HYD : కౌన్సిల్‌లో రగడ.. రెండుగా చీలిన అధికార TRS..

ABN , First Publish Date - 2021-11-30T12:03:45+05:30 IST

పాలకమండలి సమావేశం రసాబాసగా మారింది. వరద నీటి నిధుల వినియోగంపై..

HYD : కౌన్సిల్‌లో రగడ.. రెండుగా చీలిన అధికార TRS..

  • బోడుప్పల్‌ ‘కౌన్సిల్‌’లో రగడ
  • రెండుగా చీలిన అధికార పక్షం
  • నిధుల వినియోగంపై దుమారం
  • పోడియం వద్ద ధర్నా

హైదరాబాద్ సిటీ/ఉప్పల్‌ : బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పాలకమండలి సమావేశం రసాబాసగా మారింది. వరద నీటి నిధుల వినియోగంపై బోడుప్పల్‌ మేయర్‌, కమిషనర్‌లు సోమవారం నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో అధికార టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు రెండువర్గాలుగా వీడిపోయారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో తమ డివిజన్‌కు అన్యాయం జరుగుతోందంటూ కార్పొరేటర్లే పోడియం వద్దకు దూసుకుపోయి ధర్నా నిర్వహించారు. కార్పొరేటర్లు ఆందోళనకు కొందరు బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మద్దతు పలికారు. మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్‌ శ్రీనివా్‌సలు ఏం చేయాలో తెలియక విస్తుపోయారు.


నిధుల పంపిణీపై..

ఇటీవల ప్రభుత్వం బోడుప్పల్‌, పీర్జాదిగూడ కార్పొరేషన్లకు రూ.110 కోట్లను మంజూరు చేసింది. ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో వరద కాలువలు, డ్రైనేజి లైన్ల అభివృద్ధికి వెచ్చించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిధులను సభ్యుల సమ్మతితో ఏ ప్రాంతాల్లో నిధులను వెచ్చించాలన్న దానిపై డీపీఆర్‌(డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. సోమవారం బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్‌ శ్రీనివా్‌సలు కార్పొరేటర్లతో కలిసి నిధుల వినియోగంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమయంలో వరద ముంపు ప్రాంతాలపై తమ డివిజన్లలో ఎందుకు ఆ నిధులను వెచ్చించడం లేదంటూ మొదట 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాసాల వెంకటేష్‌ యాదవ్‌ నిరసనకు దిగారు. ఆయనకు మద్దతుగా ఇటీవల వరదలతో నష్టపోయిన డివిజన్లలోనూ నిధులు వెచ్చించాలంటూ సీసా వెంకటే్‌షయాదవ్‌, సుమన్‌ నాయక్‌, జడిగె మహేందర్‌, అంజలీ శ్రీధర్‌గౌడ్‌, లతా రామచంద్రారెడ్డి, కొత్త దుర్గమ్మ, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొమ్మక్‌ కళ్యాణ్‌, కోఅప్షన్‌ సభ్యులు బొద్దుల సుగుణ, నజియా బేగం నిరసనకు దిగారు.


కార్పొరేటర్‌ రాసాల వెంకటే‌ష్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాచెరువు ఎగువ పూర్తిగా కలుషితమైందని, తమ డివిజన్‌ కాలనీల్లో సరైన వరద కాలువలు, డ్రైనేజీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ సమస్యల పరిష్కారానికి నిధులు ఎందుకు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగితా కార్పొరేటర్లు మద్దతు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులను కేవలం ఒక ప్రాంతానికి వెచ్చించడం ఏమిటని వారు ప్రశ్నించారు. చివరకు దిగొచ్చిన మేయర్‌ బుచ్చిరెడ్డి రా చెరువు దిగున కాలనీల్లో వరద నివారణ పనులకు గాను రూ.10 కోట్లు కేటాయిస్తూ డీపీఆర్‌ తయారు చేయాల్సిందిగా కమిషనర్‌ను ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది. దీనిపై కమినర్‌ శ్రీనివా్‌సను వివరణ కోరగా మొదటి చెంగిచెర్ల, అశోక్‌నగర్‌ ప్రాంతాలకు నిధులు కేటాయించిన మాట వాస్తమేనని, రా చెరువు దిగువన కాలనీల్లో కూడా ఇటీవల వరదలతో ప్రజలు ఇబ్బంది పడ్డ సంగతి అందరికీ తెలిసినప్పటికీ మేయర్‌ సూచనల మేరకే డీపీఆర్‌ రూపొందించామని కమిషనర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం పాలక మండలి సమావేశం నిర్ణయం మేరకు డీపీఆర్‌లో మార్పు చేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-30T12:03:45+05:30 IST