నిరుపేదల ఇళ్లు కూల్చివేత

ABN , First Publish Date - 2022-06-01T06:15:39+05:30 IST

ఉన్న ఫలంగా వారం క్రితం ఇళ్లను కూల్చేశారు. రోడ్డుమీద పడేశారు. అధికారంలోకి వస్తే.. సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. అది మానేసి, ఉన్న ఇళ్లను కూల్చేశారు.

నిరుపేదల ఇళ్లు కూల్చివేత
ఇల్లు తొలగించిన భూమి ఇదే

గుడిసె  కన్నీరు

కూలి డబ్బులో  ఇళ్ల నిర్మాణం

నాలుగు దశాబ్దాలుగా  అక్కడే బతుకు

అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్దయ

రోడ్డు పక్కన గుడిసెలు వేసుకున్న బాధితులు



ఏ దిక్కూ లేనివారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నాలుగు దశాబ్దాల క్రితం పొట్ట చేతబట్టుకుని ఆ ఊరికి చేరారు. కూలీనాలి చేసుకుంటూ ఇంత ముద్ద తింటున్నారు. కాల క్రమంలో ఆ ఊరిలో భాగమయ్యారు. పైసా పైసా కూడబెట్టి.. చిన్నపాటి ఇళ్లను కట్టుకున్నారు. ఏడాది క్రితం అధికారులు, అధికారపార్టీవారూ వచ్చారు. రోడ్డు, గోడౌను, జగనన్న కాలనీ.. ఇలా ఏవేవో చెప్పారు. ఇళ్లను ఖాళీ చేయాలని సూచించారు. మాట వింటే.. స్థలం ఇచ్చి, ఇళ్లు కట్టిస్తామన్నారు. అదేదో కట్టించాక పంపించొచ్చు కదా..? ఉన్న ఫలంగా వారం క్రితం ఇళ్లను కూల్చేశారు. రోడ్డుమీద పడేశారు. అధికారంలోకి వస్తే.. సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. అది మానేసి, ఉన్న ఇళ్లను కూల్చేశారు.  




అనంతపురం రూరల్‌ : అనంతపురం మండల పరిధిలోని కందుకూరు గ్రామానికి సుమారు 40 ఏళ్ల క్రితం వివిధ ప్రాంతాల నుంచి కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. కూలీలుగా, హమాలీలుగా జీవనం సాగిస్తున్నాయి. గ్రామ సర్వే నెంబరు 185లో 4.85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో పదిహేనేళ్ల క్రితం ఇళ్లు కట్టుకున్నారు. ఈ భూమిని జగనన్న కాలనీగా ప్రకటించి, గత ఏడాది మొదటి విడత కింద కొందరికి ఇంటి స్థలాలు, మరికొంత భూమిని ప్రభుత్వ భవనాలకు కేటాయించారు. ఈ క్రమంలోనే స్థానికంగా నివాసం ఉం టున్న కొన్ని కుటుంబాలను ఇల్లు ఖాళీ చేయించారు. మరికొన్ని కుటుంబాలను అగ్రికల్చర్‌ గోడౌన నిర్మా ణం నిమిత్తం రెవెన్యూ అధికారులు ఇటీవల బలవంతంగా ఖాళీ చేయించారు. వారి ఇళ్లను తొలగించారు. దీంతో దాదాపు 30 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 



గుడిసెల్లో జీవనం

కూలీలు ఉంటున ఇళ్లను కూల్చివేసి, అక్కడే జగనన్న లే ఔట్లలో ఇంటి స్థలాలు కేటాయించారు. ఇది జరిగి ఏడాది గడిచింది. ఆ స్థలాల్లో పునాదులు మాత్రమే వేశారు. బాధిత కుటుంబాలు స్థానికంగా చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. మంజూరైన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యుంటే వారికి కొంత ఊరట లభించేది. కూలి పనులకు వెళితేగాని పూట గడవని స్థితిలో ఉండే ఈ కుటుంబాలు సొంత ఇంటిని నిర్మించుకోగలవా..? అని ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని ఆలోచించలేదు. ప్రభుత్వమే మొత్తం భరించి ఇళ్లను నిర్మిస్తుందా..? అంటే అదీ లేదు..! ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. తమ బతుకులు ఇక ఇంతేనా..? అని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వారికి బుజ్జగింపు

