రూ. 5 వేల కోట్ల విలువగల ప్లాట్లు కబ్జా

ABN , First Publish Date - 2020-09-28T12:09:56+05:30 IST

సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన ప్లాట్ల చుట్టూ ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధులు అక్రమంగా ప్రహరీ నిర్మిస్తున్నారు.

రూ. 5 వేల కోట్ల విలువగల ప్లాట్లు కబ్జా

 చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధులు 

రామచంద్రాపురం, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన ప్లాట్ల చుట్టూ ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధులు అక్రమంగా ప్రహరీ నిర్మిస్తున్నారు. కరోనా సమయంలో ప్లాట్ల యజమానులు స్థలాల వద్దకు రావడం లేదని గుర్తించిన రియల్‌ ఎస్టేట్‌ ప్రతినిధులు పనులు కొనసాగిస్తున్నారు.


మూడు దశాబ్దాల క్రితం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం, కొల్లూరులో కొందరు గ్రామ పెద్దలు రైతుల నుంచి సుమారు 150 ఎకరాలను జీపీఏ తీసుకుని ప్లాట్లు చేశారు. అప్పట్లో నగరంలోని చిరువ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు విక్రయించారు. ప్లాట్లను కొనుగోలు చేసిన వారు రాకపోవడంతో రియల్టర్ల కళ్లు స్థలాలపై పడ్డాయి. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిఽధులు ప్లాట్లను కబ్జా చేశారు.


న్యాయం చేయాలంటూ స్థలాలు కొనుగోలు చేసిన వారు పలుమార్లు ఆందోళన చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులు, పోలీసులు సహకారంతో  ఓ రియల్టర్‌ వాటి చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ప్రహరీ నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్లాట్ల యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. 


అనుమతి లేదు.. కూల్చేస్తాం : కమిషనర్‌ వెంకటమణికరణ్‌

కొల్లూరులోని ప్లాట్ల చుట్లూ నిర్మిస్తున్న ప్రహరీకి అనుమతి ఇవ్వలేదని తెల్లాపూర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటమణికరణ్‌ తెలిపారు. విచారణ చేపట్టి ప్రహరీ కూల్చివేస్తామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-28T12:09:56+05:30 IST