ఆకాశమే హద్దురా!

ABN , First Publish Date - 2022-04-20T17:12:50+05:30 IST

హైదరాబాద్‌ మహానగరంలో నిర్మాణ రంగం తీరుతెన్నులు మారుతున్నాయి. ఆకాశహర్మ్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి

ఆకాశమే హద్దురా!

నగరంలో నింగిని తాకుతున్నాయా అన్నట్లుగా నిర్మాణాలు

ఎత్తయిన భవనాల నిర్మాణానికి రియల్టీ సంస్థల ఆసక్తి 

కొనుగోలుదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ 

2021-22లో 30 అంతస్తులు మించిన ప్రాజెక్టులు 13..

తక్కువ స్థలంలో ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం

జీహెచ్‌ఎంసీ పరిధిలో 41 అంతస్తులు.. 

ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం


టీఎస్-బీపా‌స్‎తో...

తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌ (టీఎస్‌-బీపాస్‌)ను జీహెచ్‌ఎంసీలో గత జూలైౖ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు. అనుమతులు పెరగడానికి ఇదో కారణంగా అధికారులు చెబుతున్నారు. తక్షణ నమోదు, తక్షణ అనుమతి కేటగిరీలో 12 వేలకుపైగా నిర్మాణాలకు అనుమతులిచ్చారు. ఇందులో 500 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలోని భవనాల దరఖాస్తులు 10 వేలకుపైగా ఉండగా.. 75 చదరపు గజాల్లోపు నిర్మాణాలు 746 ఉన్నాయి. మిస్సింగ్‌/లింక్‌ రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇతరత్రా మౌలిక సదుపాయాలు మెరుగుదల కూడా కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఓ కారణమని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. 2021-22లో 1,550 నిర్మాణాలకు నివాసయోగ్య పత్రాలిచ్చారు. నివాస కేటగిరీలో 17,395 నిర్మాణాలకు అనుమతినిచ్చారు. 


హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహానగరంలో నిర్మాణ రంగం తీరుతెన్నులు మారుతున్నాయి. ఆకాశహర్మ్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. భూముల ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఉన్న స్థలంలోనే ఎక్కువ నిర్మాణ విస్తీర్ణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎత్తైన భవనాల నిర్మాణానికి రియల్టర్లు మొగ్గుచూపుతున్నారు. నింగిని తాకుతున్నాయా అన్నట్టుగా ఉండే భవనాల్లో నివాసానికి ప్రజలూ ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఎత్తైన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలను రియల్టీ సంస్థలు చేపడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో కంపెనీల నుంచి ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ జోరందుకుంటోంది. దీంతో వాణిజ్య కేటగిరీలోనూ భారీ భవనాల నిర్మాణం సాగుతోంది.


వీటితో జీహెచ్‌ఎంసీ ఆదాయమూ పెరుగుతోంది. ప్రాజెక్టు కేటగిరీ, నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా రూ.25 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు రుసుము చెల్లిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 30 అంతస్తులు దాటిన 13 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపగా.. వీటిలో 8 నివాస కేటగిరీ, ఐదు వాణిజ్య కేటగిరీ ప్రాజెక్టులున్నాయి. రెండు మల్టీప్లెక్స్‌లూ ఉన్నాయి. వీటితో దాదాపు రూ.350 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఆదాయంలో దాదాపు 70 శాతం బహుళ అంతస్తుల భవనాలవల్లేనని పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నగరానికి పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎత్తయిన భవనాల నిర్మాణం జరుగుతోంది.


ఐటీ కారిడార్‌ వైపు 40 అంతస్తుల వరకు నిర్మాణాలు జరుగుతుండగా.. ఏఎ్‌సరావునగర్‌, నేరేడ్‌మెట్‌, ఎల్‌బీనగర్‌ వైపు 15, 20 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకుజీహెచ్‌ఎంసీ పరిధిలో గరిష్ఠంగా 41 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతిచ్చారు. ఎత్తయిన భవనాలన్నీ బ్లాకులుగా నిర్మిస్తున్నారు. స్థల విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని అంతస్తులకు అనుమతి ఇవ్వవచ్చన్నది నిర్ణయిస్తామని చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి తెలిపారు. 


1,144 కోట్ల ఆదాయం

కరోనా కాలంలో నెమ్మదించిన స్థిరాస్తి రంగం కరోనా తర్వాత జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వ్యయం పెరిగినా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 17,500కుపైగా వివిధ కేటగిరీల నిర్మాణాలకు అనుమతిచ్చారు. దీంతో రూ.1,144 కోట్ల ఆదాయం సమకూరింది. పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా వచ్చిన రికార్డు స్థాయి ఆదాయం ఇదే. కరోనా ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరం లో 11 వేలకుపైగా నిర్మాణ అనుమతులు జారీ చేయగా.. రూ.661 కోట్ల ఆదాయం వచ్చింది. 2018-19లో రూ.854 కోట్లు, 2019-20లో రూ.900 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. 

Updated Date - 2022-04-20T17:12:50+05:30 IST