Hyderabad లో ఘోరం.. కాలేజీకి బయల్దేరిన మైనర్‌పై గ్యాంగ్‌ రేప్‌..?

ABN , First Publish Date - 2021-12-08T16:46:39+05:30 IST

భాగ్యనగరంలో మరో ఘోరం చోటుచేసుకుంది. కాలేజీకి బయలుదేరిన...

Hyderabad లో ఘోరం.. కాలేజీకి బయల్దేరిన మైనర్‌పై గ్యాంగ్‌ రేప్‌..?

  • ఆటో డ్రైవర్ల ఘాతుకం.. అదుపులో నిందితులు
  • నిర్ధారించని పోలీసులు

హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పుర : భాగ్యనగరంలో మరో ఘోరం చోటుచేసుకుంది. కాలేజీకి బయలుదేరిన మైనర్‌ను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఆటోడ్రైవర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అతడి తర్వాత మరో నలుగురు డ్రైవర్లు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న బాలిక ఎట్టకేలకు ఇంటికి చేరుకోవడంతో ఈ విషయం బయట పడింది. ముందు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు లైంగిక దాడి ప్రచారంతో సెక్షన్లను సవరించినట్లు తెలిసింది. దీనిపై సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. 


తొలుత మిస్సింగ్‌ కేసు..

సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ బాలిక (17) ఇంటర్‌ చదువుతోంది. గత నెల 30న కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. మధ్యలో ఓ సారి తండ్రితో ఫోన్లో మాట్లాడి కాలేజీ ఫీజు గురించి చర్చించింది. సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్‌ చేయగా కాలేజీ పూర్తయిన తర్వాత పానీపూరీ తిని తాను, ఆమె ఇళ్లకు వచ్చేశామని చెప్పింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెదికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో అదే రోజు అర్ధరాత్రి బాలిక తల్లిదండ్రులు సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.


పరారీలో ఒకరు..

పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ నెల 4న (నాలుగు రోజుల తర్వాత) ఆమె చాదర్‌ఘాట్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సుల్తాన్‌బజార్‌ పీఎస్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఇన్ని రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. తనకు తెలిసిన ఆటోడ్రైవర్‌ మాయమాటలు చెప్పగా, అతడి వెంట వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. నగర శివారు ప్రాంతం మేడిపల్లి వద్దకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. మరో నలుగురు ఆటోడ్రైవర్లు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.


వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికను తీసుకెళ్లిన ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఇతర డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అయిదుగురు ఆటోడ్రైవర్లపై కిడ్నాప్‌, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


విచారణ జరుపుతున్నాం: పోలీసులు

బాలిక విషయమై విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి అక్కడ విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై మేడిపల్లి పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-08T16:46:39+05:30 IST