హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలు..కిలో రూ.లక్షన్నర!

ABN , First Publish Date - 2021-05-11T09:26:09+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రకాల హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను కిలో రూ.లక్షన్నరకు అమ్ముతున్నారు. వాటి నాణ్యతపై అధికారులు ఏ మాత్రం దృష్టిపెట్టడం లేదు

హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలు..కిలో రూ.లక్షన్నర!

ధరపై ప్రభుత్వ నియంత్రణ కరువు

కంపెనీ నిర్ణయించినదానికంటే ఎక్కువకు అమ్ముతున్న వ్యాపారులు

వారితో అధికారులు కుమ్మక్కు

మొలక, నాణ్యత పరీక్షలేవీ?

స్టాప్‌సేల్స్‌ పేరుతో కృత్రిమ కొరత 

ధరలు పెంచి దోపిడీ

ఆర్‌బీకేలకు విత్తనాలివ్వని కంపెనీలు


(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రకాల హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను కిలో రూ.లక్షన్నరకు అమ్ముతున్నారు. వాటి నాణ్యతపై అధికారులు ఏ మాత్రం దృష్టిపెట్టడం లేదు. పైగా విత్తన వ్యాపారులతో కుమ్మక్కై.. అధిక ధరలకు అమ్ముకునేందుకు తోడ్పడుతున్నారు. నిజానికి డిమాండ్‌ ఉన్న విత్తనాలను వ్యాపారులు ఫిబ్రవరి నుంచే పెద్దఎత్తున నిల్వచేశారు. మిరపలో హైబ్రిడ్‌ రకాలకు కర్ణాటకలోని రాణిబెన్నూరు, దేశవాళీ నాటురకాలకు గుంటూరు కేంద్రంగా ఉన్నాయి. రాణిబెన్నూరు నుంచి హైదరాబాద్‌, గుంటూరు వ్యాపారులు లూజు విత్తనాలను గోతాల్లో తెస్తుంటారు. గుంటూరు వ్యాపారులే కర్నూలు, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో వివిధ రకాల విత్తన కంపెనీలు స్థాపించి ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. వివిధ విత్తన కంపెనీల్లో పనిచేసిన చిరుద్యోగులు రాణిబెన్నూరు నుంచి లూజు విత్తనాలను గోతాల్లో తెచ్చి ఆకర్షణీయమైన పాకెట్లతో మార్కెట్‌లో అమ్ముతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆర్మూర్‌, తేజస్విని, యశస్విని, 341, బాడిగ, 5531, బంగారం, జివి2626, రోవి-21, బుల్లెట్‌, కలామ్‌, షార్క్‌, ఏకే-47, 4889, 2222 వంటి హైబ్రిడ్‌ మిరపరకాలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. హైబ్రిడ్‌ విత్తనాలు 7-10 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.300 నుంచి రూ.850 వరకు పలుకుతోంది. కిలో రూ.30 వేల నుంచి రూ.లక్షన్నర చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. మిరపకు వైరస్‌ బెడద ఎక్కువ. దీంతో వైరస్‌ సోకని హైబ్రిడ్‌ విత్తనాలకు రైతులు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆకర్షణీయమైన పాకెట్లు, ప్రచారాలతో వారి బలహీనతను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. 


గత ఏడాది గుంటూరు జిల్లాలో నాన్‌వైర్‌స పేరుతో అనేక కంపెనీలు హైబ్రిడ్‌ మిరప విత్తనాలు అమ్మాయి. వీటికి సరైన కాపు రాకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు(పెదకూరపాడు), ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆందోళన చేయడంతో ఆయా కంపెనీలు రైతులకు నష్టపరిహారం ఇచ్చాయి. వ్యవసాయ శాఖ అధికారులు అన్నిరకాల హైబ్రిడ్‌ విత్తనాలలో మొలక శాతం, నాణ్యతను నిర్ధారించడానికి శాంపిల్స్‌ తీయడం లేదు. శాంపిల్స్‌ తీయాలంటే మూడు శాంపిల్స్‌కు కనీసం 300 గ్రాముల విత్తనాలను తీయాల్సి ఉంటుంది. ధర ఎక్కువ కావడంతో హైబ్రిడ్‌ విత్తనాల శాంపిల్స్‌ను సేకరించి మొలక, నాణ్యత పరీక్షలు చేయడం లేదు. దీంతో విత్తన వ్యాపారులు ఆడిందే ఆటగా మారింది. ఽధరపై కూడా ప్రభుత్వానికి నియంత్రణ లేదు. ప్యాకెట్‌పై కంపెనీలు ముద్రించిన ఽఎమ్మార్పీ దర కంటే రెట్టింపునకు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న మిరప విత్తనాలకు స్టాప్‌సేల్స్‌ ఉత్తర్వులు ఇస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. తద్వారా సరకు తమ స్వాధీనంలోనే ఉందని వారు, ప్రజాప్రతినిధులు.. రైతుసంఘాలను నమ్మిస్తుంటారు. ఎక్కువ ధరకు డీలర్లు విత్తనాలు అమ్మినా అధికారులు, నిఘా వర్గాలు వారి జోలికి పోకుండా ముందుగానే వ్యవహారాన్ని సెటిల్‌ చేసుకుంటున్నారు.


ఆర్‌బీకేల్లో హైబ్రిడ్‌ మిరపవిత్తనాలు ఇవ్వడం లేదు

‘మట్ట్టినమూనాలు, బ్యాంకు రుణాలు, కౌలు రైతుల గుర్తింపు కార్డులు, రైతు భరోసా ధరఖాస్తులు, ఎరువులు, పురుగుమందులు, సబ్సిడీ విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు ఇతర కార్యక్రమాలకు రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించాలని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది ఆర్‌బీకేలలో ఆర్మూర్‌ హైబ్రిడ్‌ మిరప విత్తనాల కోసం రైతులు డబ్బు చెల్లించారు. అధికారులు కంపెనీ ప్రతినిధులతో ఎన్నిసార్లు చర్చించినా ఆర్‌బీకేలకు మిరప విత్తనాలు ఇవ్వలేదు. అధికారులు కంపెనీ ప్రతినిధులతో కుమ్మక్కవడంతో రైతులు ఎక్కువ ధరకు విత్తనాలు కొనుక్కోవలసి వస్తోంది.

  - కంచుమాటి అజయ్‌కుమార్‌, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2021-05-11T09:26:09+05:30 IST