనం

సోషల్‌ మీడియా వైఖరితో నగర పోలీసుల పాట్లు

అధికారిక ఆదేశాలు వచ్చిన తర్వాతే ట్విటర్‌పై చర్యలు: సీపీ


హైదరాబాద్‌ సిటీ: నోటీసులిచ్చినా, పలుమార్లు పోలీసులు అడిగినా వివరాలివ్వడంలో ట్విటర్‌ మొండితనం వీడలేదు. ఎంతోమంది ప్రముఖులు, మీరాచోప్రాలాంటి సెలబ్రిటీలు, చివరకు పోలీసుల మీద కూడా దుష్ప్రచారాలు జరిగినా ఆయా వివరాలు వెల్లడించడానికి ట్విటర్‌ అయిష్టత చూపడం వివాదాస్పదంగా మారింది. సోషల్‌ మీడియా బాధితులు ఫిర్యాదు చేసినప్పుడల్లా నగర పోలీసులు ఎన్నోపాట్లు పడాల్సి వస్తోంది. ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకున్న తర్వాత.. దర్యాప్తు అంశాల్లో ఎన్నో ఇక్కట్లు తప్పడం లేదు.


ట్విటర్‌పై కేసులు?

ట్విటర్‌ తీరుపై పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో కొత్త చట్టం అమల్లోకి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారిక ఉత్తర్వులు రానందున ట్విటర్‌ బాధితుల ఫిర్యాదులు వచ్చినప్పటికీ నిందితులను గుర్తించలేక పోతున్నారు. నిందితుల వివరాలు అందించకుంటే ట్విటర్‌పై కూడా కేసు నమోదు చేయడానికి వెనకాడమని సైబర్‌క్రైం పోలీసులు చెబుతున్నారు. అయితే అధికారిక ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మాత్రం ట్విటర్‌పై కేసు నమోదు కావడంతో ఇక్కడి పోలీసులు కూడా ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విటర్‌పై కేసుల విషయం గురించి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను సంప్రదించగా ‘కొత్త చట్టం గురించి అధికారికంగా ఆదేశాలు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.  


మొండిఘటాలు

ట్విటర్‌పై వచ్చే పోస్టులకు సంబంఽధించి ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా.. ఆ కంపెనీకి వివరాల కోసం సైబర్‌ పోలీసులు లేఖలు రాస్తూనే ఉంటారు. సమాధానాలు రాకపోతే నోటీసులు పంపినా ట్విటర్‌ నుంచి స్పందన ఉండక పోవడంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేది సుస్పష్టం. ఫిర్యాదులకు సంబంధించి పోలీసులు పంపిన లేఖలు ఇప్పటికీ ట్విటర్‌ కేంద్రంలో చెత్తబుట్టకే పరిమితమవుతున్నాయి. తాజాచట్టం అమల్లోకి వస్తే నగరంలో పేరుకుపోయిన కేసులు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. ట్విటర్‌ సంగతి సరే.. ఇతర మాధ్యమాల నుంచి కూడా అప్పుడప్పుడు స్పందన అంతంత మాత్రమే అంటున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గోడాడి లాంటి ఎన్నో మాధ్యమాల్లో కూడా తప్పుడు, అభ్యంతరకర పోస్టింగులు.. ఫిర్యాదులు పోలీసులకు అందుతూనే ఉంటాయి. దర్యాప్తులో భాగంగా అలాంటి పోస్టులను తొలగించడం, వాటి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమవుతుంటారు. ఆయా వివరాల కోసం సోషల్‌ మీడియాకు వివరాలు కోరుతూ అధికారులు మెయిల్‌ ద్వారా లేదా పోస్టు ద్వారా లేఖలు పంపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వేగంగా... రోజుల వ్యవధిలో స్పందించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా మాధ్యమాల నుంచి నెలల వ్యవధి ఆలస్యం జరుగుతోందని ఓ అధికారి వివరించారు. 

Updated Date - 2021-06-18T17:39:05+05:30 IST