‘బాకా’ వాయిద్యం డిజైన్‌ అదుర్స్‌

ABN , First Publish Date - 2021-06-18T17:34:20+05:30 IST

ఐటీ కారిడార్‌లో ఆఫీసులున్నా కానీ.. నివాసాలన్నీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల ఉండడంతో సులువైన ప్రయాణాన్ని ఆశిస్తున్నవారికి ఔటర్‌పై వచ్చే...

‘బాకా’ వాయిద్యం డిజైన్‌ అదుర్స్‌

కోకాపేట-ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌కు సులువైన కనెక్టివిటీ

ఔటర్‌పైకి రాకపోకలు సులువు

ప్రారంభమైన నిర్మాణ పనులు


హైదరాబాద్‌ సిటీ: ఐటీ కారిడార్‌లో ఆఫీసులున్నా కానీ.. నివాసాలన్నీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల ఉండడంతో సులువైన ప్రయాణాన్ని ఆశిస్తున్నవారికి ఔటర్‌పై వచ్చే ట్రంపెట్‌ ఓ ఆశల కూడలిగా నిలువనుంది. ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పైకి సులువుగా చేరడానికైనా, కోకాపేట ఇతర ప్రాంతాలకు రయ్యుమంటూ వెళ్లేందుకైనా ఆధునికమైన జంక్షన్‌ కోకాపేటలో ఔటర్‌పై రాబోతుంది. ‘బాకా’ అనే వాయిద్యం మాదిరిగా డిజైన్‌ చేసిన ట్రంపెట్‌ జంక్షన్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఓ కలికితురాయిగా నిలువనుంది. తొలిసారిగా ఔటర్‌పై ట్రంపెట్‌ తరహాలో నిర్మాణ డిజైన్‌ చేయడం విశేషం. ఈ ట్రంపెట్‌ పలు ప్రాంతాల దూర భారాన్ని తగ్గించడంతో పాటు కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌ల తదితర ప్రాంతాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్‌ చిక్కులను సైతం చెక్‌ పెట్టనుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ట్రంపెట్‌ నిర్మాణ పనులను ఓ నిర్మాణ సంస్థ షురూ చేసింది.


ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ వద్ద ఆధునికమైన డిజైన్‌లో ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ను రూ.65కోట్లతో హెచ్‌ఎండీఏ నిర్మాణ పనులు చేపట్టింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఇప్పటికే 19 ఇంటర్‌ ఛేంజ్‌లు ఉండగా, నార్సింగ్‌ వద్ద ప్రతిపాదించిన 20వ ఇంటర్‌ఛేంజ్‌తోపాటు 21వ ఇంటర్‌ఛేంజ్‌ కోకాపేట వద్ద ట్రంపెట్‌ తరహాలో నిర్మిస్తున్నారు.


 హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేటలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తూ ఈ-వేలం వేస్తున్న ‘నియోపొలిస్‌‘ భారీ లేఅవుట్‌కు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌కు సులువైన కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు శంషాబాద్‌ మార్గం, పటాన్‌చెరు మార్గం ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు కూడా నేరుగా కోకాపేట వైపు గల లేఅవుట్‌లోకి రాకపోకలు సాగించేలా నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో నియోపొలిస్‌ లేఅవుట్‌లో నిర్మించే కార్యాలయాలు, భవనాల వద్దకు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చేరుకునే వీలు కలుగుతుంది. మున్ముందు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ఉండేందుకు ట్రంపెట్‌ దోహదపడనుంది. 


ట్రంపెట్‌తో రాకపోకలు ఇలా..

సిగ్నల్‌ లేకుండానే కోకాపేట మూవీ టవర్స్‌ చౌరస్తాలో రాకపోకలు సాగించవచ్చు.

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంతోపాటు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ - కోకాపేట మధ్య ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. 

 శంకర్‌పల్లి ప్రధాన రహదారికి గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ నుంచి మెరుగైన రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తుంది.

 కోకాపేట లేఅవుట్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు, అక్కడినుంచి కోకాపేట లేఅవుట్‌లోకి సులువుగా రాకపోకలు సాగించవచ్చు.

 పటాన్‌ చెరు నుంచి కోకాపేట లేఅవుట్‌లోకి, కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌ నుంచి పటాన్‌చెరు వైపు వెళ్లాల్సిన వాహనాలు సులువుగా ప్రయాణం చేస్తాయి.

 కోకాపేట లేఅవుట్‌- గచ్చిబౌలి - కోకాపేట లేఅవుట్‌లోకి మెరుగైన మార్గంగా ట్రంపెట్‌ నిలువనుంది.

 అనేక మార్గాలకు కూడలిగా ట్రంపెట్‌ జంక్షన్‌ నిలిచినా కానీ, ఎక్కడా వాహనాలు ఆగవు. సిగ్నల్‌ లేకుండానే ప్రయాణం చేస్తాయి.

 ఈ ట్రంపెట్‌కు ఐదు మార్గాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉంటాయి.

Updated Date - 2021-06-18T17:34:20+05:30 IST