హైదరాబాద్ శివారులో అభినవ కాలకేయుడు.. ఖాళీ స్థలం కనిపిస్తే నిస్సిగ్గుగా కబ్జా

ABN , First Publish Date - 2022-01-24T00:58:03+05:30 IST

కబ్జారాయుళ్లకు ఆ ప్రాంతం కామధేనువు.. అడుగు పెట్టిన చోటు నుండి అల్లంత దూరం నాదే అన్న అడిగే దిక్కుండదు.. సరిగ్గా అక్కడే ఓ భూ భకాసురుడు...

హైదరాబాద్ శివారులో అభినవ కాలకేయుడు.. ఖాళీ స్థలం కనిపిస్తే నిస్సిగ్గుగా కబ్జా

కబ్జారాయుళ్లకు ఆ ప్రాంతం కామధేనువు.. అడుగు పెట్టిన చోటు నుండి అల్లంత  దూరం నాదే అన్న అడిగే దిక్కుండదు..  సరిగ్గా అక్కడే  ఓ భూ భకాసురుడు తన  కబ్జా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు.  నోటరీలతో నోట్ల కట్టలను వెనకేసుకున్నాడు. రెవెన్యూ అధికారులా  అయితే ఏంటి.. పోలీసులా వస్తే రాని.. నన్ను ఢీ కొట్టేదెవరు. కబ్జాలు పెట్టడంలో నా ట్రాక్ రికార్డ్ క్రాస్ చేసేదెవరు అంటూ సవాల్  విసురుతున్నాడు. ఇంతకీ కబ్జాకోరులకు వరదాయినిగా మారిన ఆ ప్రాంతం ఏది?. కబ్జా కోరలతో వికటాట్టహాసం చేస్తున్న ఆ అభినవా  కాలకేయుడు ఎవరు?..


హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేలాది ప్రభుత్వ భూములకు నెలవు. ఇప్పుడా ఆ భూములు కబ్జా రాయుళ్ల చెరలో చిక్కి  శల్యమవుతున్నాయి.  ఇప్పటికే వేలాది ఎకరాల  ప్రభుత్వ భూములను కబ్జా  రాయుళ్లు నిస్సుగ్గుగా కబ్జా పెట్టేశారు. ప్రభుత్వ  భూములను విక్రయించి కోట్లకు పడగెలెత్తారు. కొన్న వారిని నిండా ముంచేశారు. హైదరాబాద్ నగర శివారులో ఉండే జవహర్ నగర్  కబ్జారాయుళ్లకు బంగారు బాతు గుడ్డుగా మారింది. కబ్జా పెట్టడం, ప్లాట్లు వేయడం వాటిని  విక్రయించి కోట్లు వెనకేసుకోవడం... ఈ తంతు  జవహర్ నగర్‎లో పరిపాటిగా మారిపోయింది.  జవహర్ నగర్ చుట్టూ సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూము ఉన్నట్టు  రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి.  కబ్జా రాబందులు ఆ భూములను మెక్కేసి తమ అంతస్తులు పెంచుకోవడంతో ఆ భూములు  ఇప్పుడు  వేల ఎకరాల నుండి వందల ఎకరాలకు చేరుకున్నాయి. రెవెన్యు రికార్డుల్లో  వేలా ఎకరాలు అని లెక్కలు కనిపిస్తున్న క్షేత్ర స్థాయిలో  పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. 


జవహర్ నగర్‎లో ప్రభుత్వ భూములు చిక్కి శల్యమైపోవడానికి ఒకే ఒక్కడు కారణం అంటూ జవహార్ నగర్ ఘోషిస్తోంది. మొన్నటి దాకా  కామాన్ మ్యాన్‎గా ఉన్న ఇతను...  భార్య కార్పొరేటర్ కాగానే షాడో కార్పొరేటర్‎గా మారాడు. ఖద్దరు చొక్కా  మాటున ఈ చీకటి  వ్యవహారం బహిరంగంగానే నడిపిస్తున్నాడు.  ఆ కిలాడీ  షాడో కార్పొరేటర్‎కు ల్యాండ్ కబ్జాల్లో గొప్ప ట్రాక్ రికార్డే ఉంది. కబ్జాలతో  మెక్కిన సొమ్ము కడుపు నింపలేదో ఏమో ఈ పేకాట చిల్లర కోసం కక్కుర్తి పడి ఈ మధ్యనే అడ్డంగా పోలీసులుకు బుక్కయ్యాడు. ఇంత  ఉపోద్ఘాతం ఎవరి గురించా అనే కదా మీ డౌట్.. అతనేవరో కాదండోయ్  జవహార్ నగర్ టీఆరఎస్  మూడో డివిజన్ కార్పొరేటర్ రోజా భర్త  బల్లి శ్రీనివాస్. ఇక్కడ పేరుకే భార్య కార్పొరేటర్.  అజమాయిషీ మొత్తం బల్లి శ్రీనుదే.  జవహర్ నగర్‎లో తన అనుచర గణంతో యథేచ్ఛగా  కబ్జాలకు పాల్పడుతున్న ఈ కిలాడీ కేటుగాడు అటు రెవెన్యూ అధికారులకు, ఇటు ఖాకీలకు తలనొప్పిగా మారాడు. మంత్రి మల్లారెడ్డి  అనుచరుడు కావడంతో అధికారులు సైతం కబ్జా బాగోతాన్ని లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.


