హుజూరాబాద్‌.. గరంగరం

ABN , First Publish Date - 2022-08-05T05:27:34+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసిరారు.

హుజూరాబాద్‌.. గరంగరం
ఉద్రిక్తతంగా మారిన హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా, అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల జెండాలు

-   అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌, బీజేపీ చర్చ నేడు

- భారీగా జన సమీకరణ చేస్తున్న పార్టీలు

- అప్రమత్తమైన పోలీసులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

హుజూరాబాద్‌ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసిరారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి తమ వాదన వినిపించారు. ఈ అంశంపై జెండాలు, ఫ్లెక్సీలు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. గురువారం హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. చర్చకు ఒకరోజు ముందే టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు బలాబలాలు ప్రదర్శించుకుంటూ కర్రలతో ఘర్షణకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున హుజూరాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నది. అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ వేల సంఖ్యలో శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయని చర్చించుకుంటున్నారు. ఈటలకు సవాల్‌ విసిరిన కౌశిక్‌ రెడ్డి వారం రోజుల నుంచే పెద్ద ఎత్తున జనాన్ని చర్చ జరిగే స్థలానికి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, కనీసం 10 వేల మందిని తరలించాలని ఆయన వివిధ మండలాల నాయకులకు సూచించి అందుకు ఏర్పాట్లు చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  ఆయన హుజూరాబాద్‌లో అభివృద్ధిపై చర్చకు రండి అంటూ ఈటలకు సవాల్‌ విసురుతున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని ప్రతిగా బీజేపీ నాయకులు కూడా కౌశిక్‌ రెడ్డిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ఉద్యమ ద్రోహి కౌశిక్‌ రెడ్డి అని, ఉద్యమకారులకు, ఉద్యమ ద్రోహులకు మధ్య చర్చనా అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఈటల పుణ్యంతోనే ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్న కౌశిక్‌రెడ్డికి ఈటలతో బహిరంగ చర్చకు అర్హత లేదని, ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా కౌశిక్‌ రెడ్డికి లేదని పేర్కొంటూ మీతో చర్చించేందుకు మేము సిద్ధం, మేం సరిపోతాం అంటూ కార్యకర్తలు పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈటల రాజేందర్‌ శుక్రవారం ఉదయమే తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని, ఆయన బహిరంగ చర్చలో పాల్గొనరని తెలుస్తున్నది. బీజేపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు చర్చకు వెళ్తారని చెబుతున్నారు. బీజేపీ కేడర్‌ కూడా పెద్ద ఎత్తున హుజూరాబాద్‌కు తరలివచ్చి కౌశిక్‌రెడ్డి బల ప్రదర్శనను సవాల్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. శుక్రవారం చర్చ జరగనుండగా గురువారమే పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు జెండాలు ఏర్పాటు చేసిన కర్రలతోనే దాడి చేసుకునేందుకు సిద్ధం కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించాలని నిర్ణయించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌ శాంతిభద్రతల విభాగం అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, పదిమంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసు సిబ్బందిని హుజూరాబాద్‌ బందోబస్తు ఏర్పాట్లకు తరలించారు. 


 అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు...

- ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌


ప్రగతి భవన్‌ కేంద్రంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగానే హుజూరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, హుజూరాబాద్‌ ప్రజలు, ప్రజాప్రతినిధులు వారు చేసే కుట్రలో భాగం పంచుకోవద్దని, బలికావద్దని ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తాము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమికొట్టే శక్తి ఉందని, నియోజకవర్గ అభివృద్ధిని, ప్రశాంతతను, ఐక్యతను కోరుకునేవాళ్లుగా ఆ పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. చిల్లర మాటలు నమ్మి రెచ్చిపోవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దమ్ముంటే సమస్యలపైన మాట్లాడాలని, శిఖండిలాగా దొడ్డిదారిన యుద్ధం చేసే ప్రయత్నం చేయకుండా నేరుగా యుద్ధం చేయాలన్నారు. గజ్వేల్‌లో అయినా, హుజూరాబాద్‌లో అయినా కొట్లాడేందుకు తన సవాల్‌ను స్వీకరించాలని ఆయన అన్నారు. 


 బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తోపులాట


హుజూరాబాద్‌: పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు జెండాలు, ప్లెక్సీల ఏర్పాటు చేస్తున్న క్రమంలో కర్రలతో దాడులు చేసుకున్నారు. శుక్రవారం జరగనున్న చర్చ వేదిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు కూడా అక్కడికి వచ్చి జెండాలు కట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఈటల డౌన్‌ డౌన్‌ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కౌశిక్‌రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒకరు బీజేపీ నాయకుడిపై కర్రతో దాడి చేశాడు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న సీఐ శ్రీనివాస్‌ ఇరు పార్టీల నాయకులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌కు ముఖంపై దెబ్బ తగిలింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి చెదరగొట్టారు. సుమారు 45నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి.

Updated Date - 2022-08-05T05:27:34+05:30 IST