Abn logo
Sep 25 2021 @ 11:32AM

వ్యాపారంలో అడ్డొస్తున్నాడని..పెట్రోలు పోసి హత్యాయత్నం

ఫోన్‌లో చిత్రీకరణ.. స్టేటస్‌లో పెట్టడంతో వైరల్‌

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు.. అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో ఘటన


హైదరాబాద్/అల్వాల్‌: వ్యాపారానికి అడ్డుగా వస్తున్నాడనే కక్షతో తోటి కళాకారుడిపైనే పెట్రోలుపోసి హత్యాయత్నానికి పాల్ప డ్డారు కొందరు కళాకారులు. ఆపై ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి స్టేట్‌సలో పెట్టుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. లాల్‌బజార్‌లో నివసించే నాగసాయి (23) లోతుకుంటలో ఓ బ్యాండ్‌ దుకాణంలో పనిచేసేవాడు. ఇటీవల నాగసాయి తానే సొంతంగా కొంతమంది కళాకారులతో కలిసి ట్రూపుగా ఏర్పడి బ్యాండుమేళాన్ని ప్రారంభించాడు. శుభకార్యాలకు, గణపతి నవరాత్రుల్లో బ్యాండ్‌ కొట్టడం ప్రారంభించాడు. నాటినుంచి లోతుకుంటలోని షాపు వారు బ్యాండ్‌ కొట్టేవారు లేక నష్టాలకు గురయ్యారు. దీంతో కక్ష పెంచుకున్న లోతుకుంట కళాకారులు గురువారం మధ్యాహ్నం నాగసాయిని ఓ ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లారు. రాత్రి బంధించి తీవ్రంగా గాయపర్చడంతోపాటు అతని బట్టలు విప్పి ఒంటిపై పెట్రోల్‌ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. వారి గ్రూపులో కొందరు అడ్డుకోవడంతో నాగసాయిని వదిలి వేశారు. దాడి చేసిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన నిందితులు వారి స్టేట్‌సలలో పెట్టుకోవడంతో ఒక్కసారిగా అది వైరల్‌గా మారింది. బాధితుడు నాగసాయి ఫిర్యాదు మేరకు అల్వాల్‌ పోలీసులు ప్రధాన నిందితుడిపై కేసు నమోదు చేశారు.