హుజూరాబాద్‌ బరిలో 30 మంది

ABN , First Publish Date - 2021-10-14T07:54:30+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల ...

హుజూరాబాద్‌ బరిలో 30 మంది

  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • ఈటల జమున సహా 12 మంది ఉపసంహరణ
  • పోటీలో నిలిచిన ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు
  • దసరా తర్వాత పోరు ఉధృతం
  • పోటీ నుంచి తప్పుకొన్న మెజారిటీ రెబల్స్‌ 
  • 30 మందిలో ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ
  • వ్యూహాలకు పదునుపెడుతున్న మూడు పార్టీలు


హైదరాబాద్‌/హుజూరాబాద్‌, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. జమునతో సహా మొత్తం 12 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని భావించిన జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు చివరికి ఇద్దరే పోటీలో నిలిచారు. వాస్తవానికి వంద మందితో నామినేషన్లు వేస్తామని ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం ప్రకటించింది. ఈ మేరకు మొదటి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు పలువురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు హుజూరాబాద్‌కు రాగా.. పోలీసులు కొవిడ్‌ నిబంధనల పేరిట అడ్డుకున్నారు. మరుసటి రోజు వచ్చినవారినీ ఇలాగే నిలువరించారు. దీంతో నిరసన తెలిపిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం చేశారు. మొత్తమ్మీద చివరి రోజు ఏడుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు వేశారు. అయితే స్ర్కూటినీలో నలుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరొకరు ఉపసంహరించుకున్నారు. దీంతో ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు.


ఈటలపై ఈసీకి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు 

హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ బుధవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కో ఓటుకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు చెల్లిస్తోందంటూ ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌ సోమ.. ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ, ఈటల గేమ్‌ ప్లాన్‌తో ఓటర్ల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పరువుకు భంగం కలిగే అవకాశం ఉందన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియనే వారు ఎగతాళి చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్‌ఎ్‌సపై ఈటల తప్పుడు ఆరోపణల్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Updated Date - 2021-10-14T07:54:30+05:30 IST