తొండ ముదిరి బల్లిగా మారినట్టు బల్లి శ్రీను  పొలిటీషియన్‎గా మారిన తర్వాత అక్రమంగా కూడబెట్టిన సొత్తుతో విలాసవంతమైన  జీవితానికి అలవాటు పడ్డాడు.  అసలు ఈ కబ్జా కోరు ల్యాండ్ కబ్జా ఎలా చేస్తాడు, కబ్జా చేసిన ల్యాండ్‎ను ఎలా విక్రయిస్తాడు. బల్లి శ్రీను  అసలు రంగు ఏంటో తెలుసుకోవడానికి ఏబీఎన్ టీం స్వయంగా రంగంలోకి దిగింది. నిఘా కెమెరాలతో  తెర వెనుక సాగుతున్న బల్లి శ్రీను  కబ్జాల బాగోతాన్ని బయట పెట్టింది.


బల్లి శ్రీను కబ్జా బాగోతాన్ని బయట పెట్టేందుకు ముందుగా ఏబీఎన్ టీం అతనికి కాల్ చేసి తమకు ప్లాట్ కావాలని కోరింది. కాల్‎కు రెస్పాండ్ అయినా బల్లి మరుసటి రోజు రమ్మని చెప్పడంతో జవహార్ నగర్‎కు వెళ్ళింది.  బల్లి శ్రీనును  కలుసుకున్న ఏబీఎన్ టీం తమకు ఫ్లాట్ కావాలని అడగడంతో  ఏబీఎన్ టీం‎కు ప్లాట్ చూపించడానికి ఓ  వ్యక్తిని పురమాయించాడు. 


దీంతో ఆ వ్యక్తి  ఏబీఎన్ టీంను ముందుగా చెన్నాపురం నుండి డెంటల్  కాలేజ్  వెళ్ళేదారిలో ఐదు ఎకరాల  ల్యాండ్ వద్దకు తీసుకుకెళ్ళాడు.  ఆశ్చర్యంగా ఆ ల్యాండ్‎లో దిస్ ల్యాండ్ బిలంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అనే బోర్డు ఉంది.  అదేంటి  ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్  కదా అని ఏబీఎన్ టీం అడిగితే ప్రభుత్వ  భూమేనని తెలుసు.. అమ్మడం అక్రమం అని తెలుసు.. అన్ని తెలిసిన నాకేటి సిగ్గు అన్నట్టు  ఈ కబ్జా రాయుడు ఆ భూమిని కబ్జా పెట్టేసి ఫ్లాట్‎లుగా విభజించి ఎదేచ్చగా విక్రయిస్తూన్నాడు.. ఒక్కో ప్లాట్ ఎనభై గజాలుగా విభజించి ఎనిమిది నుండి పది లక్షల  వెలకట్టి దర్జాగా వికృయించి జేబు  నింపుకుంటున్నాడు.. అక్కడ ల్యాండ్ చూడటం ముగిశాక బల్లి శ్రీను పురమాయించిన ఏబీఎన్ టీం‎ను మరోచోటికి తీసుకెళ్లాడు..  ప్రధాన రోడ్డుకు అనుకుని ఉన్న చిక్కులోని బావిలోని సర్వే నెంబర్ 266,267,268లోని పది ఎకరాల ల్యాండ్ వద్దకు తీసుకెళ్లారు.. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. చిక్కులోని బావిలో కూడా దిస్ ల్యాండ్ బిలంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అనే బోర్డు దర్శనం ఇచ్చింది..    