అధికారులు కూల్చివేసిన ఇళ్లలో కొన్ని అధికార పార్టీవారివి. ఇటీవల ఇళ్లను కూల్చివేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. కనీసం ఇంట్లో సామగ్రిని బయట పెట్టుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని వాపోయారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేసింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే, వారిని పిలిపించి బుజ్జగించినట్లు సమాచారం. జగనన్న లే ఔట్‌లో వారికి అదనంగా మరొక ప్లాట్‌ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ మద్దతుదారులు కాబట్టి వారిని పిలిపించి మాట్లాడారని, తమలాంటి వారిని దగ్గరికైనా రానిస్తారా..? అని పలువురు బాధితులు స్థానికుల వద్ద కంటతడి పెట్టుకుంటున్నారు. 



ఈ ఫొటోలో ఉన్న వృద్ధుడి పేరు రాజన్న. అనంతపురం మండంలోని కందుకూరు గ్రామం. ఈయనకు కళ్లు సరిగా కనిపించవు. మాటకూడా సరిగా  పెగలదు. తన భార్య పరిస్థితి కూడా ఇంతే. కొడుకు, కూతురుకు పెళ్లి జరిపించారు. వారు కూడా కూలి పనులకు వెళ్లి బతుకుతుంటారు. ఎవరికీ సొంతిల్లు లేదు. వచ్చే కూలి డబ్బులు ఓ పూట తిండికే సరిపోతాయి. వృద్ధాప్యంలో ఉన్న రాజన్న దంపతులు ఏ పనీ చేయలేరు. వీరి దీన స్థితిని చూసి, స్థానికులు తలాకొంత చందా వేసుకుని, బండలు పాతి ఓ గూడును నిర్మించి ఇచ్చారు. అందులోనే అందరూ తలదాచుకునేవారు. గోదాము నిర్మాణం పేరిట వారం క్రితం వీరి ఇంటిని పడగొట్టేశారు. దీంతో ఆ వృద్ధ దంపతులు అనంతపురం-కందుకూరు ప్రధాన రహదారి పక్కన ఓ చెట్టుకింద చిన్నపాటి గుడిసె వేసుకుని ఉంటున్నారు. బలమైన గాలి వీస్తే ఈ గుడిసె నిలబడదు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా చరమదశలో ఉన్న పండుటాకుల పట్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్దయగా వ్యవహరించారు. 


ఇల్లు కట్టిస్తే బాగుంటుంది..

ఊళ్లో 40 ఏళ్లుగా ఉంటున్నాం. జీవాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. దాదాపు రూ.2లక్షల వరకు ఖర్చు చేసుకుని స్థానికంగా ఇల్లు కట్టుకున్నాం. దాన్ని కూల్చేయడంతో గుడిసెలు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి. ఎంతో బాధగా ఉంది. ఎవరితో చెప్పుకుంటే ఏం ప్రయోజనం..? ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో తొందరగా ఇల్లు కట్టించి ఇస్తే బాగుంటుంది. 

 - గురప్ప, కందుకూరు


ఎక్కడికి పోవాలి..?

పదేళ్ల కిందట దాదాపు రూ.2 లక్షల పెట్టి చిన్నపాటి ఇల్లు కట్టించుకున్నా. కూలి, హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇక్కడ రోడ్డు వస్తుందని, మరోచోట స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని అన్నారు. స్థలం ఇచ్చారు. ఇంత వరకు ఇల్లు కట్టించలేదు. ఐదు రోజుల కిందట ఉన్నఫలంగా ఇంటిని పడగొట్టారు. ఎక్కడికి పోవాలో దిక్కుతోచడం లేదు. ప్రస్తుతానికి వేరేవాళ్ల షెడ్డులో తలదాచుకుంటున్నాం. 

- నారప్ప, కందుకూరు

Updated Date - 2022-06-01T06:15:39+05:30 IST