మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి!

ABN , First Publish Date - 2021-08-06T04:59:17+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు..

మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి!

ఉప ‘సెగ’

మంత్రులు, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక 

పర్యటనల్లో ఆందోళనలు  

రాజీనామాలు చేయాలంటూ ప్రతిపక్షాల కొత్త నినాదం

మంత్రుల పర్యటనల్లో రోప్‌ పార్టీలతో భద్రత

జిల్లాలో రెండు సార్లు మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ అడ్డగింత

మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డికి చికాకులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఎక్కడికిపోయినా నిరసన సెగ తలుగుతోంది. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆందోళనకు దిగుతున్నారు. సొంత నియోజవర్గాల్లో కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. రాజీనామాలు చేయండి.. ఉప ఎన్నిక వస్తే సీఎం వరాలు జల్లు కురిపిస్తారని డిమాండ్‌ చేస్తున్నారు.


ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు అంటే ఇదేనేమో..! హుజూరాబాద్‌ ఉపఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు తమ తమ నియోజకవర్గాల్లో కనీస భద్రత లేకుండా తిరిగిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు భద్రత లేకుండా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌ వాసులకు సర్కార్‌ అడగకుండానే వరాల జల్లులు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దళిత కుటుంబాలకు రూ.10లక్షలు నేరుగా అందచేసే పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే హుజూరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను చకచకా పరిష్కరిస్తుంది. అన్ని సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేస్తున్నారు. స్థానిక ప్రజలు అడిగిందే తడువుగా ప్రభుత్వ పెద్దలు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను సంతోషపరిచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇతర నియోజకవర్గాల ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి మొదలైంది.


ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి చేస్తారా? అనే చర్చ మొదలైంది. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని రాజకీయ లబ్ధిపొందాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. హుజూరాబాద్‌ మాదిరిగానే తమ ప్రాంతాల్లో కూడా దళితబంధు, ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని ఆందోళన చేపడుతున్నాయి. ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్‌తో అధికార పార్టీ నేతలను అడ్డుకునే యత్నం చేసున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ కొత్త నినాదాలు మొదలు పెట్టాయి. ఇలా మిగతా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వత్తిళ్లు పెంచేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.


మీరు రాజీనామా చేస్తేనైనా మాకు సంక్షేమ పథకాలు అందుతాయి. వెంటనే రాజీనామా చేయండి... మళ్లీ మిమ్మల్నే గెలిపిస్తామంటూ ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు స్థానిక ఎమ్మెల్యేలపై వత్తిళ్లు పెంచుతున్నారు. అలాగే కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించలేదనే కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. అధికారిక పర్యటనల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల ద్వారా రాజకీయ లబ్ధిపొందేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు పోటీపడుతున్నాయి. ఏదో ఒక సమస్యను కారణంగా చూపించి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు.


ఇటీవల మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను సైతం రంగారెడ్డిజిల్లాలో రెండు సార్లు అడ్డుకున్నారు. మహేశ్వరంతో పాటు కొత్తూరులో కేటీఆర్‌ను బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. అసాధారణ భద్రత ఉండే కేటీఆర్‌కు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు కొత్తూరులో కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అలాగే మహేశ్వరం పర్యటనకు వచ్చిన కేటీఆర్‌ను ఇవే డిమాండ్లపై బీజేపీ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు, నేతలు తుక్కుగూడలో అడ్డుపడ్డారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, వెంటనే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కొత్తగా ఆందోళనలు మొదలయ్యాయి. మేడ్చల్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని లేదంటే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అలాగే రాపోలు రాములు ఆధ్వర్యంలో బోడుప్పల్‌లో కూడా ఇటీవల మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.


చేవెళ్లలో కల్యాణలక్ష్మి కార్యక్రమంలో చెక్‌లు పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకునే యత్నం చేసిన బీజేపీ నేతలను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఏదో ఒకచోట అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకునే యత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల అధికార పర్యటనలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా భద్రత పెంచుతున్నారు. మంత్రుల పర్యటనల్లో  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రోప్‌ పార్టీలను రంగంలో దింపి భద్రత పెంచారు.




Updated Date - 2021-08-06T04:59:17+05:30 IST