ఇక్కడ కూడా ప్లాట్ ఎనిమిది  నుండి  పదిహేను లక్షల దాకా వెల కట్టి  విక్రయిస్తున్నాడు బల్లి శ్రీను..  ఎక్కడైనా ఓ వెంచర్ వేయాలంటే మున్సిపల్ రెవెన్యూ శాఖ అనుమతులు తప్పనిసరి. అగ్రికల్చర్ ల్యాండ్ లను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‎గా మార్చాలి.. బల్లికి ఇవేమీ పట్టవు... ల్యాండ్ కబ్జా పెట్టమా విక్రయించామా. జేబు నిండిందా అని మాత్రమే ఆలోచిస్తాడు.. ప్లాట్లు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత రెవెన్యూ మున్సిపల్ అధికారులకు ముట్టచెపుతాడు. దీంతో వారు కూడా ముక్కు మీద వేలేసుకుని వేడుక చూడటానికే పరిమితం అవుతున్నారు.


ఇక ల్యాండ్ చూడటం అయ్యాక  బీఎన్  క్రైమ్ టీం తిరిగి బల్లి శ్రీను వద్దకు వచ్చింది.  ఇక్కడే అసలు కథ మొదలయింది.  ఇప్పుడు  ఏకంగా బల్లి శ్రీను రంగంలోకి దిగి తన కబ్జా బాగోతాన్ని  వివరించాడు. కబ్జా పెట్టిన ల్యాండ్‎లను తన స్వంత  ల్యాండ్‎లుగా పేర్కొంటూ లే  ఔట్ పత్రాలను సైతం చూపాడు. ఇందాక తాము చూసిన భూముల్లో ప్రభుత్వ భూములు అని బోర్డులు ఉన్నాయి  కదా అని ఏబీఎన్ టీం  ప్రశ్నిస్తే జవహర్ నగర్ మొత్తం నాదే అంటాడు ఈ షాడో కార్పొరేటర్.. తాను అమ్మేది మాజీ సైనికుల ల్యాండ్ అయితే ఆ లెక్కన జవహర్ నగర్ మొత్తం మాజీ సైనికులకు అలాట్ చేసిన భూమే అంటాడు... ఆల్రెడీ జవహర్ నగర్‎లో నివసించే వారికి రాని సమస్య మీకెందుకు  వస్తుందని ప్లాట్ కొనుగోలు దారులకు అభయం ఇస్తాడు.


అయితే ఇక్కడే ఓ చిన్న అసలైన మెలిక ఉంది. బల్లి శ్రీను వద్ద కొనుగోలు చేసినా అప్పటికప్పుడు అందులో నిర్మాణాలు చేపట్టడం  కుదరదు. ఈ విషయం తనతో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారికి ముందుగానే చెప్తాడు ఈ షాడో కార్పొరేటర్.... ల్యాండ్ తాము  మాజీ సైనికుల కుటుంబాల నుండి లీగల్ కొనుగోలు చేశామని చెప్తునే ఈ ల్యాండ్‎పై కొన్ని వివాదాలు ఉన్నాయని ఇవన్నీ మాజీ  సైనికులకు చెందిన భూములు కావడంతో ఎన్నికల సమయానికి ఈ భూములన్నీ తన పేరుపై  క్రమబద్దీకరింపబడతాయని  నమ్మిస్తాడు..  మరో ఆరు నెలల్లో ఈ భూములు అన్ని రెగ్యులర్ అయ్యాక అప్పుడు అందులో నిర్మాణాలు   చేసుకోవచ్చని వివరిస్తాడు. సరే ఆరు నెలలు గడిచాక అయిన అతని వద్ద ఫ్లాట్ కొన్నవారు తమకు నచ్చిన రీతిలో ఇళ్లు కట్టుకునే  అవకాశం ఉందా అంటే అదీ లేదు. జస్ట్ 10 బై 10  విస్తీర్ణంలో మాత్రమే ఓ చిన్న గది లాగా నిర్మించుకోవాలల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా  బల్లి శ్రీను చట్టప్రకారం లే అవుట్‎లు వేసి విక్రయిస్తే ఇన్ని నిబంధనలు అవసరమా...  


నిజానికి బల్లి శ్రీను ఆక్రమించిన భూములన్నీ మాజీ సైనికులకు  చెందినవి.. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సుమారు 102 మంది  సైనికులకు జవహర్ నగర్‎లో ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున భూమిని  కేటాయించి పాసుబుక్కులు అందచేసింది అప్పటి ప్రభుత్వం..  ఆ భూముల్లో కొన్ని వివాదాలు నెలకొనడంతో  బల్లి శ్రీను లాంటి భూ కబ్జాదారులు రంగ ప్రవేశం చేశారు.  ఈ భూములను సైనికుల  కుటుంబాల నుండి తాము గిఫ్ట్ రూపంలో కొనుగోలు చేశామని, అలా కొనుగోలు చేసిన భూములనే తాము విక్రయిస్తామని అందులో  తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నాడు బల్లి.. ఈ షాడో కార్పొరేటర్ తను కబ్జా పెట్టి అమ్ముతున్న ల్యాండ్‎లో గవర్నమెంట్ బోర్డులు పాతిన  నిస్సుగ్గుగా ఆ భూములు తనవేనని వాదిస్తాడు. వాటిని అమాయకులకు విక్రయించి తన అంతస్తులు పెంచుకుంటున్నాడు


బల్లి శ్రీను వద్ద కొనుగోలు చేసిన ప్లాట్లు అసలు రిజిస్ట్రేషన్ కావు. కేవలం నోటరీల మీదే  ఫ్లాట్ల క్రయవిక్రయాలు కొనసాగుతాయి. బల్లి శ్రీను  వద్ద ఫ్లాట్‎లు కొన్న అమాయకులు కనీసం ఇంటిముందు మరుగుదొడ్డి కూడా నిర్మించుకోలేక పోతున్నారు.. పునాది తవ్విన మరుక్షణం  అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు కూల్చేస్తున్నారు. అయ్యా ఇదేంటని బల్లి వద్దకు వెళ్లి మోర పెట్టుకుంటే నేను ఫ్లాట్  అమ్మాను మీరు కొన్నారు.. మున్సిపల్ అధికారులు వస్తే నాకేం సంబంధం అంటూ తప్పించుకుంటున్నాడు. లక్షలు వెచ్చించి ఫ్లాట్‎లు  కొనుగోలు చేసినా నిర్మాణాలు చేపట్టడానికి  ఇటు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు అడ్డు చెప్తూ ఉండటంతో బల్లి శ్రీను వద్ద ఫ్లాట్‎లు  కొనుగోలు చేసిన వారు లబోదిబో మంటుంన్నారు. ఒకవేళ అధికారులను కాదని నిర్మాణాలు చేపట్టిన కూడా తర్వాత ఆ నిర్మాణాలను  కూల్చి వేస్తూ ఉండటంతో రోధిస్తున్నారు.


జవహర్ నగర్  ఈ అభినవ కాలకేయుడు కేవలం కబ్జాలు మాత్రేమే కాదు. అతను చేయని ఇల్లీగల్ బిజినెస్ లేదు.  బినామీల పేరుతో బెల్ట్  షాపులు,  నకిలీ  మద్యం అమ్మకాలు కూడా  యథేచ్ఛగా సాగిస్తున్నట్టు సమాచారాం.  ఖాళీ మద్యం  బాటిళ్ల వ్యవహారంపై బల్లి శ్రీను  ఏబీఎన్ టీం ముందు నిస్సుగ్గుగా మాట్లాడాడు.. జవహర్ నగర్‎లో బల్లి శ్రీను అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటికే అతనిపై పలు  భూ కబ్జా కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ మధ్యనే పేకాట ఆడుతూ పట్టుబడ్డాడు ఈ ఘనుడు. భూ కబ్జా కేసులు అధికం కావడంతో ఏ కబ్జా రాయుడు ఈ మధ్యనే కండువా మార్చి కారెక్కేశాడు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరుతూ బల్లి తన కబ్జా బాగోతాన్ని కొనసాగిస్తున్నాడు.


అసలు బల్లి శ్రీను బలం ఏంటి. ఎందుకు పోలీసులు రెవెన్యూ అధికారులు కబ్జాలపై ఉక్కుపాదం మోపట్లేదు. అమాయకులు నష్టపోతున్న  కోట్లాది రూపాయాల ప్రభుత్వాం భూములు బల్లి కబ్జా దాహానికి కనుమరుగు అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇకనైనా  తన రాజకీయ పలుకుబడితో  రెచ్చి పోతున్న ఈ  కబ్జా కోరుకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే జవహర్ నగర్ లో ఉండే  ప్రభుత్వ భూములు  బల్లి కబ్జా కోరల్లో చిక్కి  శల్యం కాకా తప్పదు.



Updated Date - 2022-01-24T00:58:03+05:30 IST