హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరు వెంకట్

ABN , First Publish Date - 2021-10-03T00:41:27+05:30 IST

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరు వెంకట్

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరు వెంకట్

కరీంనగర్: హుజురాబాద్‌ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ వీడింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్‌ బరిలో దిగనున్నారు. పలువురు పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ బలమూరు వెంకట్ పేరును ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండగా.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక నుంచి కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. ఇప్పటి వరకూ కొండా సురేఖ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అయితే అకస్మాత్తుగా బలమూరు వెంకట్‌ పేరు తెర పైకి వచ్చింది. దీంతో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలిసిపోయింది.


కాగా గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీఆర్ఎస్‌లో జరిగిన పరిణామాలతో ఆయన కారు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ‌లో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు ఉప‌ఎన్నికకు  అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 8న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. 13న ఉపసంహరించుకోనున్నారు. 

Updated Date - 2021-10-03T00:41:27+05:30 IST