Hyderabad లోని ఈ ప్రాంతాల్లో వాన రాకపోయినా.. ఇళ్లల్లోకి వరదే..!

ABN , First Publish Date - 2021-07-19T18:02:29+05:30 IST

వానొస్తే, వరద ముంచెత్తుతోంది. ఇక్కడ వాన రాకపోయినా వరద వస్తోంది...

Hyderabad లోని ఈ ప్రాంతాల్లో వాన రాకపోయినా.. ఇళ్లల్లోకి వరదే..!

హైదరాబాద్ సిటీ/బేగంపేట : వానొస్తే, వరద ముంచెత్తుతోంది. ఇక్కడ వాన రాకపోయినా వరద వస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు కూకట్‌పల్లి నాలా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఇక్కడ లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. వర్షాకాలం వస్తుందంటే ఇక్కడ వారు వణికి పోతారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఇళ్లు నీటమునగడమే కాకుండా ఎందరో నిరాశ్రుయులయ్యారు. అప్పట్లో వారం రోజుల పాటు ఇళ్లలో వరద నీరు నిలిచి పోవడంతో ఇక్కడ వారిని సహాయ కేంద్రాలకు తరలించారు. కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో వరద ముంపు ఉన్నప్పటికీ కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బేగంపేటలోని బ్రాహ్మణవాడి, అల్లంతోటబాయి ప్రాంతాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. నిత్యం పెద్ద ఎత్తున వరదనీరు ఇళ్లలోకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం, ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాలకు ఈ ప్రాంతాలోని పలు ఇళ్లలోకి వరదనీరు చేరడంతో పాటు రహదారులు సైతం జలమయం అయ్యాయి.


బస్తీల సివరేజీ లైన్లు నాలాలో..

బస్తీలు, కాలనీలకు చెందిన మురుగునీటి పారుదలకు ప్రత్యేక సివరేజీ పైపులైన్లను ఏర్పాటు చేసింది. ఈ మురుగునీరు పైపులైన్ల ద్వారా సమీపంలోని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు చేరుతుంది. కొద్ది సంవత్సరాలుగా కూకట్‌పల్లి నాలా ప్రవహించే బేగంపేట ప్రాంతంలోని ఇరువైపులా ఉన్న వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడీ, అల్లంతోటబావి, మయూరి మార్గ్‌ ప్రాంతాలకు చెందిన మురుగునీటి పైపులైన్లు కూకట్‌పల్లి నాలాలో కలుస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, సివరేజీ బోర్డు సిబ్బందికి ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు. దీంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు సైతం మురుగునీటి పైపులైన్లలో కలిసే విధంగా ఉండడంతో చిన్నపాటి వర్షం వచ్చినా ఈ ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. నాలాలో వరదనీరు చేరితే ఈ ప్రాంతాల్లోని ఇళ్లలోకి మురుగునీటి పైపులైన్ల ద్వారా నాలా నీరు చేరుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-07-19T18:02:29+05:30 